
ప్రేమ జంటపై పోలీసు ప్రతాపం
ప్రేమ జంటపైల పోలీసులు తమ ప్రతాపం చూపించారు.
–కౌన్సెలింగ్ పేరుతో స్టేషన్‌కు పిలిపించి బాలికను చితకబాదిన సీఐ
–ఆస్పత్రికి పంపాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట బంధువుల ఆందోళన
కడప : ప్రేమ జంటపైల పోలీసులు తమ ప్రతాపం చూపించారు. కౌన్సిలింగ్ పేరుతో చితకబాదారు. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కడప నగరం ఆకుల వీధికి చెందిన ఓ బాలికకు, అశోక్ నగర్‌కు చెందిన హర్షవర్ధన్‌కు మధ్య దాదాపు నాలుగు సంవత్సరాలుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నగరంలోని ఐటీఐ సర్కిల్‌లోని ఆలయంలో వివాహం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న అబ్బాయి తండ్రి, బంధువులు పోలీసు స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని వివరించారు. దీంతో పోలీసులు వెంటనే ప్రేమ జంటను పిలించారు.
వీరు మైనర్లు కావడంతో వారికి కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంది. కానీ ఆ పని చేయకుండా సీఐ రామకృష్ణ బాలికను చితకబాదరని ఆవేదన వ్యక్తం చేస్తూ బం«ధువులు ఆదివారం వేకువజామున పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసు దెబ్బలకు సొమ్మసిల్లి పడిపోయిన బాలికను ఆసుపత్రికి తీసుకువెళ్లాలని బంధువులు ఎంతగా ప్రాధేయపడినా పోలీసులు స్పందించలేదని వారు ఆరోపించారు. సీఐ రామకృష్ణ బాలికను, ఆమె బంధువులను దుర్భాషలాడటంతో పాటు స్టేషన్ వద్ద ఉంటే మీపై కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తూ దాడికి దిగబోయాడని బాధితులు వాపోయారు.
బాలికను ఆసుపత్రికి తరలించేందుకు ఆమె బంధువులు 108కి సమాచారం అందించడంతో అక్కడికి వాహనం చేరుకుంది. పోలీసులు ఇక్కడ ఎవ్వరూ గాయపడిన దాఖలాలు లేవని వాహనాన్ని తిప్పి పంపారు. బాలికను, అబ్బాయిని పోలీసులు స్టేషన్‌లోనే ఉంచారు.సీఐ రామకృష్ణ మాట్లాడుతూ ఇద్దరు మైనర్లు కావడంతో కౌన్సెలింగ్‌కు పిలిపించామే తప్ప తాము ఎవరిపట్లా దురుసుగా ప్రవర్తించలేదని, కొట్టలేదని తెలిపారు.