
హ్యాకింగ్ కలకలం
► రాజధాని జిల్లాల్లో పోలీస్ నెట్‌వర్క్ హ్యాక్
► విండోస్ వెర్షన్‌కే ముప్పు
► ముందస్తు అప్రమత్తతతో ఈ–కాప్ సర్వర్ డౌన్
► ఆన్‌లైన్ ఎఫ్‌ఐఆర్‌ల నిలిపివేత
► మాన్యువల్‌గా నమోదు 8 కృష్ణా, గుంటూరు జిల్లా పోలీసుల అలర్ట్
సాక్షి, గుంటూరు : పోలీసు శాఖలో హ్యాకింగ్ కలకలం ప్రకంపనలు సృష్టించింది. శనివారం ఉదయం ఆరు గంటల నుంచే రాజధాని జిల్లాల్లోని అన్ని పోలీసు జిల్లాల్లో హ్యాకింగ్ కలకలం రేగడంతో పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాల్లో విండోస్ వెర్షన్ వినియోగిస్తున్న పోలీసుల సాఫ్ట్‌వేర్‌ను హ్యాకర్లు హ్యాక్ చేశారు. శనివారం ఉదయమే దీనిపై సమగ్ర సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమై సర్వర్లు డౌన్ చేసి, వెర్షన్లు మార్చి వేశారు. పర్యవసానంగా ఆన్‌లైన్ ఎఫ్‌ఐఆర్‌లను కొన్ని స్టేషన్‌లలో నిలిపివేసి మాన్యువల్ ఎఫ్‌ఐఆర్‌లను జారీ చేశారు.
ఆన్‌లైన్ సేవలకు గంటల తరబడి అంతరాయం...
రాజధాని ప్రాంతమైన కృష్ణా, గుంటూరు జిల్లాల పోలీసులపై హ్యాకింగ్ తీవ్ర ప్రభావం చూపింది. ప్రధానంగా విజయవాడ కమిషనరేట్‌తో పాటు, కృష్ణా జిల్లా పోలీసులు, గుంటూరు అర్బన్, రూరల్ జిల్లా పోలీసులు హ్యాకింగ్ సమాచారంతో అప్రమత్తమయ్యారు. దీంతో నాలుగైదు గంటల పాటు ఆన్‌లైన్ సేవలకు అంతరాయం కలిగింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు నెట్‌వర్క్‌పై హ్యాకర్లు పంజా విసిరిన నేపథ్యంలో రెండు జిల్లాల పోలీసులు కొంత అప్రమత్తమయ్యారు.
దీంతో విజయవాడ కమిషనరేట్, గుంటూరు అర్బన్, రూరల్ జిల్లా పోలీసులు ఆన్‌లైన్ ఎఫ్‌ఐఆర్‌లకు, ఇతర సేవలకు వినియోగించే ఈ–కాప్ సర్వర్ డౌన్ చేశారు. పూర్తిగా సర్వర్ సేవలు నిలిపివేసి, మాన్యువల్ ఎఫ్‌ఐఆర్‌లకే ప్రాధాన్యత ఇచ్చారు. డీజీపీ కార్యాలయం నుంచి సమాచారం అందడంతో సర్వర్లు ఆగిపోయాయి. దీంతోపాటు, రెండు జిల్లాల్లో 80 శాతం పోలీసు స్టేషన్‌లలో విండోస్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా విండోస్ సాఫ్ట్‌వేర్ హ్యాక్ అయిన క్రమంలో రెండు జిల్లాల్లో సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయడంతో పాటు, యాంటీ వైరస్‌ను అప్‌లోడ్ చేసి వైరస్ ఫైళ్లు ఏవీ ఓపెన్ చేయకుండా అవసరమైన మేరకే రెండు జిల్లాల్లోని పోలీసు స్టేషన్‌లలో కంప్యూటర్లు వినియోగించారు.
మాన్యువల్‌గా ఎఫ్‌ఐఆర్‌ల నమోదు...
హ్యాకింగ్ నేపథ్యంలో మాన్యువల్ ఎఫ్‌ఐఆర్‌లు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. కొన్ని పోలీసు స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్ నమోదు వ్యవహారాన్ని పెండింగ్‌లో ఉంచారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలోని 20 పోలీసు స్టేషన్‌ల పరిధిలో ఏడాదికి సగటున ఏడువేల ఎఫ్‌ఐఆర్‌లు నమోదవుతుంటాయి. అంటే రోజుకు సగటున 25 వరకు ఉంటాయి. హ్యాకింగ్ నేపథ్యంలో శనివారం ఎఫ్‌ఐఆర్‌ల నమోదు సంఖ్య గణనీయంగా పడిపోయింది.
మొత్తం మీద ఎనిమిది కేసులే నమోదు చేసినట్లు సమాచారం. వాటిల్లోనూ నాలుగు మాన్యువల్ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఇక గుంటూరు అర్బన్ జిల్లాలో 17 పోలీసు స్టేషన్‌లు, గుంటూరు జిల్లాలో రెండు ట్రాఫిక్ స్టేషన్‌లతో కలిపి 64 పోలీసు స్టేషన్‌లు ఉన్నాయి. అర్బన్‌లో రోజుకు సగటున 15, రూరల్‌లో 70 వరకు కేసులు నమోదవుతున్నాయి.
రెండు జిల్లాల్లో కలిపి శనివారం 30 వరకు ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లుగా తెలుస్తోంది. శనివారం ఉదయాన్నే పోలీసు శాఖను అప్రమత్తం చేయడంతో అందరూ కంప్యూటర్ల వాడకాన్ని రోజూకంటే 80 శాతం తగ్గించేశారు. కొందరు పోలీసులు ఆండ్రాయిడ్ వెర్షన్ వినియోగించారు.