క్యాండిల్ ర్యాలీలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తదితరులు
సాక్షి, ఒంగోలు: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలోని అమరవీరుల స్థూపం వద్ద నుంచి ఆర్టీసీ బస్టాండు వరకు ఆదివారం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్, అదనపు ఎస్పీ బి.శరత్‌బాబు, ఒంగోలు డీఎస్పీ కేవీవీఎస్‌వీ ప్రసాద్, ట్రాఫిక్ డీఎస్పీ కె.వేణుగోపాల్, ఎస్‌బీ సీఐలు బాలమురళీకృష్ణ, శ్రీకాంత్‌బాబు, నగర సీఐలు లక్ష్మణ్, భీమానాయక్, రాజేష్, రిజర్వు ఇన్‌స్పెక్టర్ అంకమ్మరావు తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో అమరవీరులకు జోహార్లు అంటూ నినాదాలు చేశారు.
అమరవీరుల కుటుంబాలకు తేనీటి విందు
జిల్లాలోని అమరవీరుల కుటుంబాలకు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తన ఛాంబరుకు పిలిపించి తేనీటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభాకర్‌వర్మ, మోటా శ్రీదేవి, లేళ్ల శంకర్ తండ్రి లేళ్ల కృష్ణమూర్తిలు తమకు భాగ్యనగర్ నాలుగో లైనులో స్థలం ఇచ్చారని, కానీ దానికి బాట లేదని పేర్కొన్నారు. రాతపూర్వకంగా తెలియజేస్తే తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్పీ వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ వారితో మాట్లాడుతూ మీ అందరినీ తన సొంత కుటుంబసభ్యులుగా భావిస్తున్నానన్నారు. పోలీసు అమరువీరుల కుటుంబ సభ్యుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. అమరవీరుల కుటుంబసభ్యులకు ఎల్లప్పుడు పోలీసుశాఖ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటు హెలికాప్టర్‌లో ప్రయాణిస్తూ అమరులైన అద్దంకి సాల్మన్ కేరీ వెస్లీ తల్లి కమలా వెస్లీ, పీవీ రత్నం తనయుడు శ్రీనివాస ప్రసాద్, ప్రశాంతరావు తనయుడు ప్రభాకర్‌వర్మ, బలిమెల ఘటనలో అశువులు బాసిన మోటా ఆంజనేయులు సతీమణి శ్రీదేవి, లేళ్ల శంకర్ తండ్రి కృష్ణమూర్తి, రఫీ సతీమణి సలీమాలు తేనీటి విందుకు హాజరయ్యారు. కార్యక్రమంలో ఒంగోలు డీఎస్పీ కేవీవీఎస్‌వీ ప్రసాద్, ఎస్‌బీ సీఐలు బాలమురళీకృష్ణ, శ్రీకాంత్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment