విద్యార్థిని హింసించిన పోలీసులు
Published Thu, Aug 29 2013 4:04 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
ఏలూరు క్రైం, న్యూస్‌లైన్ : సంబంధం లేని కేసు విషయంలో పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్ళి ఏఎస్సై, హోంగార్డు శారీరకంగా హింసించి కులం పేరుతో దూషించారని విద్యార్థి సింగవరపు అభినయ్ ఆరోపించాడు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న అతను తెలిపిన వివరాలు ఇవి.. భీమడోలుకు చెందిన అభినయ్ గ్రామంలోని గీంతాంజలి కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అతని స్నేహితుడు చిన్న, ఓ యువతి ప్రేమించుకున్నారు. వారిద్దరూ రెండు రోజుల క్రితం ఊరొదిలి వెళ్ళిపోయారు. దీంతో అభినయ్‌ను విచారించడానికి భీమడోలు స్టేషన్ హోంగార్డు శివ మంగళవారం మధ్యాహ్నం అతడి ఇంటికి వచ్చి పోలీస్ స్టేషన్‌కుతీసుకెళ్ళాడు.
స్టేషన్‌కు వెళ్ళిన వెంటనే అభియన్‌ను ఏఎస్సై, హోంగార్డు శివ కలసి బూటు కాళ్ళతో తన్నుతూ, లాఠీలతో చితకబాదారు. తనకేమీ తెలియదని వారి కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడినా హింస ఆపలేదు. విచారణ చేయటానికని అభినయ్‌తోపాటు తీసుకుని వచ్చిన మరో వ్యక్తిని వెళ్లి సాయంత్రం రావాలని విడిచిపెట్టారు. వారు స్టేషన్ బయటకు రాగా హోంగార్డు శివ ఆ ఇద్దరి వద్దకు వచ్చి ఆ యువతియువకుడు ఎక్కడికి వెళ్లారో చెప్పే వరకు ప్రతి రోజూ ఇలాగే చిత్రహింసలు పెడతామని హెచ్చరించాడు.
తనను కులంపేరుతో దూషించాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే తాను నిద్రపోయానని బుధవారం ఉదయం దెబ్బలకు లేవలేకపోవడంతో కుటుంబ సభ్యులు తనను ఏలూరు ప్రభుత్వాసుపత్రితో చేర్చారని అభినయ్ చెప్పాడు. వైద్యులు ఎంఎల్‌సీగా నమోదు చేశారు. తనను శారీరకంగా హింసించి కులంపేరుతో దూషించిన ఏఎస్సై, హోంగార్డుపై చర్యలు తీసుకోవాలని అభినయ్ పోలీసు అధికారులను వేడుకున్నాడు.
Advertisement