
విశాఖ విమానాశ్రయంలో ఖాకీల దాష్టీకం
- రైల్వేజోన్‌పై ఎంపీ హరిబాబు వైఖరికి అఖిలపక్షం నిరసన
- వైఎస్సార్‌సీపీ, వామపక్షాల నేతలను ఈడ్చేసిన పోలీసులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం విమానాశ్రయంలో పోలీసులు అదుపు తప్పి ప్రవర్తించారు. వైఎస్సార్‌సీపీ, వామపక్షాల నేతల పట్ల అమానుషంగా వ్యవహరించారు. ఈడ్చుకుంటూ తీసుకెళ్లి పోలీసు వ్యాన్లలో పడేశారు. విశాఖకు రైల్వే జోన్ విషయంలో ఎంపీ కె.హరిబాబు తీరుపై నిరసన తెలియజేయడానికి వైఎస్సార్‌సీపీ, సీపీఐ, ప్రజాసంఘాల నేతృత్వంలో అఖిలపక్ష నేతలు ఆదివారం సాయంత్రం విమానాశ్రయానికి వెళ్లారు. ఢి ల్లీ నుంచి సాయంత్రం 5 గంటల సమయంలో ఎంపీ హరిబాబు వచ్చారు. అంతకుముందే అక్కడకు అఖిలపక్ష నాయకులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. ఈ సంగతి తెలుసుకున్న పోలీసులు భారీగా ఎయిర్‌పోర్టు బయట మోహరించారు. హరిబాబు రాకముందే వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ , సీఈసీ సభ్యుడు దామా సుబ్బారావు తదితరులను పోలీసులు వ్యాన్ల వద్దకు లాక్కెళ్లారు.
అనంతరం సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, నగర కార్యదర్శి ఏజే స్టాలిన్, డీవైఎఫ్‌ఐ కార్యదర్శి వై.రాంబాబు తదితరులను అదుపులోకి తీసుకున్నారు. విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న ఎంపీ హరిబాబును మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఎ.విమల ఘెరావ్ చేశారు. ఆయన కారును వైఎస్సార్‌సీపీ నాయకుడు జాన్‌వెస్లీ తదితరులు అడ్డుకున్నారు. రైల్వే జోన్ విశాఖకు దక్కకుండా అడ్డుపడడం తగదని గట్టిగా నిలదీశారు. అక్కడే ఉన్న మరికొందరు ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆ తర్వాత విమానాశ్రయంలోకి వస్తున్న అఖిలపక్ష నాయకులను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డగించారు. ఇంతలో ఎంపీ హరిబాబును పోలీసులు అక్కడ నుంచి కారులో పంపించివేశారు. దాదాపు రెండు గంటలపాటు విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం 18 మందిని పోలీసులు అరెస్టు చేసి ఐదో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించడంతో విషయం తెలుసుకున్న పలువురు అక్కడికి చేరుకోవడంతో మరో రెండుగంటల పాటు ఉద్రిక్తత కొనసాగింది. ఎట్టకేలకు రాత్రి 9 గంటల ప్రాంతంలో వీరందరినీ బెయిల్‌పై విడుదల చేశారు.