పాలిటెక్నిక్ విద్యార్థి ఫణికుమార్ కు జాతీయ బహుమతి | Politechnic student phani kumar bags national science award | Sakshi
Sakshi News home page

పాలిటెక్నిక్ విద్యార్థి ఫణికుమార్ కు జాతీయ బహుమతి

Published Sat, Oct 26 2013 3:13 AM | Last Updated on Mon, Sep 17 2018 7:38 PM

Politechnic student phani kumar bags national science award

ప్రస్తుతం భారత్‌తోపాటు ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్య విద్యుత్తు. ఈ సమస్య పరిష్కారానికి అనేక దేశాల్లో కొత్తకొత్త ప్రయోగాలు జరుగుతున్నాయి. అంతరిక్షం నుంచి సోలార్ వ్యవస్థ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నది వాటిలో ఒకటి. ఈ విధానంపై గుడ్లవల్లేరులోని ఏఏఎన్‌ఎం అండ్ వీవీఆర్‌ఎస్ ఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈసీఈ చివరి సంవత్సరం  చదువుతున్న విద్యార్థి పి.రామఫణికుమార్ సమర్పించిన పేపర్ ప్రజెంటేషన్‌కు జాతీయ స్థాయిలో తృతీయ బహుమతి లభించింది. సూర్య కిరణాల ద్వారా విద్యుత్తు ఉత్పత్తి  చేస్తున్న చిన్నా, చితకా ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ సోలార్ భారీ ప్రాజెక్టు ద్వారా విద్యుత్తు ఎలా ఉత్పత్తి చేయవచ్చు అనే దిశగా  ఈ విద్యార్థి అడుగులు పడ్డాయి... కళాశాల పరిధి దాటి... రాష్ట్రం... దేశం... ఖండాంతరాలు గాలించి... ఎక్కడెక్కడ ఈ తరహా పరిశోధనలు జరుగుతున్నాయి... ఫలితాలు ఎలా ఉన్నాయనే అంశంపై దృష్టి సారించాడు ఈ విద్యార్థి.
 
గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : ప్రస్తుతం థర్మల్, జల, అణువిద్యుత్ ఉత్పత్తవుతోంది. అయితే అది ప్రజావసరాలకు చాలడంలేదు. జల విద్యుత్తు నీరు ఉన్నంత వరకూ ఉత్పత్తవుతుంది. అణువిద్యుత్తు ఉత్పత్తికేంద్రాల వల్ల పెను ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. నేలబొగ్గు వనరులు అంతరిస్తే థర్మల్ ఉత్పత్తి ఆగిపోతుంది. ఈ నేపథ్యంలో అంతరిక్షం నుంచి సోలార్ వ్యవస్థ ద్వారా విద్యుత్తు ఉత్పత్తిపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ విధానాన్ని ‘వైర్‌లెస్ పవర్ ట్రాన్స్‌మిషన్ త్రూ సోలార్ పవర్ సాటిలైట్’ అని పిలుస్తున్నారు.

అంతరిక్ష విద్యుత్ ఉత్పత్తి ఎలాగంటే...

అంతరిక్షంలో సూర్యరశ్మిని గ్రహించేందుకు నిర్ధేశించకున్న ప్రాంతంలో కాన్‌సెంటరేటింగ్ దర్పణాలను అమర్చాలి. ఆ దర్పణాలపై పడే సూర్య కిరణాలను ఫొటో ఓల్టాఇక్ సెల్స్ స్వీకరిస్తాయి. ఈ సెల్స్ సూర్యరశ్మిని విద్యుత్తుగా మారుస్తుంది. ఆ విద్యుత్తును సూక్ష్మ తరంగాలుగా భూమి మీదకు పంపుతుంది. ఈ తరంగాలు భూమిపై ఏర్పాటు చేసిన రెక్టనా (యాం టినా వంటిపరికరం)కు చేరుతాయి. అక్కడ్నించి విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసుకుని ఎలా కావాలంటే అలా సరఫరా చేసుకోవచ్చు.

ఈ విధానం ద్వారా ప్రపంచంలో ఎక్కడికైనా విద్యుత్ శక్తిని సమకూర్చవచ్చు. భూమిపైనా కాన్‌సెంటరేటింగ్ దర్పణాలను ఏర్పాటు చేసి సూర్యరశ్మిని విద్యుత్‌గా మార్చుకోవచ్చు. అయితే భూమిపై ఈ విధానం 19 నుంచి 20 శాతం వరకే పని చేస్తుంది. అంతరిక్షంలో ఏర్పాటు చేస్తే నూటికి 99 శాతం ఉపయుక్తమవుతుంది. అంతరిక్షంలో వర్షం, మంచు వంటి పరిస్థితులు ఎదురుకావు. పగలు, రాత్రి భేదం ఉండదు. 24 గంటలు సూర్యరశ్మి అందుబాటులో ఉంటుంది. ఫలితంగా 24 గంటలూ విద్యుత్ ఉత్పత్తి జరుగుతూనే ఉంటుంది.

విదేశాల్లోనూ ప్రయోగాలు....
అంతరిక్షంలో సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అమెరికా, బ్రిటిన్, జపాన్ దేశస్తులు ప్రయోగాలు చేస్తున్నారు. నాసా ద్వారా అమెరికాలోని హవాయి ఐలాండ్ అనే ద్వీపంలో ఈ పద్ధతిలో విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు మూడేళ్లుగా ప్రయోగాలు జరుగుతున్నాయి. సోలార్ పవర్ శాటిలైట్ ద్వారా సమకూర్చుకునేందుకు జపాన్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం సోలార్ ద్వారా నడిచే విమానం ‘హెలియో’ ఖండాలన్నింటినీ చుట్టివెళ్తోంది. ఈ విమానం 24 గంటలపాటు ఆకాశంలోనే విహరిస్తోంది.

జాతీయ స్థాయి తృతీయ బహుమతి...
కలకత్తాకు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) సంస్థ 1993 నుంచి ఏటా సాంకేతిక విద్యార్థులకు జాతీయస్థాయి సదస్సు నిర్వహిస్తోంది. ఈ నెల 19, 20వ తేదీల్లో కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో 21వ సదస్సులో ‘సాంకేతిక ఆవిష్కరణలు’ అంశంపై మూడు రంగాలకు సంబంధించి పేపర్ ప్రజెంటేషన్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో 70 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పి.రామఫణికుమార్ ‘వైర్‌లెస్ పవర్ ట్రాన్స్‌మిషన్ త్రూ సోలార్ పవర్ సాటిలైట్’పై సమర్పించిన పేపర్ ప్రజెంటేషన్‌కు తృతీయ బహుమతి దక్కింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్(ఇండియా) కౌన్సిల్ మెంబరు టి.శ్రీప్రకాష్ చేతుల మీదుగా ఫణికుమార్ బహుమతి, ప్రశంసాపత్రం అందుకున్నారు. తమ కళాశాల యాజమాన్యంతోపాటు ప్రిన్సిపాల్ ఎన్.ఎస్.ఎస్.వి.రామాంజనేయులు, ఐ.ఇ(ఇ) చాప్టర్ అడ్వైజర్ ఎం.వినయ్, శాఖాధిపతులు సిహెచ్.శ్రీహరి, కృష్ణప్రసాద్ ప్రోత్సాహంతోనే తనకు ఈ బహుమతి దక్కిందని ఫణికుమార్ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement