పాస్టర్లపై దాడి.. వీడిన చిక్కుముడి
ముగ్గురు అరెస్టు.. పరారీలో ఐదుగురు
వికారాబాద్ పాస్టర్ హత్య కేసులోనూ నిందితులు
మతమార్పిడికి పాల్పడుతున్నారనే దాడులు
నిందితులంతా ఓ మత సంస్థ కార్యకర్తలు
నల్లగొండ ఎస్పీ ప్రభాకర్‌రావు వెల్లడి
సాక్షి, నల్లగొండ: పాస్టర్లపై జరుగుతున్న వరుసదాడులు కేసుల మిస్టరీని నల్లగొండ జిల్లా పోలీసులు ఛేదించారు. ఎనిమిది నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేశారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి పాస్టర్‌పై హత్యాయత్నం, వికారాబాద్ పాస్టర్ హత్యతో పాటు పలు దాడుల కేసుల్లో వీరు నిందితులు. తామంతా ఓ మత సంస్థ కార్యకర్తలమని నిందితులు అంగీకరించినట్లు ఎస్పీ డాక్టర్ ప్రభాకర్‌రావు తెలిపారు.మతమార్పిడులకు పాల్పడుతున్నారన్న కారణంగానే పాస్టర్లపై కక్ష పెంచుకుని ఈ దాడులకు పాల్పడ్డారని ఆయన చెప్పారు. సోమవారం తన కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఈ కేసుల వివరాలను వెల్లడించారు.
పట్టుబడిందిలా: తమ తల్లిదండ్రులు మతమార్పిడి చేసుకునేలా పాస్టర్ నామా మోజెస్, సువార్త దంపతులు ప్రోత్సహించారని, దీంతో ప్రతీకారం తీర్చుకోవాలని నార్కట్‌పల్లికి చెందిన ఉదయ్‌కుమార్, గండికోట రాజు అనుకున్నారు. గతనెల 29వ తేదీ రాత్రి పథకం ప్రకారం పాస్టర్ దంపతులపై దాడిచేసి పరారయ్యారు. ఓ మతసంస్థ కార్యకర్తలైన వీరిలో ఇద్దరు వ్యక్తులు రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో ఉంటారు. వీరి సహకారంతో అక్కడ మరోపాస్టర్ సంజీవులును ఈనెల 10వ తేదీన దారుణంగా హత్య చేశారు. ఈ రెండు ఘటనల్లో నిందితులు పాలుపంచుకున్న తీరు ఒకేలా ఉందని గుర్తించిన పోలీసులు.. ఒకే ముఠాకు చెందినవారే ఈ దాడులకు పాల్పడి ఉండవచ్చని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మొత్తం ఎనిమిది మంది పాలుపంచుకున్నారని ఇన్‌ఫార్మర్ల ద్వారా కూపీ లాగారు. నార్కట్‌పల్లిలో ముగ్గురు నిందితులు వడ్డెపల్లి నాగరాజు, మంద రవి, వంశీధర్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించారు. మిగిలిన ఐదుగురిలో నలుగురు వ్యక్తులు వికారాబాద్‌లో పాస్టర్ హత్య కేసులో నిందితులు. పరారీలో ఉన్న రామకృష్ణ, ఉదయ్‌కుమార్, శ్రీను, గండికోట శ్రీనివాస్, అనుదీప్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పాత ఘటనలూ వెలుగులోకి..: పట్టుబడిన నిందితులను విచారించగా గతంలో పాస్టర్లపై జరిపిన దాడుల్లో తమ కార్యకర్తలే పాలుపంచుకున్నారని నిందితులు తెలిపారని పోలీసులు వెల్లడించారు. 2010 డిసెంబర్ 20న మునుగోడు గ్రామానికి చెందిన పాస్టర్ తాళ్ల క్రిస్టోఫర్‌పై దున్న కొండల్, కట్ట కుమార్ దాడి చేశారు. ఇదే మండలంలో ఇప్పర్తి బాప్టిస్టు చర్చి పాస్టర్ గజ్జల నీలాద్రిపాల్‌పై ఆలగంటి కృష్ణ, మేడి అశోక్ దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.