సాక్షి ప్రతినిధి, విజయనగరం : అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల విషయంలో రాజకీయ జోక్యం ఎక్కువైపోయింది. తమకు అనుకూల ఏజెన్సీలు ఖరారు కాలేదన్న అక్కసుతో టీడీపీ ఎమ్మెల్యే ఒకరు ఈ ప్రక్రియకు ప్రతిబంధకంగా నిలిచారు. కొత్తగా ఖరారైన ఏజెన్సీలకు చేసిన ఉద్యోగాల కేటాయింపుల్ని, ఆ ఏజెన్సీలకు, ప్రభుత్వ శాఖలకు మధ్య జరగాల్సిన అగ్రిమెంట్‌ను అడ్డుకున్నారని తెలిసింది. దీంతో ఏజెన్సీల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 40 ప్రభుత్వ శాఖల్లో రెగ్యులర్ ఉద్యోగులు లేరు. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఆయా శాఖలు తాత్కాలిక ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా నిరుద్యోగులను సమకూర్చుకుంటున్నాయి. ఈ మేరకు ఆయా ఉద్యోగులకిచ్చే జీతాల్లో కొంత మొత్తాన్ని కమిషన్‌గా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు తీసుకుంటున్నాయి. తాత్కాలిక ఉద్యోగులను సమకూర్చే బాధ్యత చేపట్టే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను టెండర్ల ద్వారా ఖరారు చేస్తున్నారు. కలెక్టర్ చైర్మన్‌గా, ఎంప్లాయిమెంట్ అధికారి కన్వీనర్‌గా, ట్రెజరీ డీడీ, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ సభ్యులుగా ఉన్న కమిటీ ఈ టెండర్లను ఖరారు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను కొత్తగా ఖరారు చేసేందుకు జిల్లా కమిటీ టెండర్లను ఆహ్వానించింది.
ఈ మేరకు 28 షెడ్యూళ్లు దాఖలయ్యాయి. ఇందులో అత్యధికం టీడీపీ నేతలకు చెందిన వారివే. జెడ్పీ గెస్ట్‌హౌస్ వేదికగా సిండికేట్‌గా తయారై షెడ్యూల్ దాఖలు చేశారు. దాఖలు చేసినవన్నీ ఖరారు అయ్యేలా తెరవెనుక పావులు కదిపారు. ఇదే విషయమై సెప్టెంబర్ 20వ తేదీన ‘అవుట్ సోర్సింగ్‌లో సిండికేట్లు’ అనే శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురితమైంది. ఈ కథనం అప్పట్లో చర్చనీయాంశమైంది. విషయం అందరికీ తెలిసిపోయింది. అర్హతలుంచి రాజకీయేతరంగా షెడ్యూల్ దాఖలు చేసిన వారు అప్రమత్తమయ్యారు. అడ్డగోలుగా ఖరారైతే కోర్టుకైనా వెళ్తామంటూ వారంతా బయటికి సంకేతాలు పంపించారు. రచ్చరచ్చ చేస్తామంటూ బాహాటంగా వ్యాఖ్యానాలు చేశారు. దీంతో అధికారులు అప్రమత్తమై అధికార పార్టీ నేతలు సూచించిన వాటిలో అర్హత గల వాటిని ఎంపిక చేయడంతో పాటు రాజకీయేతరంగా దాఖలై అర్హత ఉన్న వాటిని ఎంపిక చేశారు. కొత్తగా ఖరారు చేసిన 16 ఏజెన్సీలను అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా సమాన ప్రాతిపదికన శాఖల వారీగా ఉద్యోగాలు కేటాయించారు. అక్టోబర్ 10వ తేదీలోగా ప్రభుత్వ శాఖలతో అగ్రిమెంట్ చేసుకోవాలని కొత్త ఏజెన్సీలకు సూచించారు.
దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యే, మరో టీడీపీ నేత కినుక వహించారు. తాము సిఫారసు చేసిన ఏజెన్సీలన్నింటినీ ఎంపిక చేయలేదని ఆగ్రహానికి లోనయ్యారు. తమకు అనుకూల ఏజెన్సీలన్నీ ఎంపిక చేయకపోగా, ఎంపిక చేసిన తమ ఏజెన్సీలకు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కేటాయింపులు చేయలేదని, అందరిలాగే సమానంగా కేటాయించారని, సిఫారసులకు ప్రాధాన్యం ఇవ్వలేదని బాధపడిపోయారు. ఒకవైపు అధికారులపై ఒత్తిళ్లు చేస్తూనే మరోవైపు కొత్తగా ఎంపికైన రాజకీయేతర ఏజెన్సీలకున్న లోపాలేంటో తెలుసుకునేందుకు అన్వేషణ ప్రారంభించారు. ఈ క్రమంలో ఎంపిక చేసిన ఏజెన్సీల్లో కొన్ని నాన్ లోకల్‌కు చెందినవని, టెండర్లలో స్థానిక చిరునామా పేర్కొన్నారంటూ ఆరోపణలు చేయడమే కాకుండా అధికారులకు ఫిర్యాదులు చేసినట్టు తెలిసింది. దీంతో ఎందుకొచ్చిన గొడవని అధికారులు తక్షణమే స్పందించి కొత్త ఏజెన్సీలకు చేసిన ఉద్యోగాల కేటాయింపులు తాత్కాలికంగా నిలిపివేయడమే కాకుండా, కేటాయించిన ప్రభుత్వ శాఖలతో అగ్రిమెంట్లు జరగకుండా ఆపేసినట్టు తెలిసింది. దీంతో కొత్త ఏజెన్సీలు ఖరారు చేసి నెలన్నర దాటినా ఉద్యోగాలు కేటాయింపు గాని, ప్రభుత్వ శాఖలతో ఒప్పందం గాని జరగలేదు. ప్రస్తుతం ఆ ఏజెన్సీలన్నీ గాలిలో ఉన్నాయి.
లబోదిబోమంటున్న నిర్వాహకులు
గతంలో రూ.50వేలు డిపాజిట్ చేస్తే సరిపోయేది. కానీ ఈసారి రూ.3లక్షలకు డిపాజిట్ పెంచారు. మూడు నెలల(అక్టోబర్, నవంబర్, డిసెంబర్)కే కాంట్రాక్ట్ అని షరతు పెట్టారు. అయినప్పటికీ నాలుగు కాసులు సంపాధించుకోవచ్చన్న ఆశతో పలు ఏజెన్సీలు షెడ్యూల్ దాఖలు చేశాయి. అర్హతలతో ఎంపికయ్యాయి. కానీ, టీడీపీ ఎమ్మెల్యే జోక్యంతో ప్రక్రియ నిలిచిపోవడంతో ఈ ఏజెన్సీలన్నీ నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే అక్టోబర్ నెల ముగిసిపోయింది. నవంబర్ కొనసాగుతోంది. ఇంకా కేటాయింపులు, అగ్రిమెంట్లే జరగలేదు. ఇదంతా ముగిసే సరికి ఎప్పటికి అవుతుందో తెలియదు. ఈ జాప్యం ఇలాగే కొనసాగితే డిసెంబర్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే ప్రభుత్వం పెట్టిన కాల పరిమితం జాప్యంతోనే గడిచిపోయేలా ఉంది. అదే జరిగితే డిపాజిట్‌గా చేసిన రూ.3లక్షలకు వడ్డీయే రాని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో కొత్తగా ఎంపికైన అర్హత గల ఏజెన్సీల నిర్వాహకులు లబోదిబోమంటున్నారు.
పోటీకి వచ్చినందుకు నిర్వాహకులు అవుట్!
Published Wed, Nov 5 2014 3:36 AM | Last Updated on Mon, Sep 17 2018 5:32 PM
Advertisement
Advertisement