ఖాకీ వనంలో ఖద్దరు భోజ్యం
‘ఎవడ్రా.. మా వాళ్లను పట్టుకుంది. దొంగనా... మీ కాలర్ అంత గొప్పదా? మా వాళ్లు ఎవరేం చేసినా చూస్తూ ఊరుకోవాల్సిందే. ఇక్కడ మేం చెప్పిందే వేదం. మేం కేసు కట్టమంటే కట్టాలి. కాదంటే మానుకోవాలి’ ఇవన్నీ ఏదో పోలీస్ మార్క్ హీరోయిజం ఉన్న డబ్బింగ్ సినిమాల్లో విలన్ నోట వచ్చే డైలాగులు కాదు. జిల్లా టీడీపీలో అడ్డూ అదుపూ లేకుండా రెచ్చిపోతున్న ఓ నాయకుడి ఓవరాక్షన్. ఇటీవల పోలీసులను పత్రికల్లో రాయలేని పరుష పదజాలంతో బూతులు తిట్టగా.. వాటిలో కాస్త మర్యాదగా ఉన్న మాట లివి. అంటే సదరు నేత ఖాకీలను ఏ స్థాయిలో దూషించారో అర్థం చేసుకోవచ్చు. ఇంతకూ వారు చేసిన తప్పేంటి అంటారా..? నల్లజర్లలో నూతనంగా నిర్మిస్తున్న ఓ అపార్ట్‌మెంట్ యజమానికి, అక్కడ పనిచేసే తాపీ పని వారికి కూలి ధరల విషయమై రేగిన వివాదం పోలీసుల చెంతకు చేరింది. ఫోన్‌కాల్ ద్వారా ఫిర్యాదు రావడంతో ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడకు వెళ్లారు.
అపార్ట్‌మెంట్ నిర్మాణ వ్యవహారాలు చూస్తున్న ఓ టీడీపీ కార్యకర్త పోలీసులతో ఘర్షణకు దిగాడు. ఓ కానిస్టేబుల్ చొక్కా కాలర్ పట్టుకుని కొట్టడానికి ప్రయత్నించి ఆనక పరారయ్యాడు. ఆ తర్వాత జిల్లా టీడీపీ నాయకుడి సూచన మేరకు తిరిగి పోలీసులపైనే ఎదురు కేసు పెట్టాడు. అంతేకాదు దళితులైన మరో ఇద్దరి అనుచరులతో కేసు పెట్టించాడు. ఆ రోజు రాత్రి సదరు టీడీపీ నేత విషయమేంటో మాట్లాడదాం రండి అంటూ పోలీసులను పిలిపించాడు. పెద్దమనిషి పిలిచాడు కదా రాజీ చేస్తారేమోనని వెళ్లిన పోలీసులకు చుక్కలు కనిపించాయి. సదరు నేత పోలీసులను చూడగానే ఇంతెత్తున లేచి ‘ఏరా మీకాలర్ అంత గొప్పదా? మీరు మా కాలర్ పట్టుకోవచ్చా. ఇక్కడ ఎవరేం చేసినా చూస్తూ ఊరుకోవాల్సిందే. ఇక్కడ మేం చెప్పిందే వేదం. మేం కేసు కట్టమంటే కట్టాలి లేదా మానుకోవాలి. మీ బాస్‌లంతా మేం వేయించినోళ్లే. వారంతా మా కనుసన్నల్లో నడవాలి.
అసలు నేనే ఒక అడ్మినిస్ట్రేషన్ ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడ అసలు పోలీస్ అవసరం లేకుండా చేస్తా’ అని ఇష్టానుసారం చిందులు తొక్కారట. సదరు కానిస్టేబుళ్లు తమ ఉన్నతాధికారికి గోడు వెళ్లబోసుకున్నారు. ఆత్మ గౌరవం చంపుకుని అక్కడ పని చేయలేమని, కొత్తగా తెలంగాణ నుంచి మన జిల్లాలో కలిసిన కుకునూరు, వేలేరుపాడు లేదా ఏజెన్సీ ప్రాంతానికి బదిలీ చేసినా వెళ్లి పని చేసుకుంటామని, తెలుగుదేశం నేతల వేధింపులు మాత్రం భరించలేమని తెగేసి చెప్పారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయ్యో ఇంతదూరం ఎందుకొచ్చారు, మీ అధికారి వద్దకు వెళ్లండని ఉన్నతాధికారి ఊరడించి పంపడంతో ఒకింత ధైర్యం తెచ్చుకుని తిరిగివెళ్లిన వారికి మళ్లీ చుక్కలు కనిపించాయి. ‘నాకు తెలియకుండా ఉన్నతాధికారి వద్దకు వెళ్తారా. ఎంతధైర్యం మీకు’ అంటూ సదరు అధికారి ఆ కానిస్టేబుళ్లకు మెమోలు జారీ చేశారట.
శాంతిభద్రతల పరంగా మీకే సమస్య ఉన్నా ఒక్క ఫోన్ కాల్‌తో ఫిర్యాదు చేయొచ్చు అని ఊదరకొట్టే అధికారుల ప్రకటనలు పోలీసు సిబ్బందికి మాత్రం వర్తించవన్నమాట. ఎందుకంటే వారు క్రమశిక్షణ తప్పినట్టట. మొత్తంగా జిల్లాలోని ఖాకీలను చూస్తే సామాన్య జనానికి వామ్మో పోలీసోళ్లు అనిపిస్తుంటే.. టీడీపీ నేతల ఆడగాలకు బలవుతున్న తీరు చూస్తే పాపం పోలీసోళ్లు అనిపించక మానదు. ఇంతకూ పోలీసు ఉద్యోగుల సంక్షేమ సంఘం వాళ్లు ఏమైనట్టు. ఖాకీవనంలో పచ్చచొక్కాలు చొరబడి ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నా, పోలీసు సిబ్బంది నరకయాతన పడుతున్నామని గోడు వెళ్లబోసుకుంటున్నా సంఘం నేతలు పత్రికాపరంగా ఖండనలు కూడా ఇచ్చే ధైర్యం చేయడం లేదెందుకో?
-జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు