ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్: పోలియో రహిత సమాజం కోసం ప్రభుత్వం చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం జిల్లాలో ప్రారంభం కానుంది. ఇందుకోసం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. పల్స్ పోలియో చుక్కల డబ్బాలను ఆయా పీహెచ్‌సీలకు పంపిణీ చేశారు. మొదటి ఈనెల 19న బూత్‌లలో పోలియో చుక్కలు వేస్తారు.
20,21 తేదీల్లో సిబ్బంది ఇంటింటికి తిరుగుతారు. ఇంకా బస్టాండ్, రైల్వేస్టేషన్, ఆటోస్టాండ్, పారిశ్రామిక ప్రాంతాల్లో, ఇటుక బట్టీల వద్ద వలస కూలీల పిల్లలకు, జనావాసాలు ఉన్నచోట పోలియో చుక్కలు వేయనున్నారు. ఒక్కో బూత్‌లో నలుగురు సేవలందించనున్నారు. కాగా జిల్లాలో మూడేళ్ల నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 19న పట్టణంలోని హమాలివాడలోని అర్బన్ హెల్త్‌సెంటర్‌లో కలెక్టర్ బాబు కార్యక్రమం ప్రారంభించనున్నారు.