రాత్రి సమయంలో గస్తీ కాస్తున్న ఎస్‌ఐ శిరీష,కొత్తూరు ఎస్‌ఐ బాలకృష్ణ
సమాజమంతా కరోనాకు భయపడుతుంటే.. కొందరు మాత్రం యోధుల్లా పోరాడుతున్నారు. జనాలకు రక్షణ కవచాల్లా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కుటుంబాలను వదిలి, ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నారు. అందులో కొందరు వీరు. కరోనా కట్టడిలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
పగలు రాత్రి కర్తవ్య దీక్షలో..
జి.సిగడాం ఎస్‌ఐ కె.శిరీష మండలంలో 144 సెక్షన్‌ను సమర్థంగా అమలు చేస్తున్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ప్రజలకు వ్యాపించకుండా ఉండేందుకు ప్రతి గ్రామంలో చర్యలు చేపట్టారు. లాక్‌డౌన్ ఎలా అమలవుతోందో పర్యవేక్షించేందుకు గస్తీ ఏర్పాటు చేశా రు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మండలమంతా పర్యటించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కుటుంబానికి దూరంగా ఉంటూ ప్రజా సేవ చేస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా కర్తవ్య దీక్షలో గడుపుతున్నారు. –జి.సిగడాం
పెళ్లయి నెల రోజులే అయినా..
కొత్తూరు: పెళ్లయి నెల రోజులే అయ్యింది. అప్పుడే ప్రజలకు ఆపద దాపురించింది. ఈ ఆపత్కా లంలో నిజాయితీగా విధులు నిర్వహిస్తూ ముందుకువెళ్తున్నారు కొత్తూరు ఎస్‌ఐ బాలకృష్ణ. బాలకృష్ణకు పెళ్లి జరిగి నెల గడుస్తోంది. ఇంతలో లాక్‌డౌన్ ప్రకటించడం, దీన్ని సమర్థంగా పర్యవేక్షించాల్సిన బాధ్యత పోలీసులపై పడడం జరిగింది. అప్పటి నుంచి బాలకృష్ణ నిరంతరం విధుల్లోనే ఉంటున్నారు. నిత్యం తన సిబ్బందితో రోడ్లపై తిరుగుతూ జనాలకు అవగాహన కల్పిస్తున్నారు.
ప్రయాణంలో ప్రచారం
ఎల్.ఎన్.పేట: ఈయన పేరు సనపల కిరణ్‌కుమార్. ఊరు ఎల్.ఎన్ పేట మండలం చింతలబడవంజ సెంటర్. ఇదే మండలం లక్ష్మీనర్సుపేట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆస్పత్రిలో మేల్ హెల్త్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నారు. కరోనా(కోవిడ్–19) విజృంభిస్తుందని ప్రభుత్వంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేసినప్పటి నుంచి తనదైన శైలిలో ప్రజల వద్దకు వెళుతూ అందరినీ అప్రమత్తం చేస్తున్నారు. తన బైక్‌పై ‘కరోనా వైరస్ నుంచి కాపాడుకోవాలంటే దయచేసి ఇంట్లోనే ఉండండి’ అంటూ బోర్డు ప్రదర్శిస్తున్నారు.
జిల్లాలో ఎవరూ ఆకలితో ఉండకూడదు: కలెక్టర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా నిర్వహించిన లాక్‌డౌన్, 144 సెక్షన్ వల్ల ఏ ఒక్కరూ ఆకలితో ఉండరాదని కలెక్టర్ జె.నివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్నవారు, పేదలు, నిరాశ్రయులు అక్కడక్కడా ఉన్నారని, వారికి శ్రీకాకుళం, ఇతర మండలాల్లో కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కేంద్రాలకు వారు వెళ్లి తాత్కాలిక పునరావాసం పొందవచ్చని, శ్రీకాకుళంలో ఉన్నవారికి రెడ్‌క్రాస్ వారు ఆహారం అందిచేందుకు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment