
పోలింగ్ ప్రశాంతం, 1న కౌంటింగ్
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 5 గంటలలోపు లైనులో నిలబడిన వారికి పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా ఓటు వేసే అవకాశం కల్పించారు. సుమారు 65 శాతం పోలింగ్ నమోదయినట్టు సమాచారం. చిన్నచిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని, డబ్బుల పంపిణీపై రెండు ఫిర్యాదులు అందాయని జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు.
మొత్తం 50 వార్డుల్లో 48 వార్డులకు ఎన్నికల పోలింగ్ జరిగింది. మిగతా రెండు వార్డులకు కోర్టు వ్యాజ్యం మూలంగా ఎన్నికలు జరగలేదు. చాలా చోట్ల ఓటర్ లిస్టులో పేర్లు గల్లంతయ్యాయి. ఓటర్ ఐడీ కార్డు ఉన్నా చాలాచోట్ల జనం ఓటుహక్కు వినియోగించులేకపోయారు. పోలింగ్ సందర్భంగా సెలవు ఇవ్వకపోవడంతో చాలా మంది ఓట్లు వినియోగించుకోలేకపోయారు. ఓట్ల లెక్కింపు సెప్టెంబరు 1వ తేదీన జరగనుంది.