రాజ్యసభ ఎన్నికల వ్యవహారం మహా వాడి వేడిగా సాగుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరెవరికి ఎవరు ఓట్లేయాలన్న విషయమై స్వయంగా రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఇందుకు తగిన వ్యూహాలు రూపొందించారు. తమ ఎమ్మెల్యేల ఓట్లను 46, 46, 47 గా ముగ్గురికి మాత్రమే కేటాయించినట్లు బొత్స సత్యనారాయణ తెలిపారు. అయితే, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ మాత్రం ఎప్పటిలాగే తిరుగుబాటు స్వరం వినిపించారు. తమ ఓట్లన్నీ కేవలం తెలంగాణ అభ్యర్థులకే వేస్తామని, సీమాంధ్ర అభ్యర్థులకు ఎట్టి పరిస్థితుల్లో వేసేది లేదని చెప్పారు. అయితే రంగంలో ఇద్దరు సీమాంధ్ర అభ్యర్థులు కేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బిరామిరెడ్డి ఉన్నారు. ఎం.ఎ. ఖాన్ ఒక్కరు మాత్రమే తెలంగాణ ప్రాంతానికి చెందినవారు. దాంతో తెలంగాణ ఎమ్మెల్యేలు తమ ఓట్లను ఆయనకు వేయగా మిగిలినవారు ఎటు మొగ్గుతారన్నది అనుమానంగానే కనపడుతోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉదయం గోల్కొండ హోటల్లో నిర్వహించిన సమావేశానికి టీఆర్ఎస్ నాయకులు కేకే, హరీష్ రావు, ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎమ్మెల్యేలమంతా తమ ఐక్యతను నిరూపించుకుంటామని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో.. తెలంగాణ వాదిగా తాను పోటీలో ఉన్నందున తనకు ఓట్లేయాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కోరానని కేకే తెలిపారు. దీంతో ఎవరి ఓట్లు ఎటు పడతాయోనన్న విషయం ఆసక్తికరంగా మారింది.
మరోవైపు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈసారి చరిత్ర సృష్టించారు. రాజ్యసభ ఎన్నికల్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన తిరస్కరణ ఓటును ఆయన వినియోగించుకున్నారు. అభ్యర్థులెవరూ తనకు నచ్చలేదని, ముందుగానే ముఖ్యమంత్రికి, పీసీసీ చీఫ్ బొత్సకు చెప్పి తాను తిరస్కరణ ఓటు వేశానని ఆయన అన్నారు. విభజనకు అనుకూలంగా వ్యవహరించిన వారిని తాను రాజ్యసభకు ఎన్నుకోవడం మనసుకు నచ్చలేదని, అందుకే ఎవరికీ ఓటు వేయదలచుకోలేదని దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలిపారు.
గరంగరంగా రాజ్యసభ ఎన్నికలు
Published Fri, Feb 7 2014 11:06 AM | Last Updated on Mon, Sep 17 2018 4:58 PM
Advertisement
Advertisement