పోటాపోటీగా నామినేషన్లు
- నేడు పరిశీలనఆరు మున్సిపాలిటీల్లో
- 169 వార్డులకు 1322 నామినేషన్లు
- శ్రీకాళహస్తి నామినేషన్లలో గందరగోళం
- వైఎస్సార్‌సీపీ ధర్నా
సాక్షి, చిత్తూరు : జిల్లాలో ఆరు మున్సిపాలిటీలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగిసింది. గడువు సమయం ముగిశాక శ్రీకాళ హస్తిలో కాంగ్రెస్ పార్టీ వారు నామినేషన్ దాఖలు చేయడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్ సీపీ ధర్నా చేసి నిరసన తెలియజేసింది. ఈ సంఘటన మినహా నామినేషన్ల ఘట్టం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది.
నగరి, పుత్తూరు, పలమనేరు, పుంగనూరు, శ్రీకాళహస్తి, మదనపల్లె మున్సిపాలిటీల్లో 169 వార్డులకు ఐదురోజుల్లో (10 నుంచి 14వ తేదీ వరకు) 1322 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిల్లో రెండు సెట్లు, మూడు సెట్లు వేసినవారూ ఉన్నారు. వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థులు 446 మంది, టీడీపీ అభ్యర్థులు 496 మంది, స్వతంత్రులు 253 మంది పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు.
జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు డబుల్ డిజిట్‌కే పరిమితమయ్యాయి. కాంగ్రెస్ 70, బీజేపీ 25 వార్డులకు మాత్రమే అభ్యర్థులను నిలిపాయి. వామపక్షపార్టీల పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. సీపీఎం 12, సీపీఐ 13 వార్డులకు అభ్యర్థులను రంగంలోకి దింపాయి. బీఎస్పీ 4, ఎంఐఎం 3 స్థానాలకు నామినేషన్లు వేశాయి.
కాంగ్రెస్‌కు ఘోర పరాభవం..
రాష్ర్ట విభజనకు పూనుకున్న కాంగ్రెస్ పార్టీపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వార్డు కౌన్సిలర్లుగా కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగేందుకు నేతలు సాహసించలేదు. అవసరమనుకుంటే పార్టీలు మారి నిలబడ్డారు. ఇంకొందరు స్వతంత్రంగా నామినేషన్ వేశారు. అక్కడక్కడా నిలబడిన కాంగ్రెస్ వారి సంఖ్య ఆరు మున్సిపాలిటీల్లోనూ 25 మాత్రమే.
తొలిసారి బరిలో ఎంఐఎం
రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా చిత్తూరు జిల్లా స్థానిక ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయలేదు. అయితే తొలిసారిగా పార్టీని విస్తరించేందుకు మైనార్టీలకు పట్టున్న మదనపల్లె నుంచి ఇద్దరు అభ్యర్థులను కౌన్సిలర్లుగా బరిలోకి దింపింది.
నేడు నామినేషన్లు పరిశీలన..
ఆరు మున్సిపాలిటీల్లో నామినేషన్లను శనివారం పరిశీలించనున్నారు. ఈ నెల 18న నామినేషన్ల ఉప సంహరణ ఉంటుంది. అదే రోజు సాయంత్రం 4 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రదర్శిస్తారు.
పుత్తూరు మున్సిపాల్టీలో
పుత్తూరు మున్సిపాలిటీలోని 24 వార్డులకు 196 నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు శుక్రవారం 115 నామినేషన్లు వేశారు. ఐదు రోజుల్లో వైఎస్‌ఆర్‌సీపీ 86, టీడీపీ 78, స్వతంత్రులు 22, సీపీఎం 4, సీపీఐ 2, బీజేపీ 2 నామినేషన్లు తమ అభ్యర్థులతో వేయించాయి.
నగరి మున్సిపాలిటీలో..
మొత్తం 27 వార్డులకు 186 నామినేషన్లు వచ్చాయి. చివరిరోజు శుక్రవారం అత్యధికంగా 107 నామినేషన్లు వేశారు. వైఎస్‌ఆర్‌సీపీ 70, టీడీపీ 75, స్వతంత్రులు 24, సీపీఐ 3, బిజేపీ 2, బీఎస్పీ 2 నామినేషన్లు తమ అభ్యర్థులతో వేయించాయి.
మదనపల్లెలో
మదనపల్లెలోని 35 వార్డులకు 373 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు 194 వచ్చాయి. వైఎస్‌ఆర్‌సీపీ 115, టీడీపీ 135, స్వతంత్రులు 103, బీజేపీ 12, ఎంఐఎం 2, బీఎస్పీ 1, సీపీఐ 3, కాంగ్రెస్ 1 నామినేషన్లు వేయించాయి.
పలమనేరులో
పలమనేరులోని 24 వార్డులకు 171 నామినేషన్లు వచ్చాయి. చివరి రోజు శుక్రవారం 87 వేశారు. వైఎస్‌ఆర్‌సీపీ 56, టీడీపీ 61, కాంగ్రెస్ 9, స్వతంత్రులు 37, బీజేపీ 2, సీపీఎం 1, సీపీఐ 2 నామినేషన్లు వేయించాయి.
పుంగనూరులో
పుంగనూరులోని 24 వార్డులకు 163 నామినేషన్లు వచ్చాయి. చివరిరోజు అత్యధికంగా 105 నామినేషన్లు వేశారు. ఐదు రోజుల్లో వైఎస్‌ఆర్‌సీపీ 65, టీడీపీ 64, స్వతంత్రులు 30, కాంగ్రెస్ 2, బీజేపీ 1, బీఎస్పీ 1, సీపీఎం 2 నామినేషన్లు వేయించాయి.
శ్రీకాళహస్తిలో
శ్రీకాళహస్తిలోని 35 వార్డులకు 247 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం 154 వుంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వైఎస్‌ఆర్‌సీపీ 53, టీడీపీ 71, కాంగ్రెస్ 56, స్వతంత్రులు 52, సీపీఐ 3, సీపీఎం 5, ఎంఐఎం1, బీజేపీ 6 నామినేషన్లు వేయించాయి.