పోలీసుల అత్యుత్సాహం
నెల్లూరు (టౌన్) : నవంబరు 1వ తేదీ వరకు వాహనదారులపై ఎలాంటి ఫైన్‌లు విధంచరాదని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్. కృష్ణారావు వివిధ శాఖాధికారులను ఆదేశించారు. ఈలోపు వాహనం నంబరు, పేరు నమోదు చేసుకుని వాహనదారులకు అవగాహన, కౌన్సిలింగ్ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. అయితే జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఆయా శాఖాధికారులు పట్టించుకోకుండా వాహనదారులపై కొరడా ఝుళిపిస్తున్నారు. హెల్మెట్ లేదంటూ పోలీసులు రూ.100 నుంచి రూ.1000 వరకు ఫైన్ విధిస్తున్నారు. దీంతో వాహనదారులు ప్రధాన రహదారుల గుండా వెళ్లాలంటే భయపడుతున్నారు. ద్విచక్ర వాహనం వెనుకవైపు కూర్చున వ్యక్తి కూడా తప్పని సరిగా హెల్మెట్‌ను వినియోగించాలన్న నిబంధనపై వాహనాదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
పెరిగిన హెల్మెట్ ధరలు
వాహనదారులు హెల్మెట్‌ను వినియోగించాలన్న నిబంధనను తప్పనిసరి చేయడంతో దుకాణదారులుకు కాసుల వర్షం కురిపిస్తుంది. హెల్మెట్లు ధరలను అమాంతంగా పెంచేసి అందినకాడికి దండుకుంటున్నారు. దుకాణాదారులు ఐఎస్‌ఐ పేరుతో నకిలీలను వాహనదారులకు అంటగడుతున్నారు. ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం నుంచి కాపాడాల్సిన హెల్మెట్లు కొనుగోలు సమయంలోనే తలకు మించిన భారంగా పరిణమించింది. రహదారుల వెంబడి విక్రయిస్తున్న హెల్మెట్లు నాలుగురోజుల క్రితం వరకు ఒక్కోటి రూ.300 అమ్మితే ప్రస్తుతం రూ.600కు అమ్ముతున్నారు.
ఓవైపు ఐఎస్‌ఐ, అధునాతనమైనవని చెబుతూ రూ. 1200 నుంచి రూ.1500 వరకు విక్రయిస్తున్నారు. ఐఎస్‌ఐ మార్కు ఉన్న హెల్మెట్‌నే వాడాలన్న అధికారుల సూచనలను వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. ఎక్కువ మొత్తం చెల్లించి ఐఎస్‌ఐ మార్కు ఉన్న హెల్మెట్‌ను కొనుగోలు చేసినా ఉన్న లోగోలు నకిలీవని తెలిసి వాహనదారులు తలలు పట్టుకుంటున్నారు. గడ్డం దగ్గర వచ్చే ఐఎస్‌ఐ మార్కు చూసి కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే జిల్లాలో డిమాండ్‌కు తగ్గ హెల్మెట్లను సరఫరా చేయడంలో అధికారులు చూపిన నిర్లక్ష్యంపై వాహనదారులు మండిపడుతున్నారు.
ఫైన్ విధింపునకు అత్యుత్సాహం
హెల్మెట్ వినియోగం పోలీసులకు సైతం కాసుల వర్షం కురిపిస్తోంది. జూలై 1నుంచి హెల్మెట్ వినియోగం తప్పనిసరని నిబంధనతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. హెల్మెట్ వినియోగించని వాహనదారులపై రూ.100 నుంచి రూ.1000 చలానా రూపంలో జరిమానా విధించారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు నిబంధనల పేరుతో రూ. 100 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వాహనదారుడు చలానా అడిగితే రూ.1000 జరిమానా చెల్లించాలని చెబుతుండటంతో చేసేదిలేక అక్కడ నుంచి చల్లగా జారుకుంటున్నారు. హెల్మెట్‌తో పాటు వాహనానికి సంబంధించిన సీబుక్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, డ్రైవింగ్ లెసైన్స్‌లను కూడా తనిఖీ చేస్తుండటంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. వీటి పేరుతో భారీగా డబ్బులు వ సూలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి.
కౌన్సెలింగ్ నిల్..
హెల్మెట్ వినియోగంపై పోలీసు, రవాణా అధికారులు వాహనదారులకు అవగాహన, కౌన్సిలింగ్ నిర్వహించాల్సి ఉంది. కాని జిల్లాలో ఎక్కడా ఈకార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు లేవు. హెల్మెట్ వినియోగంపై తమకేమీ పట్టనట్లు అధికారులు వ్యవరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా హెల్మెట్ వినియోగించడం వల్ల ప్రయోజనాలతో పాటు సరపడా హెల్మెట్లును తెప్పించడంలో అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
అవగాహన, కౌన్సెలింగ్ నిర్వహిస్తాం ఎన్.శివరాంప్రసాద్, ఉపరవాణా కమిషనర్
హెల్మెట్ వినియోగంపై వాహనదారులకు అవగాహన కల్పిస్తాం. ప్రధానంగా కళాశాలల్లో విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తాం. నవంబర్ 1నుంచి హెల్మెట్ వినియోగించకపోతే కేసులు నమోదు చేస్తాం. అప్పటి వరకు వాహనదారులకు కౌన్సిలింగ్ ఇస్తాం.