Kakinada Corporation Elections
-
కాకినాడ ఓట్లకు ఖాకీలే పెద్దలు!
-
కాకినాడ ఓట్లకు ఖాకీలే పెద్దలు!
అధికార టీడీపీకి యథాశక్తి సహకరించిన పోలీసులు కాకినాడ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: చెదురుమదురు సంఘటనలు, స్వల్ప ఉద్రిక్తతల నడుమ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు మంగళవారం ముగిశాయి. 64.78 శాతం పోలింగ్ నమోదైంది. 241 మంది అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను(ఈవీఎంలు) అధికారులు స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపరిచారు. సెప్టెంబర్ 1న ఫలితాలు వెలువడనున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు రెండు డివిజన్లు మినహా మిగిలిన 48 డివిజన్లలో పోలింగ్ నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం 2,29,373 మంది ఓటర్లలో 1,48,598 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు కొందరు పోలీసు అధికారులు ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి వత్తాసు పలికారు. ఇదే అదనుగా టీడీపీ అభ్యర్థులు స్వైరవిహారం చేశారు. 144 సెక్షన్‌ను అపహాస్యం చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ కేంద్రాల వద్దే ఎన్నికల ప్రచారం చేశారు. ఇదేమిటని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి ప్రయత్నించారు. అంతు చూస్తామంటూ బెదిరించారు. ఓట్లు గల్లంతు.. జనం గగ్గోలు చాలా డివిజన్లలో తమ ఓట్లు గల్లంతయ్యాయని పలువురు ఓటర్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఓటరు స్లిప్పులు ఇచ్చినా జాబితాలో పేర్లు లేవంటూ చాలామందిని అధికారులు వెనక్కి పంపించడం వివాదానికి దారి తీసింది. పలు చోట్ల వాగ్వాదాలు జరిగాయి. మరి కొన్నిచోట్ల ఘర్షణ వాతావరణం నెలకొంది. ‘నోటా’ ఆప్షన్ ఏది? కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు వినియోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నోటా (పై అభ్యర్థులు ఎవరికీ కాదు అన్న మీట) అవకాశం కనిపించకపోవడం వివాదాస్పదంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ అవకాశం ఉండదని పోలింగ్ అధికారులు వివరణ ఇచ్చారు. పలు చోట్ల ఘర్షణలు ఎన్నికల సందర్భంగా ఏటిమొగ, జగన్నాథపురం, రామారావుపేట, వెంకటనగరం తదితర ప్రాంతాల్లో టీడీపీ నేతల ఆగడాలను వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని చెదరగొట్టారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులు ఆయా ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఆ నిబంధన టీడీపీ నేతలకు వర్తించదా? ఎన్నికల సమయంలో స్థానికులు తప్ప ఇతర ప్రాంతాల నాయకులు ఎవరూ ఉండకూడదన్న నిబంధనను టీడీపీ నేతలు తుంగలో తొక్కారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన నాయకులు కాకినాడలోని వివిధ లాడ్జిలలో మకాం వేసి ఎన్నికలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆదేశాల మేరకు పలు ప్రాంతాల ఇంటెలిజెన్స్ అధికారులు టీడీపీ ఏజెంట్లుగా వ్యవహరించారు. పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, అనపర్తి టీడీపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు వివిధ డివిజన్లలో కలియతిరిగారు. ఓటింగ్‌కు ఉద్యోగులు దూరం పోలింగ్ జరుగుతున్న కాకినాడలో మంగళవారం సెలవు ప్రకటించినప్పటికీ వేలాది మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు. ఐదారు వేల మంది ఉద్యోగులు నిత్యం కాకినాడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లి విధులు నిర్వహించుకుని సాయంత్రానికి తిరిగివస్తుంటారు. కాకినాడలో తప్ప శివారు ప్రాంతాలకు సెలవు లేకపోవడంతో వీరు ఓటింగ్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇదెక్కడి న్యాయం ఎస్పీ? అధికార పార్టీకి మద్దతు ఇవ్వలేదన్న సాకుతో 38వ డివిజన్లో విధులు నిర్వహిస్తున్న రాజమహేంద్రవరం ఎస్ఐ రాంబాబును జిల్లా ఎస్పీ విశాల్ గున్ని అక్కడి నుంచి తొలగించడం ఓటర్లను విస్మయపరిచింది. ఆ ఎస్ఐ వైఎస్సార్సీపీకి సహకరిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో ఆయనను తొలగించారు. అయితే, అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్ టీడీపీకి ఓట్లేయాలని చెబుతున్నారని వైఎస్సార్సీపీ నాయకులు ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం గమనార్హం. కొన్ని డివిజన్లలో పోలింగ్ బూత్‌ల వద్దే టీడీపీ నాయకులు పోలీసుల సాయంతో యథేచ్ఛగా ఓటర్లకు స్లిప్పులతో పాటు డబ్బు పంపిణీ చేశారు. పోలింగ్ కేంద్రాల్లో అధికార పార్టీ నేతలు హల్చల్ సృష్టించినా, ఓటర్లను గుంపులు గుంపులుగా తీసుకువచ్చి పోలింగ్ బూత్‌ల్లోకి చొరబడుతున్నా పోలీసులు అదేమని ప్రశ్నించకపోగా యథాశక్తి సహకరించారు. -
'టీడీపీకి కచ్చితంగా బుద్ధిచెబుతారు'
సాక్షి, కాకినాడ: కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, అధికార పార్టీ నాయకులు వేల రూపాయలు పంచారని వైఎస్సార్ సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కన్నబాబు ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమల్లోవున్నా ఇతర జిల్లాల టీడీపీ నేతలు కాకినాడలోనే మకాం వేశారని తెలిపారు. వార్డులవారీగా ప్రలోభాలకు గురిచేశారని అన్నారు. టీడీపీ ఎన్ని అక్రమాలకు పాల్పడినా వైఎస్సార్ సీపీదే విజయమన్నారు. ప్రభుత్వానికి కాకినాడ ప్రజలు కచ్చితంగా బుద్ధిచెబుతారన్నారు. కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో అధికార పార్టీ తీరును మేధావులు కూడా అసహ్యించుకుంటున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ తెలిపారు. కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదని ఆయన అన్నారు. కాగా, కాకినాడ ఎన్నికల ఫలితాలు సెప్టెంబర్ 1న వెలువడనున్నాయి. -
పోలింగ్ ప్రశాంతం, 1న కౌంటింగ్
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 5 గంటలలోపు లైనులో నిలబడిన వారికి పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా ఓటు వేసే అవకాశం కల్పించారు. సుమారు 65 శాతం పోలింగ్ నమోదయినట్టు సమాచారం. చిన్నచిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని, డబ్బుల పంపిణీపై రెండు ఫిర్యాదులు అందాయని జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. మొత్తం 50 వార్డుల్లో 48 వార్డులకు ఎన్నికల పోలింగ్ జరిగింది. మిగతా రెండు వార్డులకు కోర్టు వ్యాజ్యం మూలంగా ఎన్నికలు జరగలేదు. చాలా చోట్ల ఓటర్ లిస్టులో పేర్లు గల్లంతయ్యాయి. ఓటర్ ఐడీ కార్డు ఉన్నా చాలాచోట్ల జనం ఓటుహక్కు వినియోగించులేకపోయారు. పోలింగ్ సందర్భంగా సెలవు ఇవ్వకపోవడంతో చాలా మంది ఓట్లు వినియోగించుకోలేకపోయారు. ఓట్ల లెక్కింపు సెప్టెంబరు 1వ తేదీన జరగనుంది. -
క్యాష్ కొట్టు.. ఓటు పట్టు..
కాకినాడ: నంద్యాల ఉప ఎన్నికల్లో గెలవడానికి వందల కోట్లు ఖర్చు పెట్టిన టీడీపీ కాకినాడలోను అదే పంధాను కొనసాగిస్తోంది. నంద్యాలలో ఓటుకు రూ.ఐదువేల నుంచి రూ.10 వేల పంపిణీ చేసిన తెలుగుదేశం నాయకులు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లోను ధన ప్రవాహం కొనసాగిస్తున్నారు. క్యాష్ కొట్టు.. ఓటు పట్టు అనే నినాదాన్ని అక్షరాల పాటిస్తున్నారు. యధేచ్ఛగా డబ్బు పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తోంది. ఎన్నికల సందర్భంగా అధికార టీడీపీ విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తోంది. 35వ వార్డులో డబ్బులు పంపిణీ చేస్తూ టీడీపీ కార్యకర్తలు ' సాక్షి' కెమెరాకు చిక్కారు. ఈ విషయంపై పోలీసులు ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల తరహాలో కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రలోభాల పర్వాలకు టీడీపీ తెర తిసినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తలు ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిపోయారు.కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు ఈ నెల 29వ తేదిన జరుగుతున్న విషయం తెలిసిందే. మొత్తం 50 వార్డులు ఉంటే ప్రస్తుతం 48 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 42, 48 వార్డులకు ప్రస్తుతం ఎన్నికలు జరగడం లేదు. -
పొరుగు నేతే పవర్ ఫుల్లా
♦ ‘కాకినాడ కదన సారథి’గా మంత్రి ప్రత్తిపాటి ♦ పార్టీ జిల్లానాయకుల్ని పక్కన పెడుతున్న చంద్రబాబు ♦ మొన్న ఎమ్మెల్యే వనమాడి, నేడు డిప్యూటీ సీఎం రాజప్ప ♦ ఆర్థిక మంత్రి యనమలకూ దక్కని ప్రాధాన్యం ♦ జీర్ణించుకోలేకపోతున్న జిల్లా ‘దేశం’ శ్రేణులు సాక్షి ప్రతినిధి, కాకినాడ : టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు పార్టీ జిల్లానేతల సమర్థతపై నమ్మకం సడలింది. వారితో కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలను గట్టెక్కలేమనుకుంటున్నారు. ఓటమి భయంతో వారిని పక్కన పెట్టేస్తున్నారు. హుటాహుటిన పొరుగు నేతలను రంగంలోకి దించుతున్నారు. నయానో, నజరానాలతోనూ కార్పొరేషన్‌ను దక్కించుకోవాలని చూస్తున్నారు. అయితే.. ఆయన తీరును స్థానిక నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. బయటి వారొచ్చి ఇక్కడ ఏం చేస్తారని పెదవి విరుస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరికి కళ్లెం.. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఎన్నికల బాధ్యతల్లో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అన్నట్టుగా అధిష్టానం చూస్తోంది. ఎన్నికల్లో ఆయన వలన కలిసొచ్చేదేమీ ఉండదనే అభిప్రాయం కేడర్‌లో కూడా ఉంది. ఇక, పార్టీ పరువును మంట గలిపేశారన్న ఆలోచనతో పంపకాల్లోనే సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావును వ్యూహాత్మకంగా పక్కన పెట్టేశారు. మంత్రుల ద్వారా ఎమ్మెల్యేకు చెక్ పెట్టారు. ఆ మంత్రుల్లో ఒకరైన డిప్యూటీ సీఎం, హోంమంత్రి చినరాజప్పకు తాజాగా షాక్ ఇచ్చారు. అవమానకర రీతిలో ఆయన్ని పక్కన పెట్టినట్టు తెలిసింది. సీట్ల పంపకాల్లో అనుసరించిన ధోరణి పార్టీని కుదిపేయడంతో చినరాజప్పకు అసమ్మతి సెగ తాకింది. ఏకపక్షంగా అభ్యర్థులను ఎంపిక చేశారంటూ అసంతృప్తివాదులంతా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఒకవైపు కాపుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. మరోవైపు నగరంలో పార్టీకి ఆశించినంత పట్టులేదు. ఇంకోవైపు సీట్ల పంపకాల్లో సమతూకం లేకపోవడంతో కొన్ని సామాజిక వర్గాలు దూరమయ్యాయి. ఈ నేపథ్యంలో చినరాజప్పను నమ్ముకుంటే కష్టమన్న అభిప్రాయంతో చంద్రబాబు ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించినట్టు తెలిసింది. ఆయన స్థానంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు బాధ్యతలు అప్పగించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజప్ప ఇకపై వెనకుండి నడవడం తప్ప ముందుండి నడిపించే పరిస్థితి లేదని పార్టీలో చర్చ జరుగుతోంది. కాకపోతే, ఎక్కడి నుంచో వచ్చినచ నేతలు ఇక్కడేం చేస్తారని, పార్టీ పరిస్థితి అలా తయారైందని కొందరు పెదవి విరుస్తున్నారు. -
సార్వత్రిక విజయానికి కాకినాడ నాంది కావాలి
♦ కాకినాడ నగరంలో 30 స్థానాలు గెలవడం ఖాయం ♦ ఇది నేను చెబుతున్న మాట కాదు వివిధ సర్వేలు స్పష్టం చేసిన నిజం ♦ అలా అని నిర్లక్ష్యం తగదు... విజయం స్ఫూర్తితో కసితో కృషి చేయాలి ♦ బీజేపీతో పొత్తు నంద్యాలలోఎందుకు పెట్టుకోలేదు ♦ టీడీపీ ద్వంద్వ వైఖరిని ఎండగట్టాలి ♦ నవరత్న పథకాల విశిష్టతలను వివరిస్తూ విస్తృత ప్రచారం చేయాలి ♦ కార్పొరేషన్ ఎన్నికలపై సమన్వయకర్తలతో సమీక్షలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన ♦ కార్యదర్శి విజయసాయిరెడ్డి పిలుపు రానున్న సార్వత్రిక ఎన్నికల విజయానికి కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల విజయం నాందీ కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ, తెలుగుదేశం ప్రభుత్వ అవినీతి అరాచకపాలన పార్టీని విజయం వైపు నడిపించగలవన్నారు. కాకినాడలో బీజేపీతో పొత్తు కొనసాగిస్తూ నంద్యాలలో మాత్రం ఆ పార్టీతో సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్న టీడీపీ వైఖరిని కూడా ఎండగట్టి ప్రజలకు తెలియజెప్పాలన్నారు. పార్టీ శ్రేణులు, సమన్వయకర్తలు మరింత కష్టపడి పనిచేస్తే ఫలితాలు మరింత మెరుగ్గా ఉండగలవన్నారు. కాకినాడ : రానున్న సార్వత్రిక ఎన్నికల విజయానికి కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల విజయం నాంది కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎస్వీఎన్ గ్రాండ్ ఫంక్షన్‌హాలులో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఉభయగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, కృష్ణాజిల్లాల పార్టీ సమన్వయకర్తల సమావేశానికి వైఎస్సార్‌సీపీజిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన విజయసాయిరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ, తెలుగుదేశం ప్రభుత్వ అవినీతి అరాచక పాలన వంటి అంశాలు పార్టీని విజయం వైపు నడిపించగలవన్నారు. కాకినాడలో బీజేపీతో పొత్తు కొనసాగిస్తూ నంద్యాలలో మాత్రం ఆ పార్టీతో సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్న టీడీపీ వైఖరిని కూడా ఎండగట్టి ప్రజలకు తెలియజెప్పాలన్నారు. సర్వే నివేదికల ప్రకారం 30 స్థానాలకు పైగా వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంటుందని, పార్టీ శ్రేణులు, సమన్వయకర్తలు మరింత కష్టపడి పనిచేస్తే ఫలితాలు మరింత మెరుగ్గా ఉండగలవన్నారు. ప్రతి గడపకు వెళ్లి నవరత్న పథకాలతోపాటు తెలుగుదేశం ప్రభుత్వ వంచనను ప్రజలకు తెలియచెప్పాలన్నారు. ఈ ఎన్నికల్లో సీట్ల పంపిణీలో అన్ని వర్గాలకు అవకాశం కల్పించాం కానీ బ్రాహ్మణులకు అవకాశం వ్వలేకపోయామని, దానికి కారణం ఎవరూ దరఖాస్తు చేసుకోకపోవడమే అన్నారు. మేం గెలిచాక వీరికి సముచిత స్థానం కల్పిస్తాం..అని అన్నారు. సమావేశంలో మాజీ మంత్రులు ఎం.పార్థసారథి, కొప్పన మోహనరావు, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, గిడ్డి ఈశ్వరి, విశ్వసరాయి కళావతి, బూడి ముత్యాల నాయుడు, కోన రఘుపతి, కంబాల జోగులు, పి.రాజన్నదొర, విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నా«థ్, విజయనగరం జిల్లా పార్టీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు కారుమూరి నాగేశ్వరరావు, గొల్ల బాబూరావు, తానేటి వనిత, రౌతు సూర్యప్రకాశరావు, అల్లూరి కృష్ణంరాజు, పెండెం దొరబాబు, పాముల రాజేశ్వరిదేవి, పి.బాలరాజు, పాతపాటి సర్రాజు, మల్లా విజయప్రసాద్, ముదునూరి ప్రసాదరాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి, జెడ్పీమాజీ ఛైర్మన్ చెల్లుబోయిన వేణు, జిల్లా కో–ఆర్డినేటర్లు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, ముత్యాల శ్రీనివాస్, బొంతు రాజేశ్వరరావు, కొండేటి చిట్టిబాబు, పితాని బాలకృష్ణ, తోట సుబ్బారావు నాయుడు, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఆకుల వీర్రాజు, గిరిజాల బాబు, వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, జెడ్పీ ప్రతిపక్ష నాయకుడు సాకా ప్రసన్నకుమార్, అమలాపురం పార్లమెంట్ ఇన్చార్జి వలవల బాబ్జి, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు కొల్లి నిర్మలాకుమారి, సిరిపురపు శ్రీనివాసరావు, పెట్టా శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, మిండగుదిటి మోహన్, వట్టికూటి రాజశేఖర్, చెల్లుబోయిన శ్రీనివాస్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కర్రి నారాయణరావు, బీసీసెల్ కార్యదర్శులు బొబ్బిలి గోవిందు, అల్లి రాజబాబు, మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు, వివిధ జిల్లాల కో–ఆర్డినేటర్లు పెనుమత్స సురేష్‌బాబు, కరణం ధర్మశ్రీ, ప్రగడ నాగేశ్వరరావు, బొడ్డేడ ప్రసాద్, కోలా గురువులు, అన్యంరెడ్డి అదీప్‌రాజు, బొడ్డేటి ప్రసాద్, దయ్యాల నవీన్‌బాబు, గున్నం నాగబాబు, సలాది వెంకట్రావు, కౌలు శ్రీనివాసరావు, గున్నం నాగబాబు, రాష్ట్ర పార్టీ నాయకులు కొయ్య ప్రసాద్‌రెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, పక్కి దివాకర్, ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. భేతాళ మాంత్రికుడిలా చంద్రబాబు : చెవిరెడ్డి కార్పొరేషన్ ఎన్నికల కోర్ కమిటీ సభ్యుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ మూడున్నరేళ్ళుగా ఎన్నో అరాచకాలు, దౌర్జన్యాలు, వేధింపులను ఎదుర్కొన్నారని, పార్టీ శ్రేణులు ఈ ఎన్నికల్లో కష్టపడి పనిచేసి రానున్న సార్వత్రిక విజయానికి నాంది పలకాలని పిలుపునిచ్చారు. కుట్రలు, కుతంత్రాలతో భేతాళ మాంత్రికునిగా మారిన చంద్రబాబుకు ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు ఆలీబాబా 40 దొంగల్లా.... ఇప్పుడు చంద్రబాబు... 40 దొంగలు(మంత్రులు) త్వరలోనే ఇక్కడ ఎన్నికలపై విరుచుకుపడే పరిస్థితి ఉందన్నారు. వీరిని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలన్నారు. రూ.వేల కోట్ల అవినీతికి తెరతీసిన టీడీపీ : ధర్మాన జిల్లా పరిశీలకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక రూ.వేలకోట్ల అవినీతికి తెరతీసిందని విమర్శించారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఎత్తిపోతల పథకాలను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ఎన్నో గొప్పలు చెప్పినా స్మార్ట్‌సిటీ ముందుకు సాగడంలేదన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ రానున్న కార్పొరేషన్ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని మెజార్టీ స్థానాలు గెలుచుకుని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోగలమన్నారు. ఇవి ప్రీ ఫైనల్స్ : పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ రానున్న కార్పొరేషన్ ఎన్నికలను ప్రీ పైనల్స్‌గా అభివర్ణించారు. పీఏసీ సభ్యులు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ అధికారపార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే కార్పొరేటర్ అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చేందుకు కూడా రూ.10 లక్షలు వసూలు చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయని, దీనిని బట్టి ఆ పార్టీ ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చునన్నారు. కాకినాడ పార్లమెంట్ కో–ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ ఎక్కడ చూసినా ప్రజల్లో మంచి ఆదరణ కనిపిస్తోందని, కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించగలదని ధీమాగా చెప్పారు. సిటీ కో–ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ కాకినాడ మేయర్‌పీఠాన్ని కైవసం చేసుకుని పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి బహుమతిగా ఇస్తామన్నారు. మరో కో–ఆర్డినేటర్ ముత్తా శశిధర్ మాట్లాడుతూ గడచిన పాతికేళ్లలో కాకినాడ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన దాఖలాలు లేవని, ఇప్పుడు కూడా అదే ఒరవడి కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లాకు చెందిన రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి కొండా రాజీవ్‌గాంధీ, జిల్లా ప్రధాన కార్యదర్శులు అత్తిలి సీతారామస్వామి, శెట్టిబత్తుల రాజబాబు, జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు రావు చిన్నారావు, జాన్ వెస్లీ, మిండగుదిటి మోహన్, విశాఖజిల్లా పార్టీ నాయకులు శ్రీనివాస్, ముమ్మిడివరం ఫ్లోర్‌లీడర్ కాశి మునికుమారి, రాష్ట్ర బీసీసెల్ కార్యదర్శి అల్లి రాజబాబు, మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సంబంధించి సూచనలిచ్చారు. -
బీజేపీకి మిత్ర‘పోటు’
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీని అడుగడుగునా మోసం చేస్తున్న టీడీపీ 9 డివిజన్లలో మూడింట టీడీపీ నాయకులే బీజేపీ జిల్లా అధ్యక్షుడు పోటీ చేస్తున్న డివిజన్‌లోనూ టీడీపీ రెబల్ రగిలిపోతున్న బీజేపీ శ్రేణులు.. కాకినాడ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలుగుదేశం పార్టీ అసలు రంగు బయటపడింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో మిత్రపక్షమైన బీజేపీకి టీడీపీ అడుగడుగునా వెన్నుపోటు పొడుస్తోంది. తమకు పట్టులేని డివిజన్లను బీజేపీకి కేటాయించిన టీడీపీ.. ఆ తర్వాత ప్లేటు తిప్పేసింది. పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన 9 డివిజన్లలో మూడింట తమ నాయకులనే రెబల్స్‌గా బరిలోకి దించింది. టీడీపీ తీరుతో ఖిన్నులైన బీజేపీ నాయకులు ఇక తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అన్ని డివిజన్లలోనూ టీడీపీ అభ్యర్థులను ఓడించడం ద్వారా తమ సత్తా చాటాలని అంతర్గతంగా నిర్ణయించినట్లు తెలిసింది. మొత్తం 48 డివిజన్లలో 9 డివిజన్లను బీజేపీకి కేటాయించారు. మిగిలిన 39 స్థానాల్లో టీడీపీ బరిలోకి దిగింది. బుధవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిపోయింది. అయితే మిత్రపక్షాల ఒప్పందం ప్రకారం బీజేపీకి కేటాయించిన 9, 35, 47 డివిజన్లలో నామినేషన్లు వేసిన టీడీపీ అభ్యర్థులు మాత్రం తమ నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. టీడీపీ అధినాయకులు నామినేషన్లు వేసిన తమ అభ్యర్థులందరితో ముందుగానే నామినేషన్ల ఉపసంహరణ పత్రాల మీద సంతకాలు చేయించుకొని తమ వద్ద ఉంచుకున్నారు. అయితే ఈ డివిజన్లలోని టీడీపీ అభ్యర్థుల నుంచి మాత్రం నామినేషన్ల ఉపసంహరణ పత్రాలపై సంతకాలు చేయించుకోలేదు. టీడీపీ అధినాయకులు వ్యూహాత్మకంగానే ఈ డివిజన్లలో కూడా తమ అభ్యర్థులను బరిలోకి దింపినట్టు తెలుస్తోంది. దీనిపై బీజేపీ స్థానిక నాయకులు తమ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య టీడీపీ తీరుపై తమ పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడికీ తప్పని ‘మిత్ర’పోటు.. 9వ డివిజన్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. ఇక్కడ టీడీపీ రెబల్ అభ్యర్థిగా శ్రీకోటి అప్పలకొండ నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పోటీ చేస్తున్న డివిజన్‌లోనే టీడీపీ రెబల్ అభ్యర్థి బరిలోకి దిగడంపై ఆ పార్టీ నాయకులు సీరియస్‌గా ఉన్నారు. 35వ డివిజన్‌ను బీజేపీకి కేటాయించడంతో ఆ పార్టీకి చెందిన కొండాబత్తుల ప్రసాదరావు పోటీ చేస్తుండగా.. రమా ఆప్టికల్స్ రాంబాబు టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. బీజేపీ నాయకుల ఒత్తిడితో ఆయన్ని సంప్రదించిన టీడీపీ నేతలు.. వెంటనే నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే 47వ డివిజన్లో టీడీపీకి చెందిన కోళాబత్తుల అప్పారావు కూడా తన నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదు. అక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా బి.పద్మ పోటీలో ఉన్నారు. కాగా, నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 241 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచినట్లు అధికారులు చెప్పారు. -
పొత్తు.. బీజేపీ చిత్తు
♦ షాక్ ఇచ్చిన టీడీపీ ♦ పోటీల్లో ఉంటామంటున్న ఆశావహులు ♦ కమలనాథులకు కలవరం బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ) : కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల పొత్తులో భాగంగా టీడీపీ, బీజేపీకి షాక్ ఇచ్చింది. తమకు అడిగిన డివిజన్లు కేటాయించకుండా, టీడీపీ పట్టులేని, అభ్యర్థులు దొరకని డివిజన్ల కేటాయించి పొత్తు మమా అనిపించడంతో బీజేపీ పరిస్థితి అనుకున్నదొక్కటి... అయినదొక్కటి అన్నట్టు తయారయింది. మొదటి నుంచి సగం సీట్లు కావాలని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన బీజేపీ టీడీపీ ఇచ్చిన సీట్లుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రెండంకెల సీట్లు ఇచ్చేలా టీడీపీ నాయకులతో ఒప్పందం కుదిరిందని మూడురోజుల క్రితం పొత్తుల చర్చల్లో పాల్గొన్న రాష్ట్ర దేవాదాయశాఖమంత్రి పైడికొండల మాణిక్యాలరావు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. పొత్తులు తేలకపోవడంతో సీట్లు ఆశించిన బీజేపీ కార్యకర్తలు నగరంలో 24 డివిజన్లలో నామినేషన్లు దాఖలు చేశారు. తీరా చూస్తే కేవలం తొమ్మిది డివిజన్లు మాత్రమే కేటాయించింది. బీజేపీలో సీట్లు ఆశించిన ఆశావహులు తమకు సీట్లు కేటాయించలేదని ఆదివారం బీజేపీ జిల్లా కార్యాలయం ముట్టడించారు. పొత్తులు తేలలేదని చెప్పడంతో శాంతించిన బీజేపీ ఆశావహులు సోమవారం రాత్రి పొత్తులపై సృష్టత రావడంతో తమ సంగతేమిటని బీజేపీ నాయకులను ప్రశ్నిస్తున్నారు. 24 డివిజన్లలో బీజేపీ తరఫును నామినేషన్లు దాఖలు కాగా 9 మందికి మాత్రమే బి– ఫారంలు అందించింది. మంగళవారం ఒక్కరు మాత్రమే నామినేషన్ విత్‌డ్రా చేసుకున్నారు. మిగిలిన 14 మంది స్వతంత్య్ర అభ్యర్థులుగా బరిలో కొనసాగుతారంటున్నారు. బుజ్జగించే పనిలో నాయకులు.. టిక్కెట్లు ఆశించి భంగపడ్డ కార్యకర్తలు నామినేషన్లు ఉపసంహరించుకొనేలా నాయకులు వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. వీరు బరిలో దిగితే తమ ఓట్లు చీలిపోతాయని భావిస్తున్న టీడీపీ నాయకులు వీరికి డబ్బులు ఎర వేస్తున్నారు. వీరికి రూ.50 వేలు నుంచి రూ.లక్ష వరకూ ఇచ్చేందుకు ఒప్పందాలు జోరందుకున్నాయి. కాకినాడ జగన్నాథపురంలోని పలు డివిజన్లలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. పొత్తు ధర్మం పాటించరా? పొత్తు ధర్మం పాటించాలని, మనకు కేటాయించిన డివిజన్లు మినహా మిగిలిన డివిజన్లలోను నామినేషన్లు ఉపసంహరించుకొనకుంటే ఆయా కార్యకర్తలపై చర్యలు తప్పవని బీజేపీ నాయకులు కార్యకర్తలను హెచ్చరిస్తున్నారు. తమకు అన్యాయం జరిగిందని తమ సత్తా చాటుతామని పలువురు కార్యకర్తలు బీజేపీ నాయకులు వద్ద చెప్పినట్టు తెల్సింది. దీంతో తాము ఓడిపోతామనే గుబులు టీడీపీ నాయకుల్లో మొదలయ్యింది. దీంతో వారు ఏదోలా నామినేషన్ ఉపసంహరించే విధంగా చూడాలని ఇరుపార్టీ నాయకులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం మూడు గంటలలోపు బీజేపీ నాయకులు ఎన్ని నామినేషన్లు ఉపసంహరించుకొంటారో వేచి చూడాల్సిందే మరి.