తిర్కిరించినవి 64
- మున్సిపాలిటీల్లో నామినేషన్ల పరిశీలన పూర్తి
- అక్కడక్కడా వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ అభ్యంతరాలు
- చిత్తూరు కార్పొరేషన్‌లో 13 నామినేషన్ల తిరస్కరణ
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని చిత్తూరు కార్పొరేషన్, ఆరు మున్సిపాలిటీ ల్లో 64 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. కార్పొరేషన్, మున్సిపాలిటీలకు సంబంధించి అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు శనివారం పరిశీలించారు. ఈ ప్రక్రియ ఉదయం నుంచి రాత్రి వరకు సాగింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు వివరాలు ఉన్నాయా, నామినేషన్ వేసిన వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత కలిగి ఉన్నారా వంటి వివరాలను ఎన్నికల సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించారు.
చిత్తూరు కార్పొరేషన్‌కు 673, ఆరు మున్సిపాలిటీలకు 1,322నామినేషన్లు వచ్చాయి. వీటిలో 64 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నగరి, పుంగనూరు మున్సిపాలిటీల్లో ఒక్క నామినేషనూ తిరస్కరణకు గురికాలేదు. చిత్తూరు కార్పొరేషన్‌లో 673 నామినేషన్లకు 13 నామినేషన్లు తిరస్కరించారు. మదనపల్లె మున్సిపాలిటీలో 373 నామినేషన్లు వచ్చాయి. వీటిలో వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ, స్వ తంత్రులు, బీజేపీకి సంబంధించి ఒక్కో నామినేషన్ తిరస్కరణకు గురయ్యాయి.
నగరి 23వార్డులో టీడీపీ అభ్యర్థి గతంలో కోర్టులో ఒక కేసులో జరిమానా కట్టారని, ఈ దృష్ట్యా పోటీ చేయడానికి అనర్హురాలని వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు అభ్యంతరం తెలిపారు. ఫైన్ కట్టిన జిరాక్స్ కాపీని ఎన్నికల అధికారులకు సమర్పించారు. అయితే ఈ అభ్యంతరం చెల్లదని, జడ్జితో సర్టిఫై చేసిన ఒరిజినల్ ప్రతి కావాలని ఎన్నికల అధికారులు అడిగారు. పలమనేరు మున్సిపాలిటీలో 171 దరఖాస్తులకు 27 తిరస్కరించారు. వీటిలో వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ నామినేషన్లు ఉన్నాయి.
శ్రీకాళహస్తిలో 11 నామినేషన్లను తిరస్కరించారు. కాంగ్రెస్-5, టీడీపీ-2, వైఎస్‌ఆర్‌సీపీ-1, స్వతంత్రులు 3 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. పుత్తూరులో 196 నామినేషన్లకు 9 తిరస్కరించారు. వీటిలో టీడీపీ-3, వైఎస్‌ఆర్‌సీపీ-4, స్వతంత్రులు-1, సీపీఎం-1 ఉన్నాయి. ఒకటి రెండు చోట్ల చిన్నపాటి అభ్యంతరాలను టీడీపీ తెలిపింది. మొత్తం మీద నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.