pedavegi mandal
-
‘రాట్నాలమ్మవారి’తో సింధుకు ఎంతో అనుబంధం
పెదవేగి (పశ్చిమ గోదావరి): రాట్నాలకుంటలోని రాట్నాలమ్మవారి ఆశీస్సులతోనే ఒలింపిక్ కాంస్య పతకం సాధించానని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలంలోని రాట్నాలకుంటలో వెలసిన రాట్నాలమ్మవారిని శుక్రవారం సింధు కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఒలింపిక్స్‌కు వెళ్లేముందు అమ్మ ఆశీస్సులు తీసుకున్నానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష మేరకు పతకంతో తిరిగి రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సింధుకు ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ చళ్లగొళ్ల వెంకటేశ్వరరావు ఆహ్వానం పలికారు. ఆలయంలో తరతరాల అనుబంధం సింధు కుటుంబానికి కులదైవంగా రాట్నాలమ్మ వారు పూజలందుకుంటున్నారు. సింధు తండ్రి పూసర్ల వెంకటరమణ, ఆయన సోదరులు రామస్వామి, తాండవ కృష్ణమూర్తి కుటుంబసభ్యులతో కలిసి ఏలూరు పడమరవీధిలో ఉండేవారు. ఆ సమయంలో ఎండ్ల బండ్లపై బలివే రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని అమ్మవారి సన్నిధికి వచ్చేవారు. ఈ క్రమంలో సింధుకు కూడా చిన్ననాటి నుంచి అమ్మవారిపై నమ్మకం కలిగింది. ద్వారక తిరుమలలో.. ద్వారకాతిరుమల: రాబోయే రోజుల్లో మరెన్నో మెడల్స్ సాధించి దేశానికి మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తానని పీవీ సింధు అన్నారు. ద్వారకా తిరుమల చినవెంకన్న క్షేత్రాన్ని కుటుంబసమేతంగా ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు స్వామివారి జ్ఞాపిక, ప్రసాదాలను అందజేశారు. -
సంప్రదాయాన్ని వదిలిపెట్టలేదుగా
సాక్షి, పెదవేగి (పశ్చిమ గోదావరి) : వరినాట్ల సమయంలో రహదారుల వెంట ఎక్కడ చూసినా ప్రధానంగా వరినారు పట్టుకుని వాహన చోదకులను ఆపి, సొమ్ములు వసూలు చేయడం కన్పించేది . ఇది గోదావరి జిల్లాల్లో సంప్రదాయంగా వస్తోంది. గతంలో వరినాట్ల సమయంలో బావ వరస అయ్యేవారు చేలోకి వస్తుంటే మరదలి వరుస అయ్యేవారు ఆపి, పసుపు, కుంకుమలకు సొమ్ములు ఇవ్వాలని పట్టుబట్టేవారు. అయితే ఇది కేవలం చేలగట్లకే పరిమితం అయ్యేది. కానీ ఈ విధానం ప్రస్తుతం రోడ్డెక్కింది. వచ్చేది ఎవరన్నది పక్కన పెట్టి వాహనాలను నిలిపేసి, బలవంతంగానైనా సొమ్ములు వసూలు చేస్తున్నారు. కొంతవుంది ఇష్టపూర్వకంగా ఇస్తున్నా, ఇంకొందరు తప్పక ఇస్తున్నారు. ఈ సమయంలో వేగంగా వెళ్తున్న వాహనాలను ఆపుతున్న సందర్భాల్లో ఒక్కోసారి ప్రవూదాలు కూడా జరుగుతున్నాయి. ద్విచక్రవాహనాలతో పాటు ఆటో, కార్లు, ట్రాక్టర్ల వంటివాటిని కూడా ఆపి సొమ్ములు వసూలు చేస్తున్నారు. వచ్చిన సొమ్మును కూలీలంతా సమానంగా తీసుకుంటుంటారు. సంప్రదాయమే అయినా బలవంతంగా వసూలు చేయకుండా ఉంటే బాగుంటుందని వాహనచోదకులు పేర్కొంటున్నారు. -
పినకడిమిలో నిశ్శబ్దం
గ్రామానికి దూరంగా ఇరువర్గాలు ఊరొదిలి వెళ్తున్న ప్రజలు పినకడిమి (పెదవేగి రూరల్) : పినకడిమి.. ఒకప్పడు పచ్చని పైర్లు, పాడి పంటలతో కళకళలాడింది. ఏలూరు పరిసరాల్లో జ్యోతిష్యం చెప్పే బుడగ జంగాల రాకతో ఆ గ్రామం సిరిసంపదల్ని మరింత పెంపొందించుకుంది. క్రమంగా ఆ కుటుంబాలు దేశం నలుమూలలతోపాటు విదేశాలకూ వెళ్లి జాతకాలు చెబుతూ డాలర్లు సంపాదించే స్థాయికి ఎదిగాయి. పేద, ధనిక తారతమ్యాలు పెద్దగా కనిపించేవి కాదు. అక్కడ గ్రామ పెద్దలు చెప్పిందే వేదం.. చేసిందే చట్టం అన్నట్టుగా ఉండేది. కనుచూపు మేరలో పోలీసుల్ని కనిపించనిచ్చేవారు కాదు. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. నిత్యం పోలీసుల పహారా, తనిఖీల నడుమ గ్రామస్తులు బతుకీడ్చాల్సిన దుస్థితి దాపురించింది. రక్త చరిత్రకు పునాది ఇలా 2014 ఏప్రిల్ 5వ తేదీ వరకు గ్రామం ఎంతో ప్రశాంతంగా ఉండేది. స్వల్ప తగాదాలు ఉన్నా ఇబ్బందులు తలెత్తేవి కాదు. ఆ మరుసటి రోజు (ఏప్రిల్ 6)న ఏలూరు జేకే ప్యాలెస్ యజమాని భూతం దుర్గారావు హత్యకు గురయ్యాడు. అప్పుడు మొదలైన రక్తచరిత్ర నేటికీ కొనసాగుతూనే ఉంది. గ్రామానికి చెందిన తూరపాటి నాగరాజు కుమారుడికి, భూతం దుర్గారావు సోదరుడు గోవింద్ కుమార్తెకు ప్రేమ వివాహం జరగ్గా.. అనంతర పరిణామాల్లో ఇరు కుటుంబాల మధ్య వివాదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే దుర్గారావు హత్యకు గురికాగా.. అందుకు ప్రతీకారంగా ఆ కేసులో నిందితులైన గంధం మారయ్య, పగిడి మారయ్య, గంధం నాగేశ్వరరావులను 2014 సెప్టెంబర్‌లో కిరాయి హంతకులు కృష్ణాజిల్లా పెదఅవుటపల్లి వద్ద తుపాకులతో కాల్చి చంపారు. భూతం దుర్గారావు హత్య కేసులో ప్రధాన నిందితుడైన తూరపాటి నాగరాజుపై గత ఏడాది 2015 ఏప్రిల్‌లో హైదరాబాద్ సరూర్‌నగర్‌లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నాగరాజు కొనఊపిరితో బయటపడ్డాడు. తాజాగా నాగరాజుపై ఏలూరులో మరోసారి హత్యాయత్నం జరగడం కలకలం సృష్టించింది. గ్రామాన్ని వీడుతున్న ప్రజలు పినకడిమికిలో రెండువర్గాల మధ్య ప్రతీకార హత్యలు జరుగుతుండటం.. గ్రామాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకోవడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న భయాందోళనలు అక్కడి ప్రజలను వెంటాడుతున్నాయి. దీంతో చాలామంది గ్రామాన్ని వదిలి వెళ్తున్నారు. కొందరైతే ఆస్తులను సైతం వదులుకుని పొరుగూళ్లకు వెళ్లి పరాయి పంచన తలదాచుకుంటున్నారు. తనిఖీల అనంతరమే గ్రామంలోకి.. ఏలూరులో తూరపాటి నాగరాజుపై కాల్పులు జరిగిన దరిమిలా జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ ఆదేశాల మేరకు ఏలూరు రూరల్ సీఐ అడపా నాగమురళి, పెదవేగి ఎస్సై వీరంకి రామకోటేశ్వరరావు పినకడిమిలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. గ్రామంలోకి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేసిన అనంతరమే అనుమతిస్తున్నారు. ఇదిలావుండగా, భూతం దుర్గారావు సోదరుడు గోవిందు కుటుంబీకులు ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోగా, ప్రత్యర్థి వర్గానికి చెందిన తూరపాటి నాగరాజు కుటుంబ సభ్యులు ఏలూరులో తలదాచుకుంటున్నారు. రెండు వర్గాల వారు గ్రామానికి దూరంగా ఉంటున్నా ప్రతీకార దాడులు మాత్రం యథేచ్ఛగా సాగుతున్నాయి. -
'వైఎస్ఆర్ సీపీ నేతలకు చిత్రహింసలు'
పెదవేగి: అధికార టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం అంకన్నగూడెంలో పది రోజుల క్రితం వైఎస్ఆర్ సీపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇప్పటివరకు వారిని అరెస్ట్ చూపించలేదు. జూన్ 30న అంకన్నగూడెం సర్పంచ్, టీడీపీ నాయకుడు చిదిరాల సతీష్ ఊరి పొలిమేర వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే అతనిపై హత్యాయత్నం జరిగిందంటూ వైఎస్ఆర్ సీపీ నాయకులు మొరవినేని భాస్కరరావు, గోపాలరావు, సూర్యప్రకాశరావు, చంద్రశే్ఖర్ సహా దాదాపు 10మందిని అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్లు మారుస్తూ వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నట్టు తెలిసింది. టీడీపీ సర్పంచ్ పై దాడి చేసినట్లు ఒప్పుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్టు ఆరోపణలు విన్పిస్తున్నాయి. పోలీసుల వేధింపులతో భాస్కరరావు, గోపాలరావు అనారోగ్యం పాలయ్యారని సమాచారం. భాస్కరరావు నివాసంపై టీడీపీ నేతల దాడి విషయంలో కేసు పెట్టినా పోలీసులు పట్టించుకోలేదు.