
సాక్షి,తాడేపల్లి : తమ జీపు స్టార్ట్ కాక, వంతుల వారీగా తోసుకుంటూ పోలీసులు నానా తిప్పలు పడిన ఘటన సోమవారం తాడేపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళితే వెలగపూడి సచివాలయం నుంచి ఉండవల్లి సెంటర్ వైపు జీపులో నలుగురు పోలీసులు బయల్దేరారు. యూటీకే లిఫ్ట్ ఇరిగేషన్ కాల్వవద్దకు వచ్చేటప్పటికి జీపు ఒక్కసారిగా ఆగిపోయింది. ఎంతసేపు స్టార్ట్ చేసినా కదలకపోవడంతో ఇక లాభం లేదని తోసుకుంటూ ముందుకెళ్లారు.
ఇలాగైతే లాభం లేదనుకున్నారే ఏమో.. ఇద్దరు తోస్తూ, ఇద్దరు లోన కూర్చునే విధంగా బండిని తీసుకెళ్లారు. డ్రైవర్ స్థానంలో కూర్చున్న అతనికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఇలా వంతుల వారీగా అరకిలోమీటరు తీసుకెళ్లారు. చివరకు మళ్లీ ప్రయత్నించి ఈ సారి సఫలమయ్యారు. అప్పటివరకు మొరాయించిన జీపు ఒక్కసారిగా ఘీంకరిస్తూ స్టార్ట్ అయింది. దీంతో బతుకు జీవుడా అంటూ నలుగురు జీపులో ఎక్కి ఉండవల్లి సెంటర్ వైపుగా వెళ్లారు. ఈ దృశ్యాన్ని చూసిన ప్రజలు దొంగలను పట్టుకునేటప్పుడు ఇలాంటి జీపులు వేసుకుని వెళితే వారు నడుచుకుంటూ తప్పించుకోవచ్చు గదా అని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment