
మార్కెట్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన టీడీపీ బ్యానర్ల వద్ద పోలీసుల బందోబస్తు
నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు.. అన్నట్లుగా ఉంది గుడివాడ అధికార పార్టీ నేతల తీరు. వారు తానా అంటే తందానా.. అంటున్నారు ఇక్కడి పోలీసు అధికారి. అధికార పార్టీ నేతలు సెలవిచ్చిందే తడవుగా న్యాయాన్యాయాలతో పని లేకుండానే పోలీసు పవర్‌ను వినియోగిస్తున్నారు. గుడివాడలో చోటు చేసుకున్న ఈ వింత పరిస్థితిని చూసి జనం నవ్వుతుండగా పోలీసులు మాత్రం ఇదేం ఖర్మరా బాబూ.. అంటున్నారు. ‘సాక్షి’ సేకరించినవివరాలు ఇలా ఉన్నాయి.
కృష్ణాజిల్లా, గుడివాడ : పట్టణంలోని మార్కెట్ సెంటర్‌లో టీడీపీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా టీడీపీ నాయకుల ఫొటోలతో స్వాగత ఆర్చీ ఏర్పాటు చేశారు. టీడీపీ నేతల ఫ్లెక్సీలపై ఫొటోలను ఎవరైనా ఆకతాయిలు కోసేస్తారేమోనని పోలీసు రక్షణ కల్పించాలని అధికార పార్టీ నేతలు ఆదేశించినట్లు సమాచారం. దీంతో గుడివాడ పోలీసు ఉన్నతాధికారి ఆదేశాల మేరకు ఫ్లెక్సీలకు పదిహేను రోజులుగా రాత్రీ పగలు పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఆరుగురు పోలీసులతో బందోబస్తు...
వినాయక చవితి ముందు రోజు ఫ్లెక్సీలతో టీడీపీ నేతలు స్వాగత ద్వారం ఏర్పాటు చేశారు. ఆరోజు నుంచి ఉదయం ఇద్దరు కానిస్టేబుళ్లు, మధ్యాహ్నం ఇద్దరు, రాత్రికి ఇద్దరు చొప్పున డ్యూటీలు వేశారు. అయితే ఉత్సవాలు ముగిసినా నిమజ్జనం జరిగి నాలుగు రోజులు దాటినా అధికార పార్టీ నేతల ఫ్లెక్సీలు అలాగే ఉన్నాయి. దీంతో ఫ్లెక్సీలకు ప్రతి రోజు పోలీసు బందోబస్తు మాత్రం తప్పటం లేదు.
పగలు ఎండలో.. రాత్రి దోమలతో చెలగాటం...
కాపలా కాస్తున్న పోలీసులకు పగలు ఎండ, రాత్రి దోమలతో చెలగాటం తప్పడం లేదు. రాత్రి సమయంలో నిద్ర పోకుండా కాపలా కాస్తున్నారు. ఎక్కడైనా మనుషులకు కాపలా కాస్తారు తప్ప, బ్యానర్లకు కూడా పోలీసులు కాపలా కాయటమేమిటని ప్రజలు నవ్వుకుంటున్నారు. అధికారం ఉందని ఇలా దుర్వినియోగం చేయటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రి కాపలా ఉండే పోలీసులు దోమల బాధ తట్టుకోలేక ఏనాడో పాపం చేసుకున్నాం... లేకుంటే ఇదేం ఖర్మ.. అని ఆవేదన చెందుతున్నా రు. అధికార పార్టీ నేతలకే కాకుండా ఫ్లెక్సీలో ఉండే ఫోటోలకు కూడా పోలీసులు సేవలు చేయటం విడ్డూరంగా ఉందని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment