కర్నూలు, న్యూస్‌లైన్: పోలీసు శాఖను అధికార కాంగ్రెస్ పార్టీ శాసిస్తోంది. పార్టీలోని ప్రజాప్రతినిధులు రెండు, మూడు గ్రూపులుగా విడిపోయినా ఈ శాఖను టార్గెట్ చేయడం జిల్లాలో సర్వసాధారణమైంది. జిల్లాలో ఎస్పీగా పని చేయడం అధికారులకు కత్తి మీద సాముగా మారుతోంది. కనిపించని నాలుగో సింహంలా ఉంటానంటే ఇక్కడ కుదరదని మరోసారి నిరూపితమైంది. ఇందుకు తాజా ఉదాహరణ జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి బదిలీ. నాలుగు మాసాల క్రితం(జులై 2వ తేదీ) ఎస్పీగా వచ్చిన ఆయన నేతల ఒత్తిళ్ల మధ్యే తనేంటో నిరూపించుకునే ప్రయత్నం చేశారు. అధికార పార్టీ పెత్తనం మితిమీరినా పలు విషయాల్లో కఠినంగా వ్యవహరించారు. ముఖ్యంగా జిల్లాకు చెందిన ఓ మంత్రి మాటలను ఖాతరు చేయక అక్రమార్కులతో పాటు సొంత శాఖ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు.
తన తెగువతో ప్రజల నమ్మకాన్ని చూరగొనడం నేతలకు మింగుడుపడలేదు. ఇదే సమయంలో పోలీసు శాఖ అధికారులు కొందరు తమపై వేటు పడకుండా ఆయననే బలిపెట్టే ప్రయత్నం చేశారు. ఇంకేముందు.. కొరకరాని కొయ్యలా మారిన ఎస్పీ బదిలీకి ఈయనంటే గిట్టని మంత్రి వద్ద పంచాయితీ పెట్టారు. ఆయన ముఖ్యమంత్రి వద్ద తన పలుకుబడిని ఉపయోగించి ఎట్టకేలకు సఫలీకృతులయ్యారు. చిన్న ఘటనలను సైతం భూతద్దంలో చూపి.. ముఖ్యంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ ఎస్పీపై బదిలీ వేటు వేయించారు. పంచాయతీ ఎన్నికల్లో చెప్పిన మాట వినని ఆయనను కొనసాగిస్తే సాధారణ ఎన్నికల్లో గెలుపు అసాధ్యమని సీఎంకు ఆయన నూరిపోసినట్లు చర్చ జరుగుతోంది.
సమర్థుడైన అధికారిగా రఘురామిరెడ్డికి గుర్తింపు...
రఘురామిరెడ్డి ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఫ్యాక్షన్ ఖిల్లాగా ప్రసిద్ధిగాంచిన జిల్లాలో చిన్న ఘటన కూడా చోటు చేసుకోకుండా మూడు విడతల పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించగలిగారు. శాంతిభద్రతల విషయంలో జిల్లా కేంద్రానికి వచ్చి తమ సమస్యలు చెప్పుకోవడానికి ఇబ్బందులు పడే ప్రజానీకం కోసం ప్రత్యేకంగా మీతో మీ ఎస్పీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి శుక్రవారం 10.30 నుంచి 12 గంటల వరకు స్వయంగా ఆయనే ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. చదువుకున్న వారు ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో కక్షలు, కార్పణ్యాల్లో ఇరుక్కుపోయి ఆర్థికంగా చితికిపోతున్నారని తెలుసుకుని ఉద్యోగాలు కల్పించేందుకు చొరవ చూపారు. ఆదోని, కోసిగి ప్రాంత యువకులు దాదాపు 600 మందికి శిక్షణనిప్పించి 34 మందికి కృష్ణపట్నం పోర్టులో మొదటి విడతగా ఉద్యోగాలు ఇప్పించారు.
రెండో విడతగా కర్నూలు నగరంలో ముస్లిం యువకులకు ఉద్యోగావకాశం కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకుంటున్న ఫ్యాక్షనిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కట్టడి చేశారు. మట్కా, పేకాట నిర్వాహకులపైనా ఉక్కుపాదం మోపారు. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ముఖ్య అనుచరుడు కప్పట్రాళ్ల మద్దిలేటి నాయుడు, ఆదోనిలో పేరు మోసిన మట్కా కింగ్ ఈరన్న ఆస్తుల విషయంలో విచారణ జరిపించాలని ఈడీకి లేఖ రాసి సంచలనం సృష్టించారు. కర్నూలులో మట్కా డాన్‌గా పేరొందిన వ్యక్తికి సంబంధించిన ఆస్తులపైనా విచారణ జరిపించాలని కసరత్తు చేస్తున్న నేపథ్యంలోనే ఆయన బదిలీ కావడం గమనార్హం. ఏదేమైనా జిల్లా మరో సమర్థుడైన అధికారిని కోల్పోయింది.