
ప్రదర్శనకు వచ్చి మహిళలపై దురుసుగా ప్రవర్తిస్తున్న ఎస్సై సత్యనారాయణ
తూర్పుగోదావరి, కాకినాడ క్రైం (కాకినాడ సిటీ): స్థానిక ఆర్‌ఎంసీలో పది రోజులుగా నిర్వహిస్తోన్న వజ్రంగ్ వైద్య విజ్ఞాన ప్రదర్శనలో ఆదివారం పోలీసులు జులుం ప్రదర్శించడంతో ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ప్రదర్శకుల సంఖ్య పెరిగిపోవడంతో కళాశాల యాజమాన్యం పోలీసుల సహాయం కోరింది. ఆది, సోమవారాల్లో 5 వేలకు మించి అనుమతించేది నిర్వహకులు ప్రకటించారు. ఈ ప్రదర్శనకు ఆదివారం విద్యార్థులు మళ్లీ పొటెత్తడంతో టూటౌన్ పోలీస్‌స్టేషన్ అధికారులు జులుం ప్రదర్శించడంతో విద్యార్థులు, ప్రదర్శనకు వచ్చే సందర్శకులకు అడుగడుగునా ఆటంకాలు ఏర్పడ్డాయి.
రెండు గంటలకు పైగా ప్రదర్శనను నిలిపివేసి విద్యార్థులను క్యూలో నిలబెట్టారు. పోలీస్‌ల రాకతోనే అటంకాలు వచ్చాయని సందర్శకులు విమర్శించారు. పోలీసు అధికారులు సందర్శకులపై విరుచుకుపడడం, విద్యార్థులను కొట్టేంతంగా పోలీసులు వ్యవహరించడంతో వారు భయాందోళన వ్యక్తం చేశారు. ప్రదర్శనను తక్షణం నిలిపివేయాలని, లేకుంటే అందరిపైనా కేసులు పెడతామంటూ టూటౌన్ సీఐ, ఎస్సైలు బెదిరించారని ప్రొఫెసర్లు ఆరోపించారు. ఇంతవరకూ సాఫీగా సాగిన ప్రదర్శన ఈ పరిస్థితిపై వాట్స్‌ప్, నెట్‌లో చెడుగా ప్రచారమైందంటూ వాపోయారు. ప్రొఫెసర్లు, డాక్టర్లను ఏకవచనంతో ఎస్సై మాట్లాడారని, దీనిపై ఎస్పీ విశాల్ గున్నికి ఫిర్యాదు చేస్తామని పలువురు మెడికల్ విద్యార్థులు తెలిపారు. పోలీసుల తీరును కలెక్టర్, ఎస్పీలను కలసి వివరించేందుకు కళాశాల యాజమాన్యం, ప్రొఫెసర్లు, కాలేజీ విద్యార్థులు, ప్రదర్శన నిర్వాహకులు ఆదివారం రాత్రి సమావేశమై చర్చించారు.
‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌పై కూడా..
ఈ ఉత్సవాల కవరేజికి వెళ్లిన ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌పై టూటౌన్ ఎస్సై సత్యనారాయణ జులం ప్రదర్శించి అక్రిడిటేషన్ కార్డును లాగున్నారు. ప్రదర్శనకు వచ్చిన మహిళలపై దురుసుగా ప్రవర్తిస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తుండగా ఫొటోలు తీస్తుంటే.. ఏమిటీ ఫొటోలు తీస్తున్నాం. ఫొటోలు డిలిట్ చేయలంటూ కెమెరా లాగుక్కునే ప్రయత్నం చేశారు. ‘సాక్షి’ ఫొటోగ్రాఫరని చెబుతున్నా వినకుండా.. నీవు ఫోటోలు ఎందుకు తీసున్నావ్, నేను ఎస్సైని తెలుసా అంటూ.. నీకు ఇక్కడ పనేంటని ప్రశ్నించారు. ‘సాక్షి’అయితే ఏంటీ, నీ అక్రిడిటేషన్ కార్డు చూపించు అంటూనే కేకులు వేశారు. చూపించిన ఆ కార్డును తీసుకొని ఎవడితో చెప్పుకుంటావో చెప్పుకో అంటూ కార్డును తీసుకొని వెళ్లిపోయారు. పోలీసుల దురుసు ప్రవర్తన వల్ల ఆదివారం సందర్శనకు వచ్చిన పలువురు ప్రదర్శన చూడకుండా తిరిగి వెళ్లిపోయారు. ఈ విషయంపై కాకినాడ డీఎస్పీ రవివర్మకు ఫిర్యాదు చేశారు.
నేడు కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులు ధర్నా
‘సాక్షి’ఫోటోగ్రాఫర్ సతీష్‌పై టూటౌన్ ఎస్సై ప్రదర్శించిన జులంపై సోమవారం కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులు ధర్నా చేపట్టేందుకు పిలుపు ఇచ్చారు. సాక్షి ఫొటోగ్రాఫర్ అని చెబుతున్నా ఎస్సై అనుచితంగా వ్యవహరించడం సరికాదని, ఈ విషయాన్ని కలెక్టర్‌కు వివరించాలని జర్నలిస్టులు నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment