
పోలీసులకు సూచనలు చేస్తున్న ఎస్పీ సీహెచ్ విజయారావు
సాక్షి, అమరావతి/ గుంటూరు: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అమరావతి జేఏసీ, టీడీపీలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తమయ్యారు. ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారుల సూచనల మేరకు అసెంబ్లీతో పాటు ముఖ్యమంత్రి, ఇతర వీఐపీలు ప్రయాణించే మార్గాల్లో చెక్‌పోస్టులు, అవసరమైన చోట మూడంచెల భద్రతను ఏర్పాటుచేశారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్ని రెండ్రోజుల ముందునుంచే బాంబ్‌స్క్వాడ్ బృందాలతో జల్లెడ పట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాన్వాయ్ వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఖరారు చేశారు. ఆ మార్గంలో ఆదివారం పోలీసులు ట్రయల్ రన్ నిర్వహించారు. గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ పర్యవేక్షణలో ఎస్పీలు పీహెచ్‌డీ రామకృష్ణ, సీహెచ్ విజయారావులతో పాటు మరో నలుగురు ఎస్పీలు భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
సమస్యాత్మక గ్రామాల్లో చెక్‌పోస్టులు
నిఘా వర్గాల సూచనల మేరకు.. రాజధాని ప్రాంతంలో పోలీస్ యాక్ట్–30తో పాటు 144 సెక్షన్ విధించారు. సమస్యాత్మక గ్రామాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. చలో అసెంబ్లీ, ముట్టడి వంటి కార్యక్రమాలకు ఎలాంటి అనుమతిలేదని, పోలీసు ఆంక్షల్ని ధిక్కరించినా.. నిరసనల్ని ప్రోత్సహించినా చట్టరీత్యా నేరమని పేర్కొంటూ సీఆర్‌పీసీ సెక్షన్ 149 ప్రకారం పలువురికి నోటీసులు జారీ చేశారు. పలు ప్రాంతాల్లో ఆందోళనకారుల్ని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఆయా మార్గాల నుంచి వెలగపూడి వైపు వెళ్ళే వాహనాలను చెక్‌పోస్టుల వద్ద క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తారు.
స్పెషల్ బ్రాంచ్, కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేస్తున్నారు. గరుడ కమాండ్ కంట్రోల్ నుంచి సీసీ కెమెరాల ద్వారా సచివాలయం, అసెంబ్లీ పరిసర ప్రాంతాలను సిబ్బంది నిశితంగా పర్యవేక్షిస్తూ అనుమానమొస్తే వెంటనే అధికారుల్ని అప్రమత్తం చేస్తున్నారు. వీవీఐపీ, వీఐపీలను ప్రధాన గేటు నుంచి అసెంబ్లీలోకి అనుమతిస్తారు. భద్రతా చర్యల్లో భాగంగా మిగిలినవారిని క్షుణ్నంగా తనిఖీ చేశాకే లోపలికి పంపుతారు. పాసులున్న మీడియా ప్రతినిధులను మూడో గేటు నుంచి అనుమతించేలా చర్యలు చేపట్టారు. డ్రైవర్లు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది, ఎమ్మెల్యేల వెంట వచ్చే అనుచరుల్ని లోనికి అనుమతించరు.
అతిక్రమిస్తే చర్యలు తప్పవు: వినీత్ బ్రిజ్‌లాల్, ఐజీ
అసెంబ్లీ ముట్టడికి పోలీసుల అనుమతిలేదు. ఆందోళన కార్యక్రమాల వల్ల అసెంబ్లీ, సచివాలయ, హైకోర్టు ఉద్యోగుల విధులకు, స్థానిక ప్రజల జీవనానికి అంతరాయం కలుగుతుంది. అందుకే చలో అసెంబ్లీ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదు. సోమవారం మంత్రివర్గ సమావేశం, అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున ఎలాంటి ఆందోళన కార్యక్రమాల్ని అనుమతించేది లేదు. పోలీసులకు రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలి. అసెంబ్లీ, సచివాలయాలకు వ్యక్తిగత పనులపై వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలి. రాజధాని ప్రాంతంలోని గ్రామాల ప్రజలు కొత్త వారిని ఎవరిని తమ ఇళ్లలో ఉండేందుకు అనుమతించవద్దు.
పొరుగు ప్రాంతాల వారిని అనుమతిస్తే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ప్రమాదం ఉంది. అలాంటి వారికి ఆశ్రయం ఇచ్చిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ముట్టడికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించినా.. వాహనాలు, ఇతర సదుపాయాలు సమకూర్చినా చర్యలు తప్పవు. హింసను, వైషమ్యాలను ప్రేరేపించేలా టీవీ, సోషల్ మీడియా, వార్తాపత్రికలు, ఇతర ప్రసార మాధ్యమాల్లో పిలుపునివ్వడం చట్టరీత్యా నేరం. వారిపై కూడా పోలీసు నిఘా ఉంటుంది.
హింసను ప్రోత్సహిస్తున్నట్లు నిఘా వర్గాల గుర్తింపు
రాజధాని రాజకీయం పేరిట టీడీపీ నేతలు హింసాత్మక కా>ర్యక్రమాల్ని ప్రోత్సహిస్తున్నట్లు పోలీసు నిఘా వర్గాలు గుర్తించాయి. ప్రజల్ని రెచ్చగొడుతూ.. రాజకీయ లబ్ధి పొందేందుకు వారు ఆర్థికంగా, సామాజికంగాను తోడ్పాటు అందిస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్ధారణకు వచ్చాయి. ఉద్ధండరాయునిపాలెంలో కవరేజికి వెళ్లిన జర్నలిస్టులపై రైతుల ముసుగులో కొందరు దాడి చేయడం.. ఈ నెల 7న కాజ టోల్‌ప్లాజా వద్ద ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం వంటివి అందుకు ఉదాహరణలుగా చెబుతున్నారు. తోట్లవల్లూరులో పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌పై టీడీపీ శ్రేణులు దౌర్జన్యానికి పాల్పడ్డాయి. ఇలా కావాలనే రాద్ధాంతం చేస్తూ హింసను ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించారు.
చంద్రబాబు డబుల్ గేమ్‌పై విమర్శలు
అమరావతిలో చంద్రబాబు ఆడుతున్న డబుల్ గేమ్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాబు ఐదేళ్ల పాలనలో అమరావతిలో ఒక్క ఆందోళన, నిరసనకు అవకాశం లేకుండా కర్కశంగా వ్యవహరించారు. కనీసం విజయవాడలో ప్రజలు, వివిధ పార్టీలు తమ నిరసనను వ్యక్తం చేసే అవకాశం లేకుండా ధర్నా చౌక్(అలంకార్ సెంటర్)కు పరిమితం చేశారు. ధర్నా చౌక్ దాటి వస్తే అరెస్టులు, నిర్భందంతో ఇబ్బంది పెట్టారు. అదే చంద్రబాబు ఇప్పుడు ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్న తీరును సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు తప్పుబట్టారు. అమరావతిని అడ్డుపెట్టుకుని అలజడులకు ప్రయత్నించడాన్ని పోలీసులు తప్పుబడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment