- తేలని చైర్మన్ అభ్యర్థుల ఎంపిక
- ముద్దుకృష్ణమనాయుడుకు చుక్కెదురు
- చెంగారెడ్డి చెప్పినా కాంగ్రెస్‌కు అభ్యర్థులు కరువు
- గందరగోళంలో ఆ రెండు పార్టీల శ్రేణులు
- జోరుగా వైఎస్‌ఆర్ సీపీ
సాక్షి, చిత్తూరు: నగరి నియోజకవర్గంలోని పుత్తూరు, నగరి మున్సిపాలిటీల్లో టీడీపీ, కాంగ్రెస్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. నామినేషన్ల ఘట్టం ముగిసినా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించలేని స్థితిలో ఆ పార్టీలు ఉన్నాయి. ఈ రెండు పార్టీలకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు, మాజీ మం త్రి రెడ్డివారి చెంగారెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. అయితే శ్రేణులపై పట్టు తప్పారు.
విభజన వ్యవహారంలో టీడీపీ, కాంగ్రెస్ వ్యవహరించిన తీరు పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. విభజనను సమర్థించిన పార్టీలుగా ఈ రెండింటిని ప్రజలు చూస్తున్నారు. ప్రజల్లో పట్టున్న నాయకులు ఈ రెండుపార్టీలకు గుడ్‌బై చెప్పి తొలి నుంచి సమైక్యవాదంతో ముందుకెళ్లిన వైఎస్‌ఆర్ సీపీ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే పుత్తూరు మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో అభ్యర్థులను వైఎస్‌ఆర్‌సీపీ బరిలోకి దించింది.
టీడీపీ కన్నా ముందే చైర్మన్ అభ్యర్థిగా డీఎన్.ఏలుమలై(అమ్ములు)ను ప్రకటించింది. అలాగే నగరిలోనూ మాజీ చైర్మన్ కేజె.కుమార్ భార్యతో నామినేషన్ వేయించి చైర్‌పర్సన్ అభ్యర్థి రేసులో వైఎస్‌ఆర్‌సీపీ స్పష్టమైన వైఖరి వెల్లడించింది. పుత్తూరు మున్సిపాలిటీలో చైర్మన్ అభ్యర్థిగా చెప్పుకునేందుకు ఒక అభ్యర్థినీ టీడీపీ ఎంపిక చేసుకోలేక పోతోంది. ఇప్పటికే రెండు గ్రూప్‌లు చైర్మన్
అభ్యర్థిత్వం తమకు కావాలంటే తమకు కావాలని గొడవ పడుతున్నాయి.
ఫలానా సామాజిక వర్గానికి చైర్మన్ పదవి ఇవ్వనున్నామనే కనీస సమాచారాన్నీ ఎమ్మెల్యే ముద్దుకృష్ణమనాయుడు చెప్పలేకపోతున్నారు. పుత్తూరు మున్సిపాలిటీలో వార్డులకు కాంగ్రెస్ తరపున నామినేషన్లు వేసే వారూ కరువయ్యారు. ఇక చైర్మన్ అభ్యర్థి సంగతి సరేసరి.
నగరిలోనూ ఇదే పరిస్థితి
కాంగ్రెస్ తరపున కాకుండా ఎవరికి వారు స్వతంత్రంగా నామినేషన్లు వేసుకోండని మాజీ మంత్రి రెడ్డివారి చెంగారెడ్డి తన అనుచరులకు సూచించారు. దీంతో నగరిలో కాంగ్రెస్‌కు అభ్యర్థులు కరువయ్యారు. అక్కడక్కడా అతికష్టం మీద కాంగ్రెస్ తరపున అభ్యర్థులతో నామినేషన్లు వేయించారు. టీడీపీకి సంబంధించి ఎవరికివారు నామినేషన్లు వేశారు. వీరిలో ఎవరికి బీఫారం ఇస్తారో తెలియని పరిస్థితి. ఇక్కడా ఫలానా వారు టీడీపీ అభ్యర్థి అని ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు ప్రకటించలేదు.
రెండు మున్సిపాలిటీల్లో నామినేషన్ల ఘట్టం ముగిసినా ఇద్దరు మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ఎంపిక చేయలేక తలలు పట్టుకుంటున్నారు. నగరిలో టీడీపీ సీనియర్ నాయకులు పాకా రాజా, శ్రీహరినాయుడు ఇలా ఒకరిద్దరు చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే వీరికి అధిష్టానం, ముద్దుకృష్ణమనాయుడు వైపు నుంచి భరోసా లభించడం లేదు. నగరిలో కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థిని నిలబెట్టే పరిస్థితి పూర్తిగా లేదు. మొత్తం 27 వార్డులకు 11 మందే కాంగ్రెస్ తరపున నామినేషన్లు వేశారు. మొత్తం మీద కాంగ్రెస్, టీడీపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాయి.