కిక్.. దిగుతోంది..!
► జిల్లా పోలీసుల స్పెషల్ డ్రైవ్
►పరుగులు పెడుతున్న మందుబాబులు
►డ్రంకెన్ డ్రైవ్ కేసులు తగ్గించేందుకే..
►చాలెంజ్‌గా తీసుకున్న ఎస్పీ
అరేయ్ భీముడూ బార్‌కెళ్లి బీరు కొడదాం పదరా? బీరా.. వద్దురా రాముడు.. ఏరా మామా ఏమైంది? ఏంటీ ఏమైంది నిన్నగాక మొన్న శీనుగాడి పుట్టినరోజని అందరం కలిసి బార్‌కెళ్లాం. సరదాగా రెండే రెండు గ్లాసులు మందు తీసుకున్నాం. అలా తాగి ఇలా బయటకొచ్చామో లేదో పోలీసోళ్లు చటుక్కున పట్టారు మామా.. క్షణాల్లో నోట్లో గొట్టాలు పెట్టేశారు. గట్టిగా గాలి ఊదమన్నారు. బతిమాలినా వదల్లేదు. ఊదనంటే ఒప్పుకోరు. ఉడాయిద్దామంటే ఊరుకోరు. చేసేది లేక బలవంతంగా ఊదినందుకు రూ.2,500 జరిమానా కట్టాల్సి వచ్చింది. సోముడికి అయితే పదిహేను రోజులు జైలునూ..! మందు గిందూ వద్దురా బాబు.. ఇలా.. జిల్లాలో మందు మాటెత్తితే మందుబాబులు మూతులు మూసుకుంటున్నారు. ఇటీవల జిల్లా పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌తో మందు తాగాలన్నా, తాగి వాహనం నడపాలన్నా వణికిపోతున్నారు.
కోనేరు సెంటర్ (మచిలీపట్నం) : సరదాగా కొందరు, సంతోషంగా మరికొందరు, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో ఇంకొందరు.. కారణలేమైనా నూటికి 90 శాతం మంది మందుతాగటం పరిపాటిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో బార్‌లలో బాటిళ్లు ఎత్తి ఇలా బయటికి వచ్చేసరికి బ్రీత్ ఎనలైజర్‌తో ఖాకీలు మందుబాబులకు కళ్లెదుటæ ప్రత్యక్షమవుతున్నారు. దీంతో అప్పటివరకు తాగి తందనాలు ఆడినవారు ఒక్కసారిగా పోలీసులను చూసేసరికి ఎక్కిన కిక్కు ఎక్కినట్టే దిగిపోతోంది.
జిల్లాలో మందుబాబుల ఆగడాలను అరికట్టి, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న సర్వశ్రేష్ట త్రిపాఠి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లాలో డ్రంకెన్ అండ్ డ్రైవ్‌కు సంబంధించి గడిచిన ఏడు నెలల్లో పోలీసులు 2,891 కేసులు నమోదు చేశారు. వీటిలో ఒక్క జూలైలోనే 943 ఉన్నాయి. గత ఏడాది జూలైలో 370 కేసులు జిల్లాలో నమోదు కాగా, రూ.4,93,700 జరిమానా లభించింది. ఈ ఏడాది అదే మాసంలో 943 కేసులు నమోదు కాగా, కోర్టు రూ.11,80,000 జరిమానాల రూపంలో విధించింది.
తప్పని జైలుశిక్ష
డ్రంకెన్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఇరుక్కుంటున్న పలువురు మందుబాబులకు భారీ జరిమానాలతో పాటు జైలుశిక్షా విధిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వ్యక్తులకు పలు సందర్భాల్లో జరిమానాతో పాటు జైలు కూడా పడింది. ఈ ఏడాది నమోదైన 2,891 కేసుల్లో 150 మంది జరిమానా చెల్లించడంతో పాటు జైలుశిక్షా అనుభవించారు. మరికొంతమందికి కోర్టు స్వచ్చభారత్ రూపంలో జైలుశిక్ష విధించింది. కోర్టు ప్రాంగణాలు, ఆస్పత్రులు, పోలీస్‌స్టేషన్‌లు శుభ్రపరచాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో చాలామంది మద్యం సేవించి రోడ్లపై తిరిగేందుకు సాహసించని పరిస్థితి.
ఎస్పీ సీరియస్
డ్రంకెన్ అండ్ డ్రైవ్ కేసులపై జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి సీరియస్‌గా ఉన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే ఏ ఒక్కరినీ ఉపేక్షించవద్దంటూ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీచేయడంతో పోలీస్ యంత్రాంగం వీటిపైనే ఎక్కువ దృష్టిపెట్టింది. తెల్లవార్లూ ప్రధాన కూడళ్లలో కాపలాకాస్తూ మందుబాబులను రోడ్లపై పరుగులు పెట్టిస్తోంది. అర్బన్, రూరల్ ప్రాంతాల్లో బ్రీత్ ఎనలైజర్‌లు పట్టుకుని మందుబాబుల కోసం జల్లెడ పడుతున్నారు. మద్యం మత్తులో ఉన్నవారిని వలవేసి పట్టుకుంటున్నారు.
ఎవరినీ ఉపేక్షించేది లేదు
మద్యం మత్తులో వాహనాలు నడిపే ఎవరినీ ఉపేక్షించేది లేదు. డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో చట్టం కఠినంగా ఉంటుంది. ఇందులో ఎవరిæ పలుకుబడులకూ తావిచ్చేదిలేదు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తప్పు ఎవరిదైనా బాధిత కుటుంబాలకు దిక్కు లేక జీవితకాలం శిక్ష పడుతోంది. మందు తాగి వాహనాలు నడిపే వారిలో మరింత మార్పురావాలి. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను మరింత విస్తృతం చేయిస్తాం. – సర్వశ్రేష్ట త్రిపాఠి, కృష్ణాజిల్లా ఎస్పీ
2017లో నమోదైన మద్యం కేసులు
మాసం కేసులు జరిమానాలు(రూ.) జైలుశిక్ష పడింది
జనవరి 152 1,61,600 04
ఫిబ్రవరి 280 4,15,200 07
మార్చి 395 3,62,200 16
ఏప్రిల్ 388 4,28,000 14
మే 445 4,51,500 15
జూన్ 288 4,68,500 23
జులై 943 11,80,000 71
మొత్తం 2891 34,67,000 150
మద్యం సేవించిన బస్సు డ్రైవర్ అరెస్ట్
గరికపాడు (జగ్గయ్యపేట) : మద్యం సేవించి ట్రావెల్స్ బస్సు నడుపుతున్న డ్రైవర్‌ను అరెస్ట్‌చేసి బస్సు సీజ్ చేసిన సంఘటన గ్రామంలోని 65వ నంబర్ జాతీయ రహదారి ఆర్టీఏ చెక్‌పోస్ట్ వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగింది. వివరాల ప్రకారం కేఏ01 ఏఏ 6276 నంబర్‌కు చెందిన కాళేశ్వర ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు 49మంది ప్రయాణికులతో బయల్దేరింది. ఆర్టీఏ చెక్‌పోస్ట్ వద్దకు వచ్చేసరికి చెక్‌పోస్ట్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఉదయ్ డ్రంకెన్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో బస్సు డ్రైవర్ మేడపల్లి మారుతి 64 శాతం మద్యం సేవించినట్లు బ్రీత్ ఎనలైజర్‌తో గుర్తించారు. వెంటనే డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. ప్రయాణికులను వేరు బస్సులో పంపించి.. కాళేశ్వరి బస్సును సీజ్ చేశారు. డీటీసీ మీరా ప్రసాద్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.