out post police
-
వేమనకు ‘రక్షణ’గా!
వైఎస్ఆర్ జిల్లా, వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయంలో గతంలో చోటుచేసుకున్న చోరీలు, మహిళా వసతిగృహాల్లో ఆగంతకుల చొరబాటు వంటి ఆగడాలకు చెక్ పెట్టేలా విశ్వవిద్యాలయంలో పోలీసు అవుట్ పోస్టును ఏర్పాటు చేస్తున్నారు. యోగివేమన విశ్వవిద్యాలయంలో గతంలో ప్రిన్సిపాల్ చాంబర్‌గా వినియోగించిన గదిని పోలీసు అవుట్ పోస్టు కేంద్రానికి కేటాయిస్తూ విశ్వవిద్యాలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ప్రతి విశ్వవిద్యాలయంలో పోలీసుస్టేషన్ లేదా కనీసం పోలీసు అవుట్ పోస్టు అయినా ఉంటుంది. అయితే వైవీయూ ఏర్పాటై 14 ఏళ్లు కావస్తున్నా కనీసం పోలీసు అవుట్ పోస్టు కూడా ఏర్పాటు చేయలేదు. గతంలో ఏర్పాటుకు ప్రయత్నించినప్పటికీ ముందు కు సాగ లేదు. అయితే మునగాల సూర్యకళావతి వైవీయూ వైస్ చాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత విశ్వవిద్యాలయంలో పోలీసు అవుట్ పోస్టు ఆవశ్యకతను గుర్తించి ఎస్పీ కె.కె.ఎన్. అన్బురాజన్‌తో చర్చించారు. దీంతో జిల్లా ఎస్పీ వైవీయూలో పోలీసు అవుట్‌పోస్టును ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలపడంతో పాటు వైవీయూలో ప్రధానద్వారంకు సమీపంలో ఓ గదిని ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి సమ్మతించిన వైవీయూ అధికారులు విధులు నిర్వహించే పోలీసుల కోసం అన్ని వసతులు ఉండే ఒక గదిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మరి కొద్దిరోజుల్లోనే వైవీయూలో అవుట్‌పోస్టు ఏర్పాటు కానుంది. ఆగడాలకు అడ్డుకట్ట.. గతంలో విశ్వవిద్యాలయంలో పలు చోరీలు, నిర్మాణ రంగ సామగ్రి, కంప్యూటర్లు సైతం మాయమయ్యాయి. ఇంటిదొంగలే వాటిని పట్టుకెళ్లిన వైనంపై అప్పట్లో ‘సాక్షి’లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో ఏదో ఒక సందర్భంలో గుర్తుతెలియని ఆగంతకులు వసతిగృహాల వైపు రావడంతో విద్యార్థినులు భయభ్రాంతులకు గురైన ఘటనలు ఉన్నాయి. వీటితో పాటు విద్యార్థుల ఆందోళనలు, రాస్తారోకో వంటి కార్యక్రమాలతో ఎప్పుడూ చైతన్యవంతంగా ఉండే విశ్వవిద్యాలయంలో పోలీసు అవుట్‌పోస్టు ఏర్పాటు చేయడం ద్వారా ఎంతో ప్రయోజనం నెరవేరుతుందని విద్యార్థులు, సిబ్బంది భావిస్తున్నారు. దీంతో పాటు పోలీసు నిఘా ఉంటే తుంటరి విద్యార్థులు, ఆకతాయిల గోల లేకుండా విద్యార్థినులు క్యాంపస్‌లో ప్రశాంతంగా విద్యనభ్యసించే వీలుంటుంది. దీంతో పాటు ర్యాగింగ్ రక్కసిని విశ్వవిద్యాలయం ప్రాంగణంలోకి రాకుండా ఉండటంతో పాటు మహిళా వసతిగృహాలకు సైతం పూర్తిస్థాయిలో రక్షణ లభిస్తుందని విద్యార్థినులు భావిస్తున్నారు. -
యూపీలో రెచ్చిపోయిన గోరక్షక ముఠా
బులంద్‌షహర్: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో గోరక్షక ముఠా రెచ్చిపోయింది. ఓ మతానికి చెందిన ప్రజలు ఆవును చంపేశారని ఆరోపిస్తూ రోడ్డును దిగ్బంధించి ఆందోళనకు దిగింది. ట్రాఫిక్‌ను పునరుద్ధరించడానికి అక్కడకు చేరుకున్న పోలీసులపై రాళ్ల వర్షం కురిపించింది. అంతేకాకుండా స్థానిక పోలీస్ ఔట్‌పోస్ట్‌తో పాటు పలు వాహనాలకు నిప్పంటించింది. ఈ ఘటనలో పోలీస్ ఇన్స్పెక్టర్తో పాటు మరో పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. మీరట్ జోన్ అదనపు డీజీపీ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ.. ‘బులంద్ షహర్ జిల్లా మెహౌ గ్రామం దగ్గర సోమవారం ఆవు కళేబరం కనిపించింది. దీంతో ఓ మతానికి చెందినవారు ఆవును చంపేశారని ఆరోపిస్తూ హిందుత్వ సంస్థల సభ్యులు కొందరు ఆ ఎముకల్ని ట్రాక్టర్లో వేసుకుని ఛింగర్వతి పోలీస్‌స్టేషన్ దగ్గరకు తీసుకొచ్చారు. తర్వాత బులంద్‌షెహర్–గఢ్ రాష్ట్ర రహదారిని దిగ్బంధించారు. దీంతో జిల్లా కలెక్టర్ అనూజ్ కుమార్, సబ్‌డివిజినల్ మేజిస్ట్రేట్ అవినాశ్ కుమార్ రంగంలోకి దిగి ఆందోళనకారులతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. అంతలోనే ఒక్కసారిగా రెచ్చిపోయిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. పోలీస్ ఔట్‌పోస్ట్‌తో పాటు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ సందర్భంగా దుండగుల దాడిలో ఇన్స్పెక్టర్ సుబోధ్ కుమార్ మరణించారు. పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సుమిత్ అనే యువకుడు చనిపోయాడు. -
అఫ్గాన్‌లో రెచ్చిపోయిన తాలిబన్లు
కాబుల్: అఫ్గాన్‌లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. బుధవారం రాత్రి తాలిబన్లు పశ్చిమ ప్రావిన్స్‌లోని ఫరాలోని పోలీసు ఔట్ పోస్ట్‌పై మెరుపుదాడి చేయడంతో 30 మంది భద్రతాసిబ్బంది మరణించారు. అనంతరం భద్రతాదళాలు జరిపిన వైమానిక దాడుల్లో 17 మంది తాలిబన్లు చనిపోయారు. ఉగ్రవాదులకు భద్రతా సిబ్బందికీ మధ్య సుమారు నాలుగు గంటలకు పైగా హోరాహోరీగా కాల్పులు జరిగినట్లు ప్రావిన్షియల్ కౌన్సిల్ సభ్యుడు దాదుల్లా ఖనీ మీడియాకు తెలిపారు. తాలిబన్లు దాడిచేసిన ఔట్‌పోస్టులో జాతీయ, స్థానిక విభాగాలకు చెందిన పోలీసు దళాలు ఉన్నాయన్నారు. పోలీసు కాల్పులను ఎదుర్కొంటూనే ఔట్‌పోస్టు నుంచి తాలిబన్లు భారీ ఎత్తున ఆయుధ సామగ్రిని ఎత్తుకెళ్లారు. తాలిబన్లకు, భద్రతా సిబ్బందికి మధ్య నిత్యం జరుగుతున్న హింసాత్మక దాడుల్లో రోజుకు సగటున కనీసం 45 మంది అఫ్గాన్ పోలీసులు మరణించడం లేదా తీవ్రంగా గాయపడటం జరుగుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు. తాలిబన్లకు, భద్రతాసిబ్బందికీ మధ్య జరుగుతున్న హింసాత్మక దాడుల కారణంగా గత రెండువారాలుగా సెంట్రల్ గజనీ ప్రావిన్స్‌లోని రెండు జిల్లాల్లో చాలామంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. -
ఎద్దుల బండిని ఢీ కొని గాయాలు
ప్రొద్దుటూరు క్రైం: ఎద్దుల బండిని ఢీ కొనడంతో బైక్‌లో వెళ్తున్న సుబ్బారావు గాయ పడ్డాడు. ఔట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాల మేరకు కర్నూలు జిల్లా చాగలమర్రికి చెందిన సుబ్బారావు కమీషన్ వ్యాపారం చేస్తుంటాడు. అతను బైక్‌లో గురువారం సాయంత్రం ప్రొద్దుటూరు నుంచి చాగలమర్రికి బయలుదేరాడు. మార్గమధ్యంలో రాజుపాళెం సమీపంలోకి వెళ్లగానే ప్రమాదవశాత్తు ఎడ్ల బండిని ఢీ కొన్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సుబ్బారావును 108 అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కడుపు భాగంలో తీవ్ర గాయం కావడంతో బెంగుళూరు లేదా హైదరాబాద్‌కు వెళ్లాలని వైద్యుడు సూచించారు.