గ్రామానికి దూరంగా ఇరువర్గాలు
ఊరొదిలి వెళ్తున్న ప్రజలు
పినకడిమి (పెదవేగి రూరల్) : పినకడిమి.. ఒకప్పడు పచ్చని పైర్లు, పాడి పంటలతో కళకళలాడింది. ఏలూరు పరిసరాల్లో జ్యోతిష్యం చెప్పే బుడగ జంగాల రాకతో ఆ గ్రామం సిరిసంపదల్ని మరింత పెంపొందించుకుంది. క్రమంగా ఆ కుటుంబాలు దేశం నలుమూలలతోపాటు విదేశాలకూ వెళ్లి జాతకాలు చెబుతూ డాలర్లు సంపాదించే స్థాయికి ఎదిగాయి. పేద, ధనిక తారతమ్యాలు పెద్దగా కనిపించేవి కాదు. అక్కడ గ్రామ పెద్దలు చెప్పిందే వేదం.. చేసిందే చట్టం అన్నట్టుగా ఉండేది. కనుచూపు మేరలో పోలీసుల్ని కనిపించనిచ్చేవారు కాదు. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. నిత్యం పోలీసుల పహారా, తనిఖీల నడుమ గ్రామస్తులు బతుకీడ్చాల్సిన దుస్థితి దాపురించింది.
రక్త చరిత్రకు పునాది ఇలా
2014 ఏప్రిల్ 5వ తేదీ వరకు గ్రామం ఎంతో ప్రశాంతంగా ఉండేది. స్వల్ప తగాదాలు ఉన్నా ఇబ్బందులు తలెత్తేవి కాదు. ఆ మరుసటి రోజు (ఏప్రిల్ 6)న ఏలూరు జేకే ప్యాలెస్ యజమాని భూతం దుర్గారావు హత్యకు గురయ్యాడు. అప్పుడు మొదలైన రక్తచరిత్ర నేటికీ కొనసాగుతూనే ఉంది. గ్రామానికి చెందిన తూరపాటి నాగరాజు కుమారుడికి, భూతం దుర్గారావు సోదరుడు గోవింద్ కుమార్తెకు ప్రేమ వివాహం జరగ్గా.. అనంతర పరిణామాల్లో ఇరు కుటుంబాల మధ్య వివాదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే దుర్గారావు హత్యకు గురికాగా.. అందుకు ప్రతీకారంగా ఆ కేసులో నిందితులైన గంధం మారయ్య, పగిడి మారయ్య, గంధం నాగేశ్వరరావులను 2014 సెప్టెంబర్‌లో కిరాయి హంతకులు కృష్ణాజిల్లా పెదఅవుటపల్లి వద్ద తుపాకులతో కాల్చి చంపారు. భూతం దుర్గారావు హత్య కేసులో ప్రధాన నిందితుడైన తూరపాటి నాగరాజుపై గత ఏడాది 2015 ఏప్రిల్‌లో హైదరాబాద్ సరూర్‌నగర్‌లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నాగరాజు కొనఊపిరితో బయటపడ్డాడు. తాజాగా నాగరాజుపై ఏలూరులో మరోసారి హత్యాయత్నం జరగడం కలకలం సృష్టించింది.
గ్రామాన్ని వీడుతున్న ప్రజలు
పినకడిమికిలో రెండువర్గాల మధ్య ప్రతీకార హత్యలు జరుగుతుండటం.. గ్రామాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకోవడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న భయాందోళనలు అక్కడి ప్రజలను వెంటాడుతున్నాయి. దీంతో చాలామంది గ్రామాన్ని వదిలి వెళ్తున్నారు. కొందరైతే ఆస్తులను సైతం వదులుకుని పొరుగూళ్లకు వెళ్లి పరాయి పంచన తలదాచుకుంటున్నారు.
తనిఖీల అనంతరమే గ్రామంలోకి..
ఏలూరులో తూరపాటి నాగరాజుపై కాల్పులు జరిగిన దరిమిలా జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ ఆదేశాల మేరకు ఏలూరు రూరల్ సీఐ అడపా నాగమురళి, పెదవేగి ఎస్సై వీరంకి రామకోటేశ్వరరావు పినకడిమిలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. గ్రామంలోకి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేసిన అనంతరమే అనుమతిస్తున్నారు. ఇదిలావుండగా, భూతం దుర్గారావు సోదరుడు గోవిందు కుటుంబీకులు ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోగా, ప్రత్యర్థి వర్గానికి చెందిన తూరపాటి నాగరాజు కుటుంబ సభ్యులు ఏలూరులో తలదాచుకుంటున్నారు. రెండు వర్గాల వారు గ్రామానికి దూరంగా ఉంటున్నా ప్రతీకార దాడులు మాత్రం యథేచ్ఛగా సాగుతున్నాయి.
పినకడిమిలో నిశ్శబ్దం
Published Fri, Jul 1 2016 8:53 AM | Last Updated on Mon, Sep 4 2017 3:54 AM
Advertisement
Advertisement