
శిల్పా బంధువుల ఇళ్లలో సోదాలు
సాక్షి, నంద్యాల: వైఎస్‌ఆర్‌సీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి బంధువులు, అనుచరుల ఇళ్లలో శుక్రవారం అర్థరాత్రి పోలీసులు సోదాలు నిర్వహించారు. శిల్పా బంధువులు జగదీశ్వర్ రెడ్డి, ఆదిరెడ్డి ఇళ్లలో, ఆయన మద్దతుదారులు ఆర్యవైశ్య నాయకుడు నెరవేటి సత్యనారాయణ, లింగారెడ్డి ఇళ్లలోనూ తనిఖీలు చేశారు. పోలీసులు అర్థరాత్రి ఇళ్ల తలుపులు తట్టి సోదాలు నిర్వహించడాన్ని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఖండించారు. ఉప ఎన్నికకు పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ పోలీసులను ఉపయోగించి తమపై దాడులను పెంచుతోందని ఆరోపించారు.
టీడీపీకి మంత్రులు, వారి మద్దతుదారులపై పోలీసులు దాడులు చేయకపోవడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. తమ పార్టీకి చెందిన నేతలు, మద్దతుదారులను టార్గెట్ చేస్తున్నారని వాపోయారు. అధికార టీడీపీ వందల కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నా పట్టించుకోరా? అని ప్రశ్నించారు. పోలీసుల పక్షపాత వైఖరి ప్రజాస్వామ్యానికి చేటని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసన్నల్లోనే వేధింపుల పర్వం కొనసాగుతోందని ఆరోపించారు. ఈ వేధింపులకు నంద్యాల ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా నంద్యాలలో విజయం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని దీమా వ్యక్తం చేశారు.