సీపీఎస్‌ అంతం.. ఉద్యోగుల పంతం | employees aganist cps | Sakshi
Sakshi News home page

సీపీఎస్‌ అంతం.. ఉద్యోగుల పంతం

Published Sun, Feb 12 2017 12:11 AM | Last Updated on Tue, Sep 5 2017 3:28 AM

సీపీఎస్‌ అంతం.. ఉద్యోగుల పంతం

సీపీఎస్‌ అంతం.. ఉద్యోగుల పంతం

- కాకినాడలో కదం తొక్కిన ఉద్యోగులు
- భారీ ప్రదర్శన, బహిరంగ సభ
- సంఘటిత ఉద్యమం ఉద్ధృతానికి నేతల పిలుపు
కాకినాడ సిటీ : కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌(సీపీఎస్‌)ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగులు కాకినాడలో శనివారం కదం తొక్కారు. ఏపీ సీపీఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన జిల్లా నలుమూలల నుంచీ వివిధ శాఖల ఉద్యోగులు పెద్ద ఎత్తున కాకినాడ తరలివచ్చి మహాశాంతి ర్యాలీ నిర్వహించారు. తొలుత బాలాత్రిపురసుందరి అమ్మవారి ఆలయం నుంచి మెయిన్‌రోడ్, బాలాజీచెరువు సెంటర్, జీజీహెచ్, కలెక్టరేట్, రామారావుపేట మీదుగా మెక్లారిన్‌ స్కూల్‌ వరకూ భారీ ప్రదర్శన నిర్వహించారు. ‘సీపీఎస్‌ అంతం - ఉద్యోగుల పంతం, ఒకే సర్వీసుకు ఒకే పెన్షన్‌ ఉండాలి’ అంటూ పెద్ద పెట్టున నినదించారు. సీపీఎస్‌ విధానంవల్ల ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక హక్కులైన పెన్షన్, గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్‌ వంటి సదుపాయాలను కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక, ఆర్థిక భద్రత లేని సీపీఎస్‌ విధానం రద్దు చేసేలా నిర్ణీత కాలపరిమితితో కూడిన కమిటీ వేయాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న డెత్‌ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్‌ సదుపాయం తమకు కూడా కల్పించాలని, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలను తక్షణం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.
ర్యాలీ అనంతరం మెక్లారిన్‌ హైస్కూల్‌ ఆవరణలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో తొలుత ఇటీవల మృతి చెందిన సీపీఎస్‌ ఉద్యోగులకు నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ సీపీఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ యుగంధర్‌ మాట్లాడుతూ, 2004 జనవరి ఒకటి నుంచి కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ను అమలు చేస్తూ, 2004కు ముందు, తరువాత అంటూ ఉద్యోగులను ప్రభుత్వం విభజించి గోడ నిర్మించిందన్నారు. ఆ గోడను బద్దలుగొట్టేందుకు ఉద్యోగులు మరింత సంఘటితంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. పాత పెన్షన్‌ విధానాన్ని సాధించుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళదామని పిలుపునిచ్చారు. ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని, సీపీఎస్, ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఓపీఎస్‌) అనే తేడా లేకుండా ఉద్యోగులందరూ ఉద్యమిస్తే పాలకులు దిగి వస్తారని అన్నారు.
ఉద్యమ కార్యాచరణ
జిల్లాలో ఉద్యమ కార్యాచరణను సీపీఎస్‌ ఉద్యోగుల సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతా నారాయణమూర్తి ప్రకటించారు. సంఘ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 28న రక్తదాన శిబిరాలు, జూన్‌లో వారం రోజులు బ్లాక్‌డే పాటించాలని, జూలై మొదటి వారంలో ఉద్యోగులు వారి కార్యాలయాల ముందు ధర్నాలు చేపట్టాలని, ఆగస్ట్‌ 9న క్విట్‌ ఉద్యమం, సెప్టెంబర్‌ ఒకటిన చలో అమరావతి చేపట్టాలని వివరించారు. అలాగే తునిలో భిక్షాటన, అమలాపురంలో భారీ బైక్‌ ర్యాలీ, రాజమహేంద్రవరంలో సత్యాగ్రహ యాత్ర చేపట్టాలని నిర్ణయించామని, వీటి తేదీలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. సంఘ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర నాయకులు కె.మునిప్రసాద్, గుబ్బల శ్రీనివాస్, ఖాజా రహ్మతుల్లా, జిల్లా గౌరవాధ్యక్షులు తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌, జిల్లా నాయకులు కె.వెంకటేష్, కె.రత్నాకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement