
మకాం మార్చిన ‘నాయకీ’
కలకలం రేపిన ‘సాక్షి’ కథనం
హైటెక్ వ్యభిచారంపై పోలీసు నిఘా వర్గాల ఆరా
అమరావతి : రాజధాని ప్రాంతంలో హైటెక్ వ్యభిచారం వ్యవహారం కలకలం రేపుతోంది. మంగళగిరి నియోజకవర్గం కేంద్రంగా ఓ రాజకీయ పార్టీ నాయకురాలు గుట్టుగా నడిపిస్తున్న హైటెక్ వ్యభిచారాన్ని ‘సాక్షి’ రట్టు చేయడంతో సదరు నాయకీ వెంటనే మకాం మార్చేసింది. నియోజకవర్గ సరిహద్దులు దాటి వెళ్లి అక్కడ వ్యాపారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది. ‘సాక్షి’లో ‘రింబోల.. రింబోల’ పేరుతో ఇటీవల రాజధానిలో హైటెక్ వ్యభిచారంపై కథనం వచ్చిన విషయం విదితమే.
దీంతో వ్యభిచారగృహ నిర్వాహకురాలి వద్ద మమూళ్లు తీసుకుని అనధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్థానిక పోలీసు అధికారుల్లో చలనం వచ్చింది. కొన్ని రోజులపాటు అన్ని కార్యకలాపాలు నిలిపివేయాలని ఆమెను ఆదేశించినట్లు సమాచారం. అందువల్లే ఆమె నియోజకవర్గ సరిహద్దులు దాటి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.
నియోజకవర్గంలో అద్దెకు తీసుకున్న అన్ని ఫ్లాట్లు ఖాళీ చేసి తెనాలి వెళ్లినట్లు తెలిసింది. మరోవైపు హైటెక్ వ్యభిచారంపై పోలీస్ నిఘా వర్గాలు కూడా ఆరా తీస్తున్నాయి. అయితే తమ మాముళ్ల వ్యవహారం బయటపడుతుందనే ఆందోళనతో స్థానిక పోలీసులు... ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.
ఆందోళనలో టీడీపీ నేత
వ్యభిచార గృహాల నిర్వాహకురాలికి అండగా ఉన్న టీడీపీ నియోజకర్గ నాయకుడు కూడా ఆందోళనకు గురవుతున్నట్లు తెలిసింది. పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి విషయం వెలుగులోకి వస్తే తన పరువు పోతుందని భయపడుతున్నట్లు సమాచారం. వ్యభిచార కార్యకలాపాలకు సంబంధించిన వాయిస్ ‘సాక్షి’ ప్రతినిధులకు ఎలా చేరిందని, జాగ్రతగా ఉండాలని నిర్వాహకురాలిని ఆయన మందలించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై అధికార పార్టీ అధిష్టానం కూడా ఆరా తీసినట్లు సమాచారం. ఇలాంటి విషయాల్లో నేతలు కక్కుర్తిపడితే పార్టీ పరువు పోతుందని మందలించినట్లు తెలిసింది.