సాక్షి, హైదరాబాద్: సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో అధికారుల బదిలీలపై ఎన్నికల సంఘం నిబంధనలు అమలు చేస్తోంది. అయితే, రాష్ట్రంలో ఈ నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా సాగిపోతోంది. పలువురు మంత్రులే బదిలీల్లో జోక్యం చేసుకుంటూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. ప్రధానంగా రెవెన్యూ, మున్సిపల్ శాఖల్లో ఆ శాఖల మంత్రులతో పాటు ఇతర మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధుల జోక్యంతో బదిలీలు జరుగుతున్నాయని అధికారులు చెబతున్నారు. ప్రజాప్రతినిధులు వారికి అనుకూలంగా లేని వారిని మరో ప్రాంతానికి బదిలీ చేయించి, అనుకూలమైన వారిని తెచ్చుకుంటున్నారు. కమిషన్ నిబంధనల ప్రకారం గత నాలుగు సంవత్సరాల్లో మూడేళ్లు ఒకే చోట పనిచేసిన వారు, సొంత జిల్లాల్లో ఉన్న అధికారులను బదిలీ చేయాలి.
ఆరు నెలల్లో పదవీ విరమణ చేసే అధికారులను ఎన్నికల విధుల్లో నియమించకూడదు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల బదిలీల్లో మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుంటున్నారు. మూడు సంవత్సరాలు పూర్తి కాని వారిని కూడా బదిలీ చేయిస్తున్నారు. ప్రధానంగా ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్ల బదిలీల్లో నిబంధనల ఉల్లంఘన జరుగుతోంది. 16 నెలల క్రితమే వచ్చిన వరంగల్ జిల్లా ములుగు ఆర్డీవోను, మహబూబ్‌నగర్ జిల్లాలో రెండేళ్ల క్రితమే నియమితులైన మరో ఆర్డీవోను ప్రజాప్రతినిధులు బదిలీ చేయించారు. ఒక మంత్రి అయితే జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి ఒక అధికారిని విధుల్లోకి చేర్చుకోవద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. పైగా, ఆరు నెలల్లో పదవీ విరమణ చేసే వారిని కూడా తమ జిల్లాల్లో నియమించాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని, ఎన్నికల బదిలీల విషయంలో కమిషన్ నిబంధనల ప్రకారమే శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు వ్యవహరించే వారని, ఇప్పుడు మాత్రం స్వయంగా మంత్రులే జోక్యం చేసుకుంటున్నారని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా జరిగిన కొన్ని బదిలీలకు సంబంధించిన సమాచారం ఇప్పటికే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి చేరింది. ఇదిలా ఉండగా ఎన్నికల బదిలీలకు గడువును కేంద్ర ఎన్నికల సంఘం ఈ నె ల 25 వరకు పొడిగించింది. ఈ గడువులోగా బదిలీలు పూర్తి చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా జరిగే బదిలీలను నిలిపివేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ హెచ్చరించారు.