
బీజేపీకి మిత్ర‘పోటు’
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీని అడుగడుగునా మోసం చేస్తున్న టీడీపీ
9 డివిజన్లలో మూడింట టీడీపీ నాయకులే
బీజేపీ జిల్లా అధ్యక్షుడు పోటీ చేస్తున్న డివిజన్‌లోనూ టీడీపీ రెబల్
రగిలిపోతున్న బీజేపీ శ్రేణులు..
కాకినాడ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలుగుదేశం పార్టీ అసలు రంగు బయటపడింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో మిత్రపక్షమైన బీజేపీకి టీడీపీ అడుగడుగునా వెన్నుపోటు పొడుస్తోంది. తమకు పట్టులేని డివిజన్లను బీజేపీకి కేటాయించిన టీడీపీ.. ఆ తర్వాత ప్లేటు తిప్పేసింది. పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన 9 డివిజన్లలో మూడింట తమ నాయకులనే రెబల్స్‌గా బరిలోకి దించింది. టీడీపీ తీరుతో ఖిన్నులైన బీజేపీ నాయకులు ఇక తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
అన్ని డివిజన్లలోనూ టీడీపీ అభ్యర్థులను ఓడించడం ద్వారా తమ సత్తా చాటాలని అంతర్గతంగా నిర్ణయించినట్లు తెలిసింది. మొత్తం 48 డివిజన్లలో 9 డివిజన్లను బీజేపీకి కేటాయించారు. మిగిలిన 39 స్థానాల్లో టీడీపీ బరిలోకి దిగింది. బుధవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిపోయింది. అయితే మిత్రపక్షాల ఒప్పందం ప్రకారం బీజేపీకి కేటాయించిన 9, 35, 47 డివిజన్లలో నామినేషన్లు వేసిన టీడీపీ అభ్యర్థులు మాత్రం తమ నామినేషన్లను ఉపసంహరించుకోలేదు.
టీడీపీ అధినాయకులు నామినేషన్లు వేసిన తమ అభ్యర్థులందరితో ముందుగానే నామినేషన్ల ఉపసంహరణ పత్రాల మీద సంతకాలు చేయించుకొని తమ వద్ద ఉంచుకున్నారు. అయితే ఈ డివిజన్లలోని టీడీపీ అభ్యర్థుల నుంచి మాత్రం నామినేషన్ల ఉపసంహరణ పత్రాలపై సంతకాలు చేయించుకోలేదు. టీడీపీ అధినాయకులు వ్యూహాత్మకంగానే ఈ డివిజన్లలో కూడా తమ అభ్యర్థులను బరిలోకి దింపినట్టు తెలుస్తోంది. దీనిపై బీజేపీ స్థానిక నాయకులు తమ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య టీడీపీ తీరుపై తమ పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
బీజేపీ జిల్లా అధ్యక్షుడికీ తప్పని ‘మిత్ర’పోటు..
9వ డివిజన్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. ఇక్కడ టీడీపీ రెబల్ అభ్యర్థిగా శ్రీకోటి అప్పలకొండ నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పోటీ చేస్తున్న డివిజన్‌లోనే టీడీపీ రెబల్ అభ్యర్థి బరిలోకి దిగడంపై ఆ పార్టీ నాయకులు సీరియస్‌గా ఉన్నారు. 35వ డివిజన్‌ను బీజేపీకి కేటాయించడంతో ఆ పార్టీకి చెందిన కొండాబత్తుల ప్రసాదరావు పోటీ చేస్తుండగా.. రమా ఆప్టికల్స్ రాంబాబు టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచారు.
బీజేపీ నాయకుల ఒత్తిడితో ఆయన్ని సంప్రదించిన టీడీపీ నేతలు.. వెంటనే నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే 47వ డివిజన్‌లో టీడీపీకి చెందిన కోళాబత్తుల అప్పారావు కూడా తన నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదు. అక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా బి.పద్మ పోటీలో ఉన్నారు. కాగా, నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 241 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచినట్లు అధికారులు చెప్పారు.