పోలీసు వాహనంపై నుంచి నినాదాలు చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు పార్థసార«థి, జోగి రమేశ్, మల్లాది విష్ణు, ఉదయభాను
సాక్షి, అమరావతి, విజయవాడ సిటీ: ఐదు కోట్ల మంది ఆకాంక్ష ‘అమరావతి’ని తాకింది. రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజధాని నడిగడ్డలో ప్రత్యేక హోదా గళాలు గర్జించాయి. ‘హోదా ఆంధ్రుల హక్కు’ నినాదం విజయవాడలో మారుమోగింది. ప్రత్యేక హోదా కోసం సోమవారం అఖిలపక్షం చేపట్టిన ‘చలో అసెంబ్లీ’పై రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ప్రయోగించింది. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కల్పించినా హోదా నినాదం మారుమోగింది. మొద్దునిద్ర పోతున్న పాలకుల వైఖరితో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని స్పష్టంగా అఖిలపక్షం వివరించింది.
ప్రతిపక్ష నేతలపై అమానుషం
అసెంబ్లీ ముట్టడికి యత్నించిన వైఎస్సార్ సీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అలంకార్ సెంటర్‌లో ఆందోళన చేస్తున్న వారిని వ్యాన్‌లోకి విసిరేసి అమానుషంగా ప్రవర్తించారు. వైఎస్సార్ సీపీ నేతలు కొలుసు పార్థసారథి, సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, బొప్పన భవకుమార్, పైలా సోమినాయుడు, సింహాద్రి రమేష్, యార్లగడ్డ వెంకట్రావులతోపాటు సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణ, వామపక్ష నేతలు సీహెచ్ బాబూరావు, దోనేపూడి శంకర్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment