సాక్షి, అమరావతి : ప్రజల్లో ఆదరణ కోల్పోయినా, పొత్తుల ద్వారా గట్టెక్కుదామనుకుంటున్న తెలుగుదేశం పార్టీకి అవి కూడా శరాఘాతాల్లా మారాయి. పొత్తులో భారీగా సీట్లు కోల్పోయే పరిస్థితి నెలకొనడంతో చాలా మంది సీనియర్ల మెడపై కత్తులు వేలాడుతున్నాయి. దీంతో వారి రాజకీయ భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 67 పేర్లతో జాబితాను చంద్రబాబుకు ఇచ్చారు. వాటిలో కనీసం 50కి పైగా సీట్లు తమకు కేటాయించాలని కోరుతున్నారు.
తాజాగా బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతుండడంతో ఆ పార్టీకి ఆరు ఎంపీ, 25 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వక తప్పదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ పొత్తులు ఖరారైతే బీజేపీ, జనసేనకు 75 ఎమ్మెల్యే, 10 ఎంపీ స్థానాలు వదులుకోక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో అనేక మంది సీనియర్ల సీట్లు గల్లంతవుతున్నాయి. పొత్తులతో పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని సీనియర్ నేతలు లబోదిబోమంటున్నారు.
అన్ని సీట్లు వదులుకుంటే పార్టీ అధికారంలోకి రావడం అటుంచి అసలు విలువే లేకుండా పోతుందని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది నిజమే అయినా పొత్తులు లేకపోతే దిగజారిపోయిన పార్టీ మనుగడే కష్టమైపోతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్, బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారు. తద్వారా పార్టీని రేసులోనైనా నిలపవచ్చని భావిస్తున్నారు. అయితే దీనివల్ల అనేక మంది సీనియర్ నాయకుల రాజకీయ జీవితాలకు ముగింపు తప్పదని పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఉత్తరాంధ్ర కకావికలం
ఈ పొత్తులు ఖరారైతే ఉత్తరాంధ్రలో టీడీపీ సీనియర్ నేతలు కళా వెంకట్రావు, అశోక్ గజపతిరాజు, చింతకాయల అయ్యన్న పాత్రుడు, గౌతు శిరీష, బండారు సత్యనారాయణమూర్తి, గండి బాబ్జి, గంటా శ్రీనివాసరావు, పీలా గోవింద్, పల్లా శ్రీనివాసరావు తదితర నేతల పేర్లు గల్లంతవనున్నాయి.
ఎచ్చెర్లపై ఎన్నో అశలు పెట్టుకున్న కళా వెంకట్రావు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. విశాఖలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి సీటు ఎగిరిపోనుంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అశోక్‌గజపతిరాజు వంటి సీనియర్ తన కుమార్తెకు సీటు ఇప్పించుకోలేక సతమతమవుతున్నారు.
కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలకు తప్పని పొత్తు పోట్లు
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కీలకమైన సీనియర్లకు పొత్తు పోట్లు తప్పేలా లేవు. విజయవాడలో మాజీ ఎమ్మెల్యేలు జలీల్‌ఖాన్, బొండా ఉమామహేశ్వరరావులను పక్కన పెట్టే పరిస్థితి ఏర్పడనుంది. అవనిగడ్డలో మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, పెడనలో కాగిత కృష్ణప్రసాద్, మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, తెనాలిలో ఆలపాటి రాజా, నక్కా ఆనంద్‌బాబు వంటి నేతలకు షాక్ తగలనుంది. ఆలపాటి రాజా ఇప్పటికే తన సీటు పోతే ఒప్పుకునేది లేదని అనుచరులను ముందుపెట్టి హడావుడి చేస్తున్నారు.
పరిటాల శ్రీరామ్, భూమా అఖిలప్రియకు టాటా
నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో పలువురు కీలక నాయకులు పొత్తుతో రాజకీయంగా కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సత్యసాయి జిల్లా ధర్మవరంలో పరిటాల శ్రీరామ్, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ, అనంతపురంలో ప్రభాకర్ చౌదరి, నగరిలో గాలి భానుప్రకాష్, తిరుపతిలో సుగుణమ్మ, శ్రీకాళహస్తిలో బొజ్జల సుదీర్‌రెడ్డి, రాజంపేటలో బత్యాల చెంగల్రాయుడు, జమ్మలమడుగులో భూపే‹Ùరెడ్డి వంటి నేతలు పోటీ నుంచి తప్పుకోక తప్పదంటున్నారు.
పొత్తులో బీజేపీ విశాఖ, విజయవాడ, నర్సాపురం, రాజమండ్రి, తిరుపతి, రాజంపేట పార్లమెంట్ సీట్లు ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విశాఖ నుంచి గత ఎన్నికల్లో లోకేశ్ తోడల్లుడు భరత్ పోటీ చేసి ఓడిపోయారు. ఆయన అక్కడి నుంచి మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్న తరుణంలో ఆ సీటు బీజేపీకి పోతే ఆయన భవితవ్యం ప్రశ్నార్థకం కానుంది.
విజయవాడ సీటును సిట్టింగ్ ఎంపీ కేశినేని నానిని కాదని ఆయన సోదరుడు కేశినేని చిన్నికి ఇస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. పొత్తులో అక్కడి నుంచి బీజేపీ తరఫున సుజనా చౌదరి పోటీ చేయాలని చూస్తున్నారు. దీంతో కేశినేని చిన్నికి సీటు పోయినట్లేనని భావిస్తున్నారు.
జనసేన కోరుతున్న నియోజకవర్గాలు
♦ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా: ఎచ్చెర్ల, శ్రీకాకుళం, పలాస
♦ ఉమ్మడి విజయనగరం జిల్లా: విజయనగరం, నెల్లిమర్ల.
♦ ఉమ్మడి విశాఖ పట్నం జిల్లా: పెందుర్తి, యలమంచిలి, చోడవరం, విశాఖపట్నం దక్షిణం, విశాఖపట్నం ఉత్తరం, భీమిలి, అనకాపల్లి, గాజువాక.
♦ ఉమ్మడి తూర్పు గోదావరి: పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ముమ్మడివరం, రాజమండ్రి రూరల్, రాజానగరం, కొత్తపేట, అమలాపురం, రామచంద్రాపురం, రాజోలు, పి.గన్నవరం.
♦ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా: నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, ఉంగుటూరు, ఏలూరు, గోపాలపురం, కొవ్వూరు, పోలవరం, ఆచంట.
♦ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా: విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, అవనిగడ్డ, పెడన, నూజివీడు, మచిలీపట్నం, కైకలూరు, పెనమలూరు, తెనాలి, గుంటూరు వెస్ట్, పెదకూరపాడు, తాడికొండ, పొన్నూరు, వేమూరు, గుంటూరు తూర్పు.
♦ ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలు : దర్శి, గిద్దలూరు, నెల్లూరు సిటీ, కోవూరు, కావలి, తిరుపతి, మదనపల్లి, చిత్తూరు, నగరి, ఆళ్లగడ్డ, నంద్యాల, గుంతకల్లు, బద్వేలు, రైల్వే కోడూరు, రాజంపేట, పుట్టపర్తి, ధర్మవరం.
గోదావరి జిల్లాల్లో సీనియర్ల సీట్లు గల్లంతే
గోదావరి జిల్లాల్లోనూ చాలా మంది ముఖ్య నాయకుల మెడపై కత్తి వేలాడుతోంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గొల్లపల్లి సూర్యారావు, తోట సీతారామలక్ష్మి, కేఎస్ జవహర్, ఎస్‌వీఎస్ వర్మ వంటి వారు పోటీ చేసే అవకాశాన్ని కోల్పోనున్నారు.
బుచ్చయ్యచౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యేను కాబట్టి తన సీటు ఉంటుందని చెప్పుకుంటున్నా దానికి గ్యారంటీ లేదు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు సీటు ఇప్పటికే ఎగిరి పోయింది. రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి భీమవరం సీటును నిరాకరిస్తుండడంతో ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పిఠాపురం సీటు జనసేనకు పోతుండడంతో మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్ వర్మ ఇప్పటికే తిరుగుబాటు స్వరం వినిపిస్తున్నారు. వీరు కాకుండా నర్సాపురంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, కాకినాడ వనమాడి వెంకటేశ్వరరావు, కాకినాడ రూరల్ పిల్లి అనంతక్ష్మి, ఐతాబత్తుల ఆనందరావు, బూరుగుపల్లి శేషారావు, గన్ని వీరాంజనేయులు వంటి నేతలకు టికెట్లు గల్లంతవనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment