పెన్షన్ భిక్ష.. కాదు.. మా హక్కు.. సీపీఎస్ అంతమే.. మా పంతం అంటూ ఉద్యమిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు... ప్రతిపక్షనేత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీపీఎస్‌ను రద్దు చేసి తీరుతాం అంటూ ఇచ్చిన విశ్వసనీయమైన హామీ ఉద్యోగుల్లో ఆశలు చిగురింపచేసింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఉద్యోగులు మిలియన్ మార్చ్‌లు సైతం నిర్వహించారు. అయితే ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమం పట్టించుకోవాల్సిన ప్రభుత్వం మాత్రం హక్కు కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగులపై ఉక్కుపాదాన్ని మోపుతోంది. దీంతో ప్రభుత్వ చర్యల పట్ల ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు, వారి కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి కడప: ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎలాంటి సామాజిక భద్రత ఉంటుందో.. రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఉద్యోగికి అలాంటి భద్రతే ఉండాలన్న విధానాన్ని మన ప్రభుత్వాలు తుంగలో తొక్కాయి. సామాజిక భద్రతను కాలరాసేలా ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) విధానాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు. 2003లో ఎన్‌డీఏ ప్రభుత్వం నోటిఫై చేయగా 2004 జనవరి నుంచి కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు అమలులోకి వచ్చింది. అనంతరం 2004లో ఏర్పడిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం పీఎఫ్‌ఆర్‌డీఏ (పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ) బిల్లు పార్లమెంట్‌లో పెట్టింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో సైతం సీపీఎస్ విధానాన్ని తీసుకువచ్చింది.
అయితే అప్పట్లో ఉద్యోగ, కార్మిక సంఘాలు పోరాటాలు చేయడంతో దాదాపు 10 సంవత్సరాల పాటు బిల్లు ఆగింది. అనంతరం 2013లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీలు కలిసి పీఎఫ్‌ఆర్‌డీఏ చట్టం తెచ్చి దేశంలోని కోట్లాదిమంది ఉద్యోగుల జీవితాలకు భద్రత లేకుండా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏ పెన్షన్ విధానం అమలు చేయాలని నిర్ణయించాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలే. వారి రాజకీయ నిర్ణయంతో పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి నూతన పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామంటూ పీఎఫ్‌ఆర్‌డీఏతో ఒప్పందం కుదుర్చుకున్నది రాష్ట్ర ప్రభుత్వమే. సీపీఎస్ విధానంలో ఉద్యోగుల వాటా 10 శాతం ఉంటే.. ప్రభుత్వ వాటా 10 శాతం కలిపి వేలకోట్ల సొమ్మును ఎన్‌ఎస్‌డీఎల్‌కు (స్టాక్‌మార్కెట్)లో పెడుతున్నారు. పాలకులకు సీపీఎస్ రద్దు చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగులు, ప్రభుత్వం చెల్లిస్తున్న 10 శాతం వాటాను రద్దు చేయడంతో పాటు పీఎఫ్‌ఆర్‌డీఏతో ఒప్పందం రద్దు చేసుకుంటేనే పాత పెన్షన్ విధానం సాధ్యమవుతుందని మేధావుల మాట.
క్విట్ సీపీఎస్ అంటూ ఉద్యమిస్తున్న ఉద్యోగులు..
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సంస్కరణల్లో భాగంగా అమలు చేస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌తో పాటు అనేక రాష్ట్రాల్లో ఉద్యోగులు ఉద్యమిస్తున్నారు. మన రాష్ట్రంలో 1,86,000 మంది ఉద్యోగుల, ఉపాధ్యాయులు సీపీఎస్ విధానం వలన ఉద్యోగ జీవితానికి రిటైర్‌మెంట్ ప్రకటించిన తర్వాత పెన్షన్ భద్రత కోల్పోయారు. అయితే రాజకీయ నిర్ణయంతో తెచ్చిన నూతన పెన్షన్ పథకాన్ని రాజకీయ నిర్ణయంతోనే రద్దు చేయగలరని భావించిన ఉద్యోగ సంఘాలు ఉద్యమబాట పట్టాయి. మిలియన్ మార్చ్, క్విట్ సీపీఎస్, మాస్ క్యాజువల్ లీవ్‌లు పెట్టి కలెక్టరేట్‌ల ముట్టడి ఇలా వరుసగా ఏదో ఒక కార్యక్రమంతో పెన్షన్ హక్కు కోసం ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉద్యమిస్తున్నారు.
సంజీవినిలా వైఎస్ జగన్ హామీ..
సీపీఎస్ రద్దు కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎడారిలో ఒయాసిస్సులా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చి న హామీ వారిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రజాసంక్పల్పయాత్ర ప్రారంభించిన రోజే లక్షలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబాల్లో ఆనందం నింపేలా పెన్షన్ భద్రతతో పాటు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామంటూ స్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో సీపీఎస్ రద్దు కోసం ఉద్యమబాట పట్టిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఈయన ఇచ్చిన హామీ వారికి కొండంత బలాన్ని ఇచ్చింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఉద్యమం తీవ్రతరం చేశారు. అయితే సీపీఎస్‌ను రద్దు చేసే రాజకీయ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా ప్రభుత్వం స్పందించకుండా దాటవేత ధోరణి అవలంబిస్తోంది. దీంతో ఉద్యోగులు సైతం సీపీఎస్ రద్దు చేస్తారో.. లేక గద్దె దిగుతారో తేల్చుకోవాలని అల్టిమేటం జారీ చేస్తున్నారు. అదే విధంగా అన్ని రాజకీయ పార్టీలు సీపీఎస్ విధానంపై స్పష్టమైన విధానం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
హక్కుపై.. ఉక్కుపాదం..
తమకు, తమ కుటుంబాలకు జీవిత భద్రతను ఇచ్చే పెన్షన్ హక్కు కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులపై టీడీపీ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. సీపీఎస్ విధానంపై స్పష్టమైన వైఖరి తెలపకుండా ఉద్యమిస్తున్న వారిని ఎక్కడికక్కడ అణివేతకు గురిచేస్తోంది. చిన్న చిన్న మండలాల స్థాయిలోనే ఉద్యోగులను, ఉపాధ్యాయులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌లలో ఉంచుతున్నారు. దీంతో అమ్మా.. పెట్టదు.. అడుక్కోనివ్వదు.. అన్న విధంగా తయారైంది పరిస్థితి. ఉద్యోగులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం న్యాయం చేయకపోగా.. న్యాయమైన హక్కుకోసం పోరాడుతున్న వారిని అరెస్టు చేయడం పట్ల సీపీఎస్ ఉద్యోగులు మండిపడుతున్నారు. సీపీఎస్‌ను రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని.. తాటాకు చప్పుళ్ల లాంటి అరెస్టులకు భయపడమని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment