మావోయిస్టుల కట్టడికి పోలీసుల వ్యూహం
ఏవోబీలో మావోయిస్టుల కట్టడికి పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అభివృద్ధి నినాదంతో మారుమూల గూడేల్లోని వారిని దళసభ్యులకు దూరం చేయాలని యోచిస్తున్నారు. ఆదివాసీల నుంచి వారికి ఎటువంటి సాయం అందకుండా కట్టడి చేస్తున్నారు. సరిహద్దు గ్రామాల్లోని కొన్ని జాతుల గిరిజనులు ఇప్పటికీ మావోయిస్టులకు సానుభూతిపరులుగా పనిచేస్తున్నారు. దళసభ్యుల సభలు, సమావేశాలకు వెళుతున్నారు. మావోయిస్టుల ప్రజాకోర్టుల్లో పాల్గొంటున్నారు. పలు విధ్వంసకర సంఘటనల్లో ప్రధానపాత్ర వహిస్తున్నారు. వారిలో మార్పు తీసుకువచ్చేందుకు పోలీసులు పలు కార్యక్రమాలను చేపడుతున్నారు.
పాడేరు: ఏజెన్సీలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను పోలీసుశాఖ గుర్తించింది. కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల పరిధిలోని మారుమూల గ్రామాల్లో మావోయిస్టుల సంచా రం అధికంగా ఉంటోంది. ఇటీవల జి.మాడుగుల మండలం గాదిగుంట రోడ్డు పనులను మావోయిస్టులు అడ్డుకోవడంతో ఆ ప్రాంతంలో నిరసన వ్యక్తమైంది. దీనిని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. జి.మాడుగుల మండలం గుదలంవీధి ఆశ్రమంపై దాడి, గాదిగుంట రోడ్డులో పొక్లెయినర్ ధ్వంసం సంఘటనల్లో దళసభ్యులు తక్కువ సంఖ్యలో పాల్గొన్నప్పటికీ, సానుభూతిపరులైన కొన్ని గ్రామాల గిరిజనులే అధికంగా ఉన్నారనే సమాచారం కూడా పోలీసుల వద్ద ఉంది.
వీరంతా లొంగిపోతే కేసులు పెట్టకుండా జీవనోపాధికి పోలీసులుఏర్పాట్లు చేస్తున్నారు. గిరిజనుల నుంచి మావోయిస్టులకు ఎలాంటి సహకారం లేకుండా చూడటంతోపాటు విస్తృత కూంబింగ్ చేపడుతున్నారు. మారుమూల గూడేల్లోని గిరిజనులు రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు దూరమయ్యారు. రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరవుతున్నా మావోయిస్టుల హెచ్చరికలతో నిర్మాణాలు సాగడంలేదు. రవాణా పరంగా ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మావోయిస్టుల కారణంగానే రోడ్లు అభివృద్ధి చెందడం లేదనే నినాదంతో పోలీసుశాఖ ఆయా గ్రామాల్లో జనమైత్రి కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నది. జి.మాడుగుల మండలంలోని మారుమూల గాదిగుంట గ్రామంలో బుధవారం పోలీసులు జనమైత్రి నిర్వహించారు. దీనికి సుమారు 500 కుటుంబాల ఆదివాసీలు హాజరయ్యారు. వారికి ఉచితంగా దుస్తులు, స్టీల్, సిల్వర్ సామగ్రి, దోమ తెరలు, యువకులకు వాలీబాల్ కిట్లు, చదువుతున్న యువతకు స్టడీ మెటీరియల్, చిన్నారులకు పుస్తకాలను పంపిణీ చేశారు. వారి సమస్యలను పోలీసులు అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి చెందాలంటే మావోయిస్టులను తిప్పి కొట్టాలని పోలీసుశాఖ చెప్పుకొచ్చింది. గిరిజనులూ రోడ్ల అభివృద్ధిని కోరుకుంటున్నారు.
సెల్ టవర్లు, ఔట్‌పోస్టుల ఏర్పాటు : మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఔట్ పోస్టులు, సెల్ టవర్‌ల ఏర్పాటుకు పోలీసుశాఖ రంగం సిద్ధం చేస్తున్నది. ఇందుకు స్థల పరిశీలన కూడా పూర్తి చేశారు. ముందుగా సెల్ టవర్‌లను ఏర్పాటు చేసి సమాచార వ్యవస్థను గిరిజనులకు అందుబాటులో తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఇందుకు ఆయా పంచాయతీల గిరిజనుల నుంచి వినతులు కూడా పోలీసులు స్వీకరిస్తున్నారు. సమాచార వ్యవస్థ మెరుగుపడితే దళసభ్యుల ఆగడాలను అడ్డుకోవచ్చన్నది పోలీసుల వ్యూహం.