ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం
నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్
హామీల అమలు నుంచి తప్పించుకునేందుకు పూర్తి బడ్జెట్‌కు మంగళం
హత్యా రాజకీయాలపై సర్కారును నిలదీయనున్న వైఎస్సార్‌సీపీ
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభల సభ్యులనుద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ అధ్యక్షతన శాసన సభా వ్యవహారాల సలహా కమిటీ(బీఏసీ) సమావేశమై సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేదానిపై అజెండాను ఖరారు చేయనుంది. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై అధికార పార్టీ నేతలు చేస్తున్న హత్యా రాజకీయాలు, దాడులు, దౌర్జన్యాలపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు నిలదీయనున్నారు.
వినుకొండలో వైఎస్సార్‌సీపీ నేత రషీద్‌ను నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా నరికి చంపిన విషయాన్ని అసెంబ్లీలో ప్రధానంగా ప్రస్తావించాలని, ప్రభుత్వమే హత్యా రాజకీయాలను ప్రోత్సహించడంపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. ఎన్నికల ముందు వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ బడ్జెట్ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో అధికార పక్షం హామీలకు కేటాయింపుల చేయకుండా తప్పించుకునే ఎత్తుగడలో భాగంగా పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టకుండా నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్‌కు సభలో ఆమోదం పొందడం ద్వారా కాలయాపన చేయాలని నిర్ణయించింది.
కాలయాపన చేసే ఎత్తుగడ
ఎన్నికల ముందు కేంద్రం ఓటాన్ అకౌంట్ ప్రవేశ పెట్టి.. ఇప్పుడు ఈ నెల 23వ తేదీన పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతోంది. ఎన్నికల ఫలితాల అనంతరం అధికారం చేపట్టే ప్రభుత్వాలు పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెడతాయి. అయితే అందుకు భిన్నంగా చంద్రబాబు ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో సూపర్ సిక్స్ పథకాలకు కేటాయింపుల్లేకుండా కాలయాపన చేసే ఎత్తుగడకు పాల్పడుతోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంపై ఆరోపణలకు, నిందలకు అసెంబ్లీని వేదికగా చేసుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు శ్వేతపత్రాల విడుదల ఎత్తుగడకు దిగారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై అసెంబ్లీలో చర్చకు అవకాశం లేకుండా ఆర్థిక, ఎక్సైజ్, శాంతిభద్రతల పేరుతో శ్వేతపత్రాలు విడుదల చేసి అసెంబ్లీని ఆరోపణలకు వేదికగా ఉపయోగించుకోనున్నారు. మరో పక్క ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుకు అసెంబ్లీలో బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టే యోచనలో ఉంది.
టీడీపీ ఎమ్మెల్యేలందరూ పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తు కండువాలతో అసెంబ్లీకి రావాలని పార్టీ సూచించింది. ఐదు రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 24 లేదా 25వ తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment