టీడీపీ శ్రేణుల దాడిలో ధ్వంసమైన ఇల్లు, ఫర్మీచర్. పక్కన గాయపడిన భాస్కరరావు
పెదవేగి: అధికార టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం అంకన్నగూడెంలో పది రోజుల క్రితం వైఎస్ఆర్ సీపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇప్పటివరకు వారిని అరెస్ట్ చూపించలేదు.
జూన్ 30న అంకన్నగూడెం సర్పంచ్, టీడీపీ నాయకుడు చిదిరాల సతీష్ ఊరి పొలిమేర వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే అతనిపై హత్యాయత్నం జరిగిందంటూ వైఎస్ఆర్ సీపీ నాయకులు మొరవినేని భాస్కరరావు, గోపాలరావు, సూర్యప్రకాశరావు, చంద్రశే్ఖర్ సహా దాదాపు 10మందిని అదుపులోకి తీసుకున్నారు.
స్టేషన్లు మారుస్తూ వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నట్టు తెలిసింది. టీడీపీ సర్పంచ్ పై దాడి చేసినట్లు ఒప్పుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్టు ఆరోపణలు విన్పిస్తున్నాయి. పోలీసుల వేధింపులతో భాస్కరరావు, గోపాలరావు అనారోగ్యం పాలయ్యారని సమాచారం. భాస్కరరావు నివాసంపై టీడీపీ నేతల దాడి విషయంలో కేసు పెట్టినా పోలీసులు పట్టించుకోలేదు.