సాక్షి, కరీంనగర్ : ప్రస్తుత సమావేశాలను మినహాయిస్తే, 2009 నుంచి ఇప్పటివరకు శాసనసభ 12సార్లు సమావేశమయ్యింది. మొత్తం 177 రోజులపా టు సభ నడిచింది. జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న వారిలో ఒక్కరికయినా ఫుల్ అటెండెన్స్ లేదు. వ్యక్తిగత అవసరాలో, ఇతర వ్యాపకాలో.. కారణమేదైనా సభ నడుస్తున్న సమయంలో డుమ్మా కొట్టారు. శాసనసభ్యులుగా లక్షల్లో జీతభత్యాలు పొందుతున్న వారు నాలుగున్నరేళ్లలో కేవలం 177 రోజులపాటు జరిగిన సమావేశాలకు కూడా సమయం ఇవ్వలేకపోయారు.
రాష్ట్ర శాసనసభ అధికారిక సమాచారం ప్రకారం.. గైర్హాజరులో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ మొదటి స్థానం ఉండగా, సిరిసిల్ల శాసనసభ్యుడు కె.తారకరామారావు రెండో స్థానంలో నిలిచారు. 2010లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. దీంతో రమేశ్, కేటీఆర్‌లతోపాటు ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, కె.విద్యాసాగర్‌రావు 2010 ఫిబ్రవరి, మార్చి నెలల్లో 31 రోజులపాటు జరిగిన సభలకు హాజరు కాలేకపోయారు.
ఈ 31 రోజులను మినహాయించినా గైర్హాజరు జాబితాలో వారి స్థానం మారలేదు. రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అత్యధికంగా 137 రోజులు సభకు హాజరుకాగా, 134 రోజుల హాజరుతో హుస్నాబాద్ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు. దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంత్రిగా వ్యవహరిస్తుండగా, మానకొండూరు ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ 2012 ఫిబ్రవరి నుంచి ప్రభుత్వ విప్‌గా కొనసాగుతున్నారు. ఫిబ్రవరి 2012కు ముందు 119 రోజులపాటు సభ జరగగా మోహన్ 91రోజుల పాటు హాజరయ్యారు. ఆయన 28 రోజులు గైర్హాజరయ్యారు.
సమస్యలు గాలికి...
సభకు హాజరయిన సమయాన్ని అయినా ఎమ్మెల్యేలు వినియోగించుకోలేదన్న విమర్శలున్నాయి. 13 శాసనసభ ప్రారంభమయినప్పటి నుంచే సభను తెలంగాణ అంశం కుదిపేస్తోంది. ప్రతి సెషన్‌లో సభ రోజుల తరబడి వాయిదా పడుతూవచ్చింది. మిగిలిన సమయంలోనూ జిల్లా ఎమ్మెల్యేలు ఇక్కడి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయలేదు. జిల్లా రైతాంగం ఏటా తుపాన్లతో నష్టపోయినా సరిహారం అందించడంలో ప్రభుత్వం విఫలం కావడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయినా ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. రుణాలు, విత్తనాలు, ఎరువుల పంపిణీలో వైఫల్యాల మీద నోరెత్తలేదు. మధ్యమానేరు, ఎల్లంపల్లి ముంపు బాధితులు పరిహారం కోసం ఎదురుచూస్తున్నా పట్టించుకోలేదు. సభలో జిల్లాకు సంబంధించి ఒక్కరైనా గట్టిగా మాట్లాడిన సందర్భంలేదన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది.
సభకు డుమ్మా
Published Wed, Jan 8 2014 5:12 AM | Last Updated on Sat, Sep 2 2017 2:22 AM
Advertisement
Advertisement