
విభజన వేళ చార్జీల బాదుడా?
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు రాష్ట్ర విభజన అంశం పార్లమెంటు ముందుకు వెళ్తున్న సమయంలో విద్యుత్‌చార్జీల పెంపుపై విచారణ ఏమిటని పలు రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. చార్జీల పెంపు ప్రతిపాదనలను వెంటనే తిరస్కరించాలని, విచారణ వారుుదా వేయూలని మంగళవారం డిమాండ్ చేశారుు. దీంతో 2014-15 ఆర్థిక సంవత్సరానికిగానూ సీపీడీసీఎల్ సమర్పించిన విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై లక్డీకాపూల్‌లోని ఫ్యాప్సీ హాలులో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) నిర్వహించిన బహిరంగ విచారణ రసాభాసాగా మారింది. తొలుత బహిరంగ విచారణలో మాట్లాడేందుకు ముందస్తుగా పేర్లు నమోదు చేసుకున్న వారిని మాత్రమే లోపలికి అనుమతించారు. ఇందుకు నిరసనగా వామపక్షాలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బైఠాయించారు.
పోలీసులు వీరిని అరెస్టు చేసి అక్కడినుంచి తరలించారు. ఇలావుండగా హాల్లో ఆందోళనకు దిగిన సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు రాఘవులు, నారాయణ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జనక్‌ప్రసాద్, న్యూడెమోక్రసీ నేత గాదె దివాకర్‌లు విచారణను అడ్డుకున్నారు. దీంతో ఈఆర్‌సీ చైర్మన్ భాస్కర్ విచారణను కొద్దిసేపు వాయిదా వేశారు. పోలీసులు ఆందోళనకు దిగిన నేతలను అరెస్టు చేశారు. తర్వాత విచారణ ప్రారంభం కాగా విద్యుత్‌రంగ నిపుణులు వేణుగోపాల్‌రావు, తిమ్మారెడ్డి, రఘుతో పాటు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తదితరులు మాట్లాడారు. మరికొన్ని ముఖ్యాంశాలు...
ల్యాంకో సంస్థకు అధిక చార్జీలు చెల్లించడం ద్వారా అధికారులు అదనంగా రూ.150 కోట్లను ముట్టచెప్పారు. ఇందుకు ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిళ్లు ఉన్నాయి. దీనిపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలి.
విదేశీ బొగ్గు కొనుగోలులో అవకతవకలు జరుగుతున్నాయి. దీనిపై ఈఆర్‌సీ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయమని కూడా డిస్కంలు కోరకపోవడంలో మతలబు ఏమిటి?
జీవీకే, ల్యాంకో, స్పెక్ట్రమ్‌లపై వైఎస్ హయూంలో విచారణ జరిపిన సీబీసీఐడీ నివేదిక సమర్పించినా దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
నెలకు 200 యూనిట్ల లోపు వినియోగించే పేద, మధ్యతరగతికి విద్యుత్ చార్జీలను భారీగా పెంచడం సమంజసం కాదు.
విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) ముగిసిన స్పెక్ట్రమ్, జీవీకే, ల్యాంకోలను స్వాధీనం చేసుకోకుండా ఆధునీకరణ పేరుతో వారికే అప్పగించేందుకు ప్రయత్నాలు
జరుగుతున్నాయి.
మా ఉసురు తగులుతుంది!
ఈఆర్‌సీ విచారణ సందర్భంగా రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఉంటున్న వారిని రెండో తరగతి పౌరులుగా చూస్తున్నారని భారతీయ కిసాన్ సంఘ్ నేతలు శ్రీధర్‌రెడ్డి, అంజిరెడ్డి, రాములు విమర్శించారు. లక్షల బిల్లులు చెల్లించాల్సిన వారిని ఏమనకుండా ఒక నెల బిల్లు చెల్లించకుంటే గ్రామాల్లో కరెంటు కట్ చేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో ఉంటున్న వారికి కోతలు ఉండవని... గ్రామాలకు మాత్రం కనీసం రాత్రి పూట కూడా కరెంటు ఇవ్వడం లేదని తెలిపారు. వేలకు వేలు జీతాలు తీసుకుంటూ సిబ్బంది సరిగ్గా పనిచేయడం లేదని తమ ఉసురు తప్పకుండా తగులుతుందని శాపనార్ధాలు పెట్టారు. వ్యవసాయానికి రాత్రి పూట కరెంటు ఇస్తుండటం వల్ల రైతులు విద్యుత్ షాకులకు గురై చనిపోతున్నారన్నారు.