పార్టీలు తోడైతేనే ఉద్యమానికి ఊపు!
పార్టీలు తోడైతేనే ఉద్యమానికి ఊపు!
Published Sun, Sep 8 2013 2:50 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్ర సమైక్యత కోసం సాహసోపేతంగా ఉద్యమిస్తున్న ఉద్యోగులు, ప్రజా సంఘాలను కచ్చితంగా అభినందిచాల్సిందే. ఈ సమస్యకు అంతిమ పరిష్కారం రాజకీయ ప్రక్రియే. కాబట్టి రాజకీయ పార్టీలు తమ నిర్ణయాలను మార్చుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తేనే రాష్ట్రం సమైక్యంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కూడా సమైక్యవాదంపై నిలబడి పోరాడుతున్న రాజకీయ పార్టీలను కలుపుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారి శ్రమకు రాజకీయ పార్టీలు తోడైతే ఉద్యమం విజయవంతమవుతుంది’ అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ నేత ఏవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఉధృతంగా సాగుతున్న సమైక్య ఉద్యమం మరింత బలోపేతం కావాలంటే రాజకీయ పార్టీల భాగస్వామ్యం కచ్చితంగా అవసరమన్నారు. టీఆర్‌ఎస్ ఇదే వ్యూహాన్ని అమలు పరిచిందన్నారు.
సమైక్య ఉద్యమంపై శనివారం ‘సాక్షి టీవీ’ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ప్రవీణ్ మాట్లాడారు. రాష్ట్ర సమైక్యత కోసం ఏపీఎన్జీవోలు, ప్రజా సంఘాలు చేస్తున్న ఉద్యమం ప్రపంచ చరిత్రలోనే అత్యంత అరుదైనదన్నారు. అయితే, రాజకీయ పార్టీల విధానాలు, సిద్ధాంతాల్లో మార్పు తేకుండా ఎన్ని ఉద్యమాలు చేసినా ఉపయోగం లేదన్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఏపీఎన్జీవోల సభ పార్టీలపై ఒత్తిడి తెచ్చే దిశగా సాగుతుందని తాను భావించానన్నారు. కానీ, ఈ మహాసభలో ఆ ప్రయత్నం జరగలేదన్నారు. ఇప్పటికైనా సమైక్య ఉద్యమం మరింత ముందుకెళ్లాలంటే రాజకీయ పార్టీలన్నింటిపైనా ఆ దిశగా ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ఇప్పటికే సమైక్య గళాన్ని గట్టిగా వినిపిస్తున్న పార్టీలను కలుపుకెళ్లాల్సిన అవసరం రానున్న రోజుల్లో ఉంటుందన్నారు. ఉద్యమాలు ఎంతవరకూ చేయాలి.. ఎంతవరకూ రాజకీయంగా ముందుకెళ్లాలనే దానిపై టీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించి, రాష్ట్రాన్ని ఈ దుస్థితికి తీసుకొచ్చిందని ప్రవీణ్ వివరించారు.
బొత్సది బాధ్యతారాహిత్యం
సమ్మె 30 రోజులేంటి, 365 రోజులు జరపడానికి సిద్ధంగా ఉండాలని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ మాట్లాడటం అతని బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని ప్రవీణ్ దుయ్యబట్టారు. విభజన నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం కనుక.. ప్రజల ఆకాంక్ష మేరకు కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన ఆ పార్టీ నేతలు, కేంద్ర మంత్రులు ఆ పని చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రులు, అధికారంలో ఉన్న నేతలు రాజీనామా చేస్తే జాతీయ స్థాయిలో స్పందన రావడమే కాక విభజన ప్రక్రియ ఆగుతుందన్నారు. ఇప్పటికైనా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నట్లు, ప్రజల ఆలోచనకు అనుగుణంగా మంత్రులంతా రాజీనామా చేయాలని సూచించారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో నియోజకవర్గాల్లో అడుగుపెట్టే పరిస్థితి కూడా ఉండదని హెచ్చరించారు. బావోద్వేగాల ప్రాతిపదికగానే విభజించాలనుకుంటే ఇప్పటికే పంజాబ్ ప్రత్యేక దేశంగా మారేదని, ఎల్‌టీటీఈ కోరినట్లు శ్రీలంక ఎప్పుడో రెండుగా చీలిపోయేదని గుర్తుచేశారు. అవాస్తవ పునాదుల మీద తెలంగాణ ఉద్యమం నిర్మితమైందన్నారు. కేసీఆర్ అవాస్తవాలతో యువతను, తెలంగాణ ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించారని ప్రవీణ్ విమర్శించారు.
Advertisement
Advertisement