ముదురుతున్న వర్గపోరు
చిత్తూరు ఎమ్మెల్యే డీఏ సత్యప్రభ, మేయర్ కఠారి అనురాధ మధ్య అంతర్గతపోరు తారస్థాయి కి చేరింది. కార్పొరేషన్ తొలి కౌన్సిల్ సమావేశంలో ఈ విషయం బట్టబయలైంది. చిత్తూరు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ప్రతిపాదించిన ఆరు అంశాల్లో రెండింటికి మాత్రమే పాలకవర్గం ఆమోదముద్ర వేసింది. నాలుగింటిని తిరస్కరించింది. దీనిపై ఎమ్మెల్యే వర్గం గుర్రుగా ఉంది. చిత్తూరు అభివృద్ధి కోసం చంద్రబాబుతో ‘ఆమోదముద్ర’ వేసిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోకపోవడం ఎమ్మెల్యేను విస్మయానికి గురిచేసింది.
సాక్షి, చిత్తూరు: చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, ఎమ్మెల్యే డీఏ సత్యప్రభ మధ్య అంతర్గత విభేదాలు మరోసారి పొడచూపాయి. చిత్తూరు తొలి మేయర్‌గా కఠారి అనురాధ ఎన్నికైన తర్వాత తొలి పాలకమండలి సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. చిత్తూరు నగర అభివృద్ధిపై మేయర్‌కు ఎంత బాధ్యత ఉందో ఎమ్మెల్యే సత్యప్రభకు అంతే ఉంది.
ఈ క్రమంలో చిత్తూరు అభివృద్ధికి సంబంధించి ఆరు అంశాలను తీర్మానించాలని కౌన్సిల్‌కు ప్రతిపాదనలు పంపారు. వాటిలో మాజీ ఎంపీ డీకే ఆదికేశవులునాయుడు విగ్రహం ఏర్పాటు, ఎన్టీఆర్ విగ్రహం నుంచి బస్టాండ్ సర్కిల్ వరకూ ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి దారికి ‘ఎన్టీఆర్ మార్గ్’ అని నామకరణం చేయాలనే ప్రతిపాదనలను మాత్రమే కౌన్సిల్ ఆమోదించింది. నాలుగు అంశాలపై ఎలాంటి చర్చ జరపకుండానే తిరస్కరించింది. ఇటీవల మేయర్ లేకుండా కమిషనర్‌తో కలిసి కలెక్టర్‌తో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించినందుకు ఆమె ప్రతిపాదనల తిరస్కరణతో మేయర్ బదులు చెప్పినట్లయింది.
తిరస్కరించిన అంశాలు ఇవే...
* చిత్తూరు గంగినేని చెరువులో పార్కు ఏర్పాటు చేసి అందులో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని సత్యప్రభ సీఎం చంద్రబాబు వద్ద ప్రతిపాదించింది. దీనికి చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి, ప్రతిపాదనలను కలెక్టర్‌కు పంపారు. 35లక్షల రూపాయలతో ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. చిత్తూరులో కొత్తగా పార్కును ఏర్పాటు చేస్తున్నామని ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో కూడా కలెక్టర్ సిద్ధార్థజైన్ చెప్పారు. పాలకమండలి ఈ ప్రతిపాదనను తిరస్కరించింది.
* కొంగారెడ్డిపల్లిలోని కమిషనర్ బంగ్లా సమీపంలో వృథాగా ఉన్న స్థలంలో 25.69 లక్షల రూపాయలతో పార్కు నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనికి కౌన్సిల్‌లో ‘తిరస్కరణముద్ర’ పడింది.
* ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహాన్ని లక్ష్మీనగర్‌లో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే చేసిన ప్రతిపాదనకు ఆమోదం లభించలేదు.
* తెలుగుచలన చిత్ర రంగానికి విశేష సేవలందించిన జిల్లా వాసి చిత్తూరు నాగయ్య పేరును కళాక్షేత్రానికి పంపాలని ఎమ్మెల్యే చేసిన ప్రతిపాదనను తిరస్కరించారు.