నేనేంటో చూపిస్తా.. | Police quarters in the town, near the site of the Municipal Police Department | Sakshi
Sakshi News home page

నేనేంటో చూపిస్తా..

Published Tue, Jul 8 2014 1:18 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM

నేనేంటో చూపిస్తా.. - Sakshi

నేనేంటో చూపిస్తా..

పట్టణంలో పోలీసు క్వార్టర్స్ సమీపంలో మున్సిపల్ స్థలంలో పోలీస్ శాఖ శ్రీదేవి దండుమారమ్మ కల్యాణ మండపాన్ని నిర్మించింది. కల్యాణ మండపం వెనుకనే దండుమారమ్మకాలనీ, కాళీఘాట్‌కాలనీ, శాంతినగర్, క్రాంతినగర్ కాల నీవాసులు నివాసం ఉంటున్నారు. గతంలో వీరు ఎస్.కోట రోడ్డు వైపు ఉన్న ప్రైవేటు స్థలం మీదుగా రాకపోకలు సాగించేవారు. ఆ స్థలం యజమాని ప్రహరీ నిర్మించడంతో కాలనీవాసులు వెళ్లేందుకు దారి లేకుండా పోయింది. దీంతో ఆయా కాలనీలవాసులు తమకు దారి కల్పించాలని కలెక్టర్‌ను కోరారు. ఈ విషయమై కొన్నేళ్లుగా కాలనీవాసులు కలెక్టర్, మున్సిపల్ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నా రు. దీంతో కలెక్టర్ రోడ్డు నిర్మాణానికి  నిధులు కేటాయించారు. 20 అడుగుల రోడ్డు కోసం మున్సిపల్
 అధికారులు దండుమారమ్మ కల్యాణ మండలం ప్రహరీలో కొంత భాగంలో మార్కింగ్ చేశారు.
 
  సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ప్రహరీని తొలగించేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారి జె. వెంకటరావు, విజయనగరం తహశీల్దార్ పెంటయ్య, మున్సిపల్ కమిషనర్ ఎస్. గోవిందస్వామి సంఘటన స్థలానికి వెళ్లారు.  అయితే సమైక్యాంధ్ర ఉద్యమంలో బందోబస్తుకు వచ్చిన సిబ్బంది ఇక్కడే బస చేశారని, తుపాకీలు కల్యాణ మండలంలో ఉన్నాయని చెప్పి గోడ తొలగించకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు వెనుతిరిగారు. కానీ స్థానికుల విజ్ఞప్తి మేరకు ఈనెల 2వ తేదీన కలెక్టర్ ఆదేశాల మేరకు మళ్లీ మున్సిపల్ కమిషనర్ ఆర్.సోమన్నారామణ పొక్లెయిన్‌తో సహా వెళ్లి గోడను పగలు కొట్టించారు. దీంతో పోలీసులు మున్సిపల్ అధికారులపై కేసులు నమోదు చేశారు.   గోడ తొలగింపు రెండు శాఖల మధ్య చిచ్చురేపింది.
 
 తమపై కేసులు ఎత్తివేయకపోతే విధులు బహిష్కరిస్తామని మున్సిపల్ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. కొత్తగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు కాలనీ వాసులు, మున్సిపల్ ఉద్యోగులకు మద్దతుగా రంగంలోకి దిగారు. అయినా ఫలితం లేకపోయింది. డీఆర్‌డీఎ సమావేశ మందిరంలో సోమవారం రాష్ట్ర మంత్రి కిమిడి మృణాళిని సమీక్ష చేస్తుండగా చైర్మన్‌తో పాటు కౌన్సిలర్లంతా వచ్చి ఆమె వద్ద మొర పెట్టుకున్నారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, మున్సిపల్ ఉద్యోగుల ఆందోళనను మంత్రి దృష్టికి తీసు కెళ్లారు. దీంతో ఎస్పీని పిలవమని మంత్రి ఆదేశించారు.
 
 ఆ మేరకు ఎస్పీని రప్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. మంత్రి మృణాళిని, జెడ్పీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి, ఎమ్మెల్యేలు కోళ్ల లలి తకుమారి, బొబ్బిలి చిరంజీవులు, జిల్లా అధికారుల సమక్షంలోనే  కలెక్టర్, ఎస్పీలు చాలా సేపు వాదించుకున్నారు. కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ  ‘ఐ షో వాట్ ఈజ్ కాంతిలాల్ ’ అంటూ ఎస్పీపై ఫైర్ అయ్యారు.  కలెక్టర్, ఎస్పీల  మధ్య నెలకొన్న వివాదం భవిష్యత్‌లో ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో చూడాలి.
 
 కలెక్టర్, ఎస్పీల మధ్య వాదోపవాదాలు సాగిన తీరు...
 కలెక్టర్: చూడు! తఫ్సీర్ మీరు రెండు తప్పులు చేస్తున్నారు. 2,500 మందిని అసౌకర్యానికి గురిచేస్తున్నారు. రెండోది.. కేంద్ర మంత్రి, కలెక్టర్.. చెప్పినా సమస్యను పరిష్కరించలేదు. మీరు సపోర్ట్ చేస్తున్న కల్యాణ మండపం...మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి కట్టినది. ఈ విషయం మర్చిపోతున్నారు.
 
 ఎస్పీ: లేదు సార్! చట్ట ప్రకారం ఈ కార్యక్రమాన్ని నడవనీయండి! మేడం గారు (మంత్రి మృణాళిని)  మీరు ఏం చెబితే అదే చేద్దామం
 కలెక్టర్: చట్ట ప్రకారం చేయడమంటే మరింత ఆలస్యమై ప్రజలు ఇబ్బందులు పడడానికా? స్థలా న్ని ఆక్రమించి కట్టుకున్నదీ కల్యాణమండ పం. అయినా  కొత్తగా మరో శంకుస్థాపన రాయిని వేశారంటే చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకున్నట్టే కదా!  
 ఎస్పీ: లేదు సార్! చిన్న సబ్‌మిషన్! ఇటువంటి కూలదోసే వ్యవహారం చేసినపుడు నా దృష్టిలో వేయాలి కదా! ఎందుకు వేయలేదనే విషయమై ఇలా గొడవ పెద్దదైందంతే!
 కలెక్టర్:  గతంలో ఆర్డీఓ గారితో ఏమన్నారు? ఒక అంగీకారానికి వచ్చారా లేదా? అప్పుడేమైందో చెప్పండని అక్కడే ఉన్న ఆర్డీఓను కలెక్టర్ కోరారు.
 ఆర్డీఓ: అవున్సార్! ఓ మార్కింగ్ చేసి అంతవరకూ రహదారి ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది.
 దీంతో కలెక్టర్ జోక్యం చేసుకుని చూడండి ఎస్పీ గారూ! ఇలా ముందో మాట చెప్పిన తరువాత ఎలా తప్పుతారు?  సరే  నిబంధనల ప్రకా రం వెళ్లాలంటున్నారు కదా! మీకు రెండు నోటీసులు ఇచ్చారు. మీరు సమాధానం చెప్పలేదు.  అటువంటప్పుడు వారు గోడ కూలదోయరా?  మరి మున్సిపల్ ఉద్యోగులపై కేసులు ఎందుకు పెట్టారు? అని ప్రశ్నించారు.
 ఎస్పీ:  కేసులు ఎవరి మీదా పెట్టలేదే? ఓవరాల్‌గా కేసు బుక్కయింది. ఇది ఉన్నతాధికారుల దృష్టికెళ్లిపోయింది.  రూల్ ప్రకారం వెళ్లిపోతే ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది.
 వెంటనే మంత్రి మృణాళిని కల్పించుకుని చూడండిసార్ ! మనం ప్రజా సేవకులం. ఇలా ప్రతిష్టలకు పోతే ప్రజలకు సేవ చేయలేం! అక్కడ దారి ఉండాలి కదా! మీరు కల్యాణ మండపం పక్కనే కొత్తగా నిర్మిస్తున్న వంట గదిని అక్కడ కాకుండా అప్‌స్టెయిర్‌లో కట్టుకోండి. అప్పుడు ఏ సమస్యా ఉండదు.
 దీనికి ఎస్పీ మాట్లాడుతూ సరే కళ్యాణమండపం నెలకు రెండు మూడు రోజులు మాత్రమే సందడిగా ఉంటుంది. ఆ రోజుల్లో మూసేసి   మిగతా రోజుల్లో వదిలేస్తాం.
 
 కలెక్టర్: అది సరి కాదు. నేను కొన్ని రోజులే ఇస్తాను. మిగతా రోజులు ఇవ్వను అంటే ఎలా కుదురుతుంది. ఇంత మంది ప్రజలు, కొత్త మున్సిపల్ చైర్మన్, పాలకవర్గం వచ్చి చెబుతున్నా ఇంకా అవే మాటలంటావేంటి? అంటూరుసరుస లాడారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement