Helmet traders
-
భారీగా హెల్మెట్ల ధ్వంసం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతుండడంతో... నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మితిమీరిన వేగం, అంతులేని నిర్లక్ష్యం కారణంగా అమాయకులు బలవుతున్నారు. పెరుగుతున్న ద్విచక్ర వాహనాల ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని సోమవారం సైబరాబాద్ పోలీసులు ప్రమాదాల చర్యలు నియంత్రనకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నగర వ్యాప్తంగా హెల్మెట్ డ్రైవ్ చేపట్టి.. నకిలీ ఐఎస్ఐ(ISI) మార్క్‌తో కూడిన హెల్మెట్లు విక్రయించే వారిపై కొరడా జులుపిస్తున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నకిలీ హెల్మెట్ అమ్మకాలు చేస్తున్న వారి నుంచి భారీగా నకిలీ హెల్మెట్లు స్వాధీనం చేసుకుంటున్నారు. అంతేకాక వాటిని ధ్వసం చేయడంతో పాటు అమ్మకం దారులపై కేసులు పెట్టి.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఏమాత్రం నాణ్యతలేని నకిలీ హెల్మెట్ల కారణంగా నగరంలో వందలాది సంఖ్యలో వాహన దారులు ప్రమాదాలబారిన పడుతున్నారని.. అందుకే హెల్మెట్ డ్రైవ్ చేపట్టామని సైబరాబాద్ పోలీసులు పేర్కొన్నారు. అయితే నాణ్యమైన హెల్మెట్ల ధరలు ఎక్కువగా ఉండటంతో సామాన్యులు చౌకైన హెల్మెట్లు కొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఫుట్‌పాత్‌లపై అమ్మే హెల్మెట్లు తక్కువ ధరలకు లభిస్తుండటంతో వాటిని కొంటున్నారు. అటు బడా వ్యాపారులు, బైక్ షోరూమ్‌లు ఎక్కువ లాభాలకు ఆశపడి రేట్లు పెంచేస్తున్నాయి. వీరిపైనా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. నాణ్యమైన హెల్మెట్లను అధిక ధరలకు విక్రయించకుండా చూడాలని సూచిస్తున్నారు. -
పోలీసుల అత్యుత్సాహం
నెల్లూరు (టౌన్) : నవంబరు 1వ తేదీ వరకు వాహనదారులపై ఎలాంటి ఫైన్లు విధంచరాదని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్. కృష్ణారావు వివిధ శాఖాధికారులను ఆదేశించారు. ఈలోపు వాహనం నంబరు, పేరు నమోదు చేసుకుని వాహనదారులకు అవగాహన, కౌన్సిలింగ్ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. అయితే జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఆయా శాఖాధికారులు పట్టించుకోకుండా వాహనదారులపై కొరడా ఝుళిపిస్తున్నారు. హెల్మెట్ లేదంటూ పోలీసులు రూ.100 నుంచి రూ.1000 వరకు ఫైన్ విధిస్తున్నారు. దీంతో వాహనదారులు ప్రధాన రహదారుల గుండా వెళ్లాలంటే భయపడుతున్నారు. ద్విచక్ర వాహనం వెనుకవైపు కూర్చున వ్యక్తి కూడా తప్పని సరిగా హెల్మెట్‌ను వినియోగించాలన్న నిబంధనపై వాహనాదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పెరిగిన హెల్మెట్ ధరలు వాహనదారులు హెల్మెట్‌ను వినియోగించాలన్న నిబంధనను తప్పనిసరి చేయడంతో దుకాణదారులుకు కాసుల వర్షం కురిపిస్తుంది. హెల్మెట్లు ధరలను అమాంతంగా పెంచేసి అందినకాడికి దండుకుంటున్నారు. దుకాణాదారులు ఐఎస్ఐ పేరుతో నకిలీలను వాహనదారులకు అంటగడుతున్నారు. ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం నుంచి కాపాడాల్సిన హెల్మెట్లు కొనుగోలు సమయంలోనే తలకు మించిన భారంగా పరిణమించింది. రహదారుల వెంబడి విక్రయిస్తున్న హెల్మెట్లు నాలుగురోజుల క్రితం వరకు ఒక్కోటి రూ.300 అమ్మితే ప్రస్తుతం రూ.600కు అమ్ముతున్నారు. ఓవైపు ఐఎస్ఐ, అధునాతనమైనవని చెబుతూ రూ. 1200 నుంచి రూ.1500 వరకు విక్రయిస్తున్నారు. ఐఎస్ఐ మార్కు ఉన్న హెల్మెట్నే వాడాలన్న అధికారుల సూచనలను వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. ఎక్కువ మొత్తం చెల్లించి ఐఎస్ఐ మార్కు ఉన్న హెల్మెట్‌ను కొనుగోలు చేసినా ఉన్న లోగోలు నకిలీవని తెలిసి వాహనదారులు తలలు పట్టుకుంటున్నారు. గడ్డం దగ్గర వచ్చే ఐఎస్ఐ మార్కు చూసి కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే జిల్లాలో డిమాండ్‌కు తగ్గ హెల్మెట్లను సరఫరా చేయడంలో అధికారులు చూపిన నిర్లక్ష్యంపై వాహనదారులు మండిపడుతున్నారు. ఫైన్ విధింపునకు అత్యుత్సాహం హెల్మెట్ వినియోగం పోలీసులకు సైతం కాసుల వర్షం కురిపిస్తోంది. జూలై 1నుంచి హెల్మెట్ వినియోగం తప్పనిసరని నిబంధనతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. హెల్మెట్ వినియోగించని వాహనదారులపై రూ.100 నుంచి రూ.1000 చలానా రూపంలో జరిమానా విధించారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు నిబంధనల పేరుతో రూ. 100 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వాహనదారుడు చలానా అడిగితే రూ.1000 జరిమానా చెల్లించాలని చెబుతుండటంతో చేసేదిలేక అక్కడ నుంచి చల్లగా జారుకుంటున్నారు. హెల్మెట్‌తో పాటు వాహనానికి సంబంధించిన సీబుక్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, డ్రైవింగ్ లెసైన్స్‌లను కూడా తనిఖీ చేస్తుండటంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. వీటి పేరుతో భారీగా డబ్బులు వ సూలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. కౌన్సెలింగ్ నిల్.. హెల్మెట్ వినియోగంపై పోలీసు, రవాణా అధికారులు వాహనదారులకు అవగాహన, కౌన్సిలింగ్ నిర్వహించాల్సి ఉంది. కాని జిల్లాలో ఎక్కడా ఈకార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు లేవు. హెల్మెట్ వినియోగంపై తమకేమీ పట్టనట్లు అధికారులు వ్యవరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా హెల్మెట్ వినియోగించడం వల్ల ప్రయోజనాలతో పాటు సరపడా హెల్మెట్లును తెప్పించడంలో అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. అవగాహన, కౌన్సెలింగ్ నిర్వహిస్తాం ఎన్.శివరాంప్రసాద్, ఉపరవాణా కమిషనర్ హెల్మెట్ వినియోగంపై వాహనదారులకు అవగాహన కల్పిస్తాం. ప్రధానంగా కళాశాలల్లో విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తాం. నవంబర్ 1నుంచి హెల్మెట్ వినియోగించకపోతే కేసులు నమోదు చేస్తాం. అప్పటి వరకు వాహనదారులకు కౌన్సిలింగ్ ఇస్తాం. -
దర్జాగా దోచేస్తున్నారు
- జిల్లాలో జోరందుకున్న హెల్మెట్ల వ్యాపారం - ఇప్పటి వరకు 65 వేలకు పైగా అమ్మకాలు - జిల్లాలో మొత్తం ద్విచక్ర వాహనాలు 2.3 లక్షలు మదనపల్లె: జిల్లాలో వాహనదారులను హెల్మెట్ల వ్యాపారులు దోచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ల వ్యాపారం జోరందుకొంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2.30 లక్షల వరకూ ద్విచక్రవాహనాలు ఉన్నట్లు మోటారు వాహనాల శాఖ అధికారుల అంచనా. ద్విచక్ర వాహనదారులకు జూలై ఒకటో తారీఖు నుంచి హెల్మెట్లు తప్పని సరి కావడంతో వాహనదారులు వీటిని కొనుగోలు చేయడంలో నిమగ్నమయ్యారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 2.30 లక్షలకుపైగా ద్విచక్రవాహనాలు, 60 వేలకు పైగా కార్లు ఉన్నాయి. వీరిలో ఇదివరకూ ఏ ఒక్కరో, ఇద్దరో తప్ప హెల్మెట్లు కానీ, సీటు బెల్టులు కానీ కచ్చితంగా వాడుతున్న దాఖలాలు లేవు. అయితే హెల్మెట్ల వాడకం తప్పని సరికాడంతో ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా 67 వేలకుపైగా హెల్మెట్లను వాహనదారులు కొనుగోలు చేసినట్లు ప్రాథమిక అంచనా. కాగా మదనపల్లె మోటారు వెహికల్ శాఖ పరిధిలోని మదనపల్లె, గుర్రంకొండ, తంబళ్లపల్లె, పెద్దమండ్యం, బి.కొత్తకోట, పీటీఎం, పెద్దమండ్యం, వాల్మీకిపురం, కురబలకోట, రా మసముద్రం, నిమ్మనపల్లె, పుంగనూరు, పెద్దపంజాణి, చౌడేపల్లెతో కలిపి మొత్తం 14 మండలాల పరిధిలో దాదాపుగా 70 వేల వరకూ ద్విచక్రవాహనాలు, 25 వేల వరకూ కార్లు, జీపులు ఉన్నాయి. కేవలం డివిజన్ కేంద్రమైన మదనపల్లె పట్టణంలో దాదాపుగా 50 వేల వరకూ ద్విచక్రవాహనాలు, 15 వేలకుపైగా కార్లు, జీపులు ఉన్నాయి. మదనపల్లెలో 10 వేల హెల్మెట్ల అమ్మకాలు డివిజన్ కేంద్రమైన మదనపల్లె పట్టణంలో బెంగళూరు రోడ్డు, కదిరిరోడ్డు, సీటీఎం రోడ్డు, అవెన్యూ రోడ్డు, పుంగనూరు రోడ్డు, నీరుగట్టువారిపల్లె, బెంగళూరు బస్టాండు ప్రాంతాలతో పాటు పలువురు ఆటోమొబైల్ షాపులతో కలిపి మొత్తం 23 చోట్ల అమ్మకాలు సాగిస్తున్నారు. అందుబాటులో లేని హెల్మెట్లు గత నెలతో పోల్చితే ఈ నెలలో కొంత అమ్మకాలు పెరిగాయని, అయితే డిమాం డ్కు తగ్గట్టుగా హెల్మెట్లు అందుబాటులో లేవని వ్యాపారులు అంటున్నారు. ఢిల్లీ, ముంబయి, కలకత్తా తదితర పెద్ద నగరాల నుంచి బెంగళూరు, హైదరాబాదు, చెన్నై వంటి నగరాలకు దిగుమతి చేసుకోవాల్సి ఉందని, అక్కడి నుంచి మన ప్రాంతాలకు తీసుకురావాల్సి ఉందన్నారు. దోచుకుంటున్న వ్యాపారులు జిల్లావ్యాప్తంగా హెల్మెట్ల విక్రయించే కొందరు వ్యాపారులు వాహనదారులను దోచుకొంటున్నారు. రూ.450 విలువ చేసే ఫుల్ హెల్మెట్ రూ.750కి, రూ.200 విలువ చేసే హాఫ్ హెల్మెట్ రూ.300కి విక్రయిస్తున్నారు. వాస్తవానికి ఐఎస్ఐ మార్కువైతే ప్రస్తుతం అధికంగా అందుబాటులో లేకపోవడంతో పోలీసుల బారి నుంచి రక్షించుకునేందుకు ఏదో ఒకటని కొనక తప్పడం లేదు.