అక్కడ పోలీసులే మేనేజర్లు!
సర్కారీ మద్యం దుకాణాల్లో అవుట్ సోర్సింగ్ సిబ్బంది కుదింపు
గాడిలో పడుతున్న మద్యం షాపులు
గత నెలలో జిల్లాలో రూ.4.26 కోట్ల విక్రయాలు
వచ్చేనెల నుంచి తిరిగి అవుట్ సోర్సింగ్ సిబ్బంది నియామకం
విజయవాడ : సర్కారీ వైన్ షాపుల్లో ఇకపై పోలీసులే మేనేజర్లు. షాపులకు మద్యం నిల్వలు తీసుకురావటం నుంచి విక్రయాలు చేసి, డబ్బు లెక్కలు చూసి డిపోలకు చెల్లించటం వరకు అంతా ఎక్సైజ్ పోలీసులదే బాధ్యత. ఇప్పటి వరకు ఎక్సైజ్ పోలీసులు స్టేషన్లలో ఉండి కేటాయించిన విధులు నిర్వహించటం లేదా తనిఖీల బృందంలో వెళ్లటం తదితర పనులు మాత్రమే నిర్వహిస్తుండేవారు. కాని ఇక నుంచి ప్రభుత్వ మద్యం షాపుల్లో విక్రయాలు తగ్గకుండా చూసుకుంటూ వ్యాపారం చేసే బాధ్యత కూడా ఎక్సైజ శాఖ వారిపైనే పెట్టింది. దీని కోసం జిల్లాలో సుమారు 50 మంది ఎక్సైజ్ కానిస్టేబుళ ్లను, హెడ్ కానిస్టేబుళ్లను కేటాయిస్తున్నారు.
ప్రస్తుతం జిల్లాలో 32 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్నాయి. ప్రారంభంలో అనేక బాలారిష్టాలతో షాపులు నామమాత్రంగా నడిచాయి. దీంతో జూలై నెలలో మొదటి 15 రోజులకు రూ.కోటి విక్రయాలు కావటమే చాలా కష్టమైంది. ప్రధానంగా జిల్లాలో ప్రభుత్వ షాపులు ఏర్పాటు చేసినప్పుడు ప్రతి షాపులో ఇద్దరు అవుట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించుకొని విక్రయాలు నిర్వహించారు. అయితే వారికి అనుభవం లేకపోవటం, బాధ్యత కూడా అంత ఉండదనే కారణాలతో కేవలం రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర విలువైన సరుకు మాత్రమే షాపుల్లో నిల్వలు ఉంచేవారు. చెల్లిస్తున్న అద్దెకు, జరగుతున్న విక్రయాలకు పొంతన లేకపోవటంతో అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తగ్గించారు. వారి స్థానంలోకి ఎక్సైజ్ కానిస్టేబుళ్లను తీసుకువచ్చారు. వారికి హెల్పర్లుగా అవుట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించారు. ప్రభుత్వ సిబ్బంది అయితే బాధ్యతగా విక్రయాలు నిర్వహిస్తారని, అలాగే ఎక్కువ నిల్వలు ఉన్నా ఇబ్బంది ఉండదనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో గత 20 రోజుల నుంచి ప్రతి షాపులో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు స్టాకు నిల్వలు ఉంచి విక్రయాలు సాగిస్తున్నారు. విజయవాడ నగరంలో 5 వైన్ షాపులు, మిగిలినవి 27 జిల్లా నలుమూలలా ఉన్నాయి. విజయవాడలోని షాపుల్లో రోజుకి సగటున రూ.లక్ష వరకు విక్రయాలు సాగుతున్నాయి. జిల్లాలోని షాపులు కొన్ని రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు వ్యాపారం జరుగుతుండగా, మరి కొన్నిచోట్ల రూ. 20 వేల వరకు విక్రయాలు సాగుతున్నాయి. అలాగే ప్రస్తుతం ప్రభుత్వ షాపుల్లో అన్ని బ్రాండ్ల మద్యాన్నీ అందుబాటులో ఉంచి విక్రయిస్తున్నారు.
ఈక్రమంలో ఇప్పటివరకు రూ. 4.26 కోట్ల విలువైన మద్యం విక్రయించారు. దీనిలో 7,625 మద్యం కేసులు కాగా 2,432 బీరు కేసులు ఉన్నాయి. ప్రభుత్వ దుకాణాల్లో బీర్ల విక్రయాలకు అనువుగా ఫ్రిజులు లేకపోవటంతో వీటి విక్రయాలు తక్కువగా ఉన్నాయి. ఎక్సైజ శాఖ ఇంఛార్జ్ డిప్యూటీ కమిషనర్ ఎన్. బాబ్జీరావు ‘సాక్షి’తో మాట్లాడుతూ ప్రభుత్వ మద్యం షాపుల్లో విక్రయాలు గాడిలో పడ్డాయన్నారు. గతం కంటే బాగా పెరిగాయని వచ్చే నెల నుంచి లెసైన్స్ షాపులతో సమానంగా విక్రయాలు సాగిస్తామని చెప్పారు. అలాగే ప్రభుత్వ షాపులకు అన్ని హంగులు ఏర్పాటు చేయటానికి కసరత్తు చేస్తున్నట్లు వివరించారు.