
పొత్తు.. బీజేపీ చిత్తు
♦ షాక్ ఇచ్చిన టీడీపీ
♦ పోటీల్లో ఉంటామంటున్న ఆశావహులు
♦ కమలనాథులకు కలవరం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ) : కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల పొత్తులో భాగంగా టీడీపీ, బీజేపీకి షాక్ ఇచ్చింది. తమకు అడిగిన డివిజన్‌లు కేటాయించకుండా, టీడీపీ పట్టులేని, అభ్యర్థులు దొరకని డివిజన్‌ల కేటాయించి పొత్తు మమా అనిపించడంతో బీజేపీ పరిస్థితి అనుకున్నదొక్కటి... అయినదొక్కటి అన్నట్టు తయారయింది. మొదటి నుంచి సగం సీట్లు కావాలని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన బీజేపీ టీడీపీ ఇచ్చిన సీట్లుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రెండంకెల సీట్లు ఇచ్చేలా టీడీపీ నాయకులతో ఒప్పందం కుదిరిందని మూడురోజుల క్రితం పొత్తుల చర్చల్లో పాల్గొన్న రాష్ట్ర దేవాదాయశాఖమంత్రి పైడికొండల మాణిక్యాలరావు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.
పొత్తులు తేలకపోవడంతో సీట్లు ఆశించిన బీజేపీ కార్యకర్తలు నగరంలో 24 డివిజన్లలో నామినేషన్లు దాఖలు చేశారు. తీరా చూస్తే కేవలం తొమ్మిది డివిజన్‌లు మాత్రమే కేటాయించింది. బీజేపీలో సీట్లు ఆశించిన ఆశావహులు తమకు సీట్లు కేటాయించలేదని ఆదివారం బీజేపీ జిల్లా కార్యాలయం ముట్టడించారు. పొత్తులు తేలలేదని చెప్పడంతో శాంతించిన బీజేపీ ఆశావహులు సోమవారం రాత్రి పొత్తులపై సృష్టత రావడంతో తమ సంగతేమిటని బీజేపీ నాయకులను ప్రశ్నిస్తున్నారు. 24 డివిజన్లలో బీజేపీ తరఫును నామినేషన్లు దాఖలు కాగా 9 మందికి మాత్రమే బి– ఫారంలు అందించింది. మంగళవారం ఒక్కరు మాత్రమే నామినేషన్ విత్‌డ్రా చేసుకున్నారు. మిగిలిన 14 మంది స్వతంత్య్ర అభ్యర్థులుగా బరిలో కొనసాగుతారంటున్నారు.
బుజ్జగించే పనిలో నాయకులు..
టిక్కెట్లు ఆశించి భంగపడ్డ కార్యకర్తలు నామినేషన్లు ఉపసంహరించుకొనేలా నాయకులు వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. వీరు బరిలో దిగితే తమ ఓట్లు చీలిపోతాయని భావిస్తున్న టీడీపీ నాయకులు వీరికి డబ్బులు ఎర వేస్తున్నారు. వీరికి రూ.50 వేలు నుంచి రూ.లక్ష వరకూ ఇచ్చేందుకు ఒప్పందాలు జోరందుకున్నాయి. కాకినాడ జగన్నాథపురంలోని పలు డివిజన్లలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది.
పొత్తు ధర్మం పాటించరా?
పొత్తు ధర్మం పాటించాలని, మనకు కేటాయించిన డివిజన్లు మినహా మిగిలిన డివిజన్లలోను నామినేషన్లు ఉపసంహరించుకొనకుంటే ఆయా కార్యకర్తలపై చర్యలు తప్పవని బీజేపీ నాయకులు కార్యకర్తలను హెచ్చరిస్తున్నారు. తమకు అన్యాయం జరిగిందని తమ సత్తా చాటుతామని పలువురు కార్యకర్తలు బీజేపీ నాయకులు వద్ద చెప్పినట్టు తెల్సింది. దీంతో తాము ఓడిపోతామనే గుబులు టీడీపీ నాయకుల్లో మొదలయ్యింది. దీంతో వారు ఏదోలా నామినేషన్ ఉపసంహరించే విధంగా చూడాలని ఇరుపార్టీ నాయకులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం మూడు గంటలలోపు బీజేపీ నాయకులు ఎన్ని నామినేషన్‌లు ఉపసంహరించుకొంటారో వేచి చూడాల్సిందే మరి.