సోమిశెట్టి హరికృష్ణ కోసం గాలింపు
మారేడుపల్లి(హైదరాబాద్): బాలికపై లైంగికదాడి ఘటనలో నిందితుడిపై నిర్భయ చట్టంతో పాటు ఐపీసీ 376 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు, నిందితుడిని పట్టుకొనేందుకు రెండు ప్రత్యేక బృందాలను బెంగళూరు, కర్నూలుకు పంపినట్టు మారేడుపల్లి ఇన్‌స్పెక్టర్ రవీంద్రారెడ్డి బుధవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.
వెస్ట్‌మారేడుపల్లిలోని శివఅరుణ కాలనీలో నివాసం ఉంటున్న ఓ మైనర్ బాలికపై కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తమ్ముడి కుమారుడైన సోమిశెట్టి హరికృష్ణ ఈనెల 11వ తేదీన అత్యాచారం జరిపినట్లు బాధితురాలు మారేడుపల్లి పోలీసుల స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న సోమిశెట్టి హరికృష్ణ అప్పటి నుంచి పరారీలో ఉన్నారు.
అయితే మారేడుపల్లి పోలీసులు ఫిర్యాదును గోప్యంగా ఉంచారు. ఈ వార్తను సాక్షి బుధవారం ప్రచురించింది. దీంతో మారేడుపల్లి పోలీసులపై ఉన్నతాధికారుల ఒత్తిడి పెరిగింది. చేసేదిలేక పోలీసులు నిందితుని కోసం ప్రత్యేక బృందాలను పంపారు. ఇదిలా ఉండగా సోమిశెట్టి హరిక్రిష్ణను ఈ కేసును తప్పించడానికి మాజీ మంత్రులు, సీనియర్ రాజకీయ నాయకులు ప్రయత్నిస్తునట్లు సమాచారం. ఇప్పటికే పోలీసు బాస్‌పై వత్తిళ్లు తెచ్చినట్లు సమాచారం.