వైవీయూ ప్రధానద్వారం (ఇన్‌సెట్) పోలీసు అవుట్‌పోస్టు
వైఎస్‌ఆర్ జిల్లా, వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయంలో గతంలో చోటుచేసుకున్న చోరీలు, మహిళా వసతిగృహాల్లో ఆగంతకుల చొరబాటు వంటి ఆగడాలకు చెక్ పెట్టేలా విశ్వవిద్యాలయంలో పోలీసు అవుట్ పోస్టును ఏర్పాటు చేస్తున్నారు. యోగివేమన విశ్వవిద్యాలయంలో గతంలో ప్రిన్సిపాల్ చాంబర్‌గా వినియోగించిన గదిని పోలీసు అవుట్ పోస్టు కేంద్రానికి కేటాయిస్తూ విశ్వవిద్యాలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ప్రతి విశ్వవిద్యాలయంలో పోలీసుస్టేషన్ లేదా కనీసం పోలీసు అవుట్ పోస్టు అయినా ఉంటుంది. అయితే వైవీయూ ఏర్పాటై 14 ఏళ్లు కావస్తున్నా కనీసం పోలీసు అవుట్ పోస్టు కూడా ఏర్పాటు చేయలేదు. గతంలో ఏర్పాటుకు ప్రయత్నించినప్పటికీ ముందు కు సాగ లేదు. అయితే మునగాల సూర్యకళావతి వైవీయూ వైస్ చాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత విశ్వవిద్యాలయంలో పోలీసు అవుట్ పోస్టు ఆవశ్యకతను గుర్తించి ఎస్పీ కె.కె.ఎన్. అన్బురాజన్‌తో చర్చించారు. దీంతో జిల్లా ఎస్పీ వైవీయూలో పోలీసు అవుట్‌పోస్టును ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలపడంతో పాటు వైవీయూలో ప్రధానద్వారంకు సమీపంలో ఓ గదిని ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి సమ్మతించిన వైవీయూ అధికారులు విధులు నిర్వహించే పోలీసుల కోసం అన్ని వసతులు ఉండే ఒక గదిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మరి కొద్దిరోజుల్లోనే వైవీయూలో అవుట్‌పోస్టు ఏర్పాటు కానుంది.
ఆగడాలకు అడ్డుకట్ట..
గతంలో విశ్వవిద్యాలయంలో పలు చోరీలు, నిర్మాణ రంగ సామగ్రి, కంప్యూటర్‌లు సైతం మాయమయ్యాయి. ఇంటిదొంగలే వాటిని పట్టుకెళ్లిన వైనంపై అప్పట్లో ‘సాక్షి’లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో ఏదో ఒక సందర్భంలో గుర్తుతెలియని ఆగంతకులు వసతిగృహాల వైపు రావడంతో విద్యార్థినులు భయభ్రాంతులకు గురైన ఘటనలు ఉన్నాయి. వీటితో పాటు విద్యార్థుల ఆందోళనలు, రాస్తారోకో వంటి కార్యక్రమాలతో ఎప్పుడూ చైతన్యవంతంగా ఉండే విశ్వవిద్యాలయంలో పోలీసు అవుట్‌పోస్టు ఏర్పాటు చేయడం ద్వారా ఎంతో ప్రయోజనం నెరవేరుతుందని విద్యార్థులు, సిబ్బంది భావిస్తున్నారు. దీంతో పాటు పోలీసు నిఘా ఉంటే తుంటరి విద్యార్థులు, ఆకతాయిల గోల లేకుండా విద్యార్థినులు క్యాంపస్‌లో ప్రశాంతంగా విద్యనభ్యసించే వీలుంటుంది. దీంతో పాటు ర్యాగింగ్ రక్కసిని విశ్వవిద్యాలయం ప్రాంగణంలోకి రాకుండా ఉండటంతో పాటు మహిళా వసతిగృహాలకు సైతం పూర్తిస్థాయిలో రక్షణ లభిస్తుందని విద్యార్థినులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment