అధికార టీడీపీకి యథాశక్తి సహకరించిన పోలీసులు
కాకినాడ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: చెదురుమదురు సంఘటనలు, స్వల్ప ఉద్రిక్తతల నడుమ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు మంగళవారం ముగిశాయి. 64.78 శాతం పోలింగ్ నమోదైంది. 241 మంది అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను(ఈవీఎంలు) అధికారులు స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపరిచారు. సెప్టెంబర్ 1న ఫలితాలు వెలువడనున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు రెండు డివిజన్లు మినహా మిగిలిన 48 డివిజన్లలో పోలింగ్ నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది.
మొత్తం 2,29,373 మంది ఓటర్లలో 1,48,598 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు కొందరు పోలీసు అధికారులు ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి వత్తాసు పలికారు. ఇదే అదనుగా టీడీపీ అభ్యర్థులు స్వైరవిహారం చేశారు. 144 సెక్షన్‌ను అపహాస్యం చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ కేంద్రాల వద్దే ఎన్నికల ప్రచారం చేశారు. ఇదేమిటని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడికి ప్రయత్నించారు. అంతు చూస్తామంటూ బెదిరించారు.
ఓట్లు గల్లంతు.. జనం గగ్గోలు
చాలా డివిజన్లలో తమ ఓట్లు గల్లంతయ్యాయని పలువురు ఓటర్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఓటరు స్లిప్పులు ఇచ్చినా జాబితాలో పేర్లు లేవంటూ చాలామందిని అధికారులు వెనక్కి పంపించడం వివాదానికి దారి తీసింది. పలు చోట్ల వాగ్వాదాలు జరిగాయి. మరి కొన్నిచోట్ల ఘర్షణ వాతావరణం నెలకొంది.
‘నోటా’ ఆప్షన్ ఏది?
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు వినియోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నోటా (పై అభ్యర్థులు ఎవరికీ కాదు అన్న మీట) అవకాశం కనిపించకపోవడం వివాదాస్పదంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ అవకాశం ఉండదని పోలింగ్ అధికారులు వివరణ ఇచ్చారు.
పలు చోట్ల ఘర్షణలు
ఎన్నికల సందర్భంగా ఏటిమొగ, జగన్నాథపురం, రామారావుపేట, వెంకటనగరం తదితర ప్రాంతాల్లో టీడీపీ నేతల ఆగడాలను వైఎస్సార్‌సీపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని చెదరగొట్టారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులు ఆయా ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
ఆ నిబంధన టీడీపీ నేతలకు వర్తించదా?
ఎన్నికల సమయంలో స్థానికులు తప్ప ఇతర ప్రాంతాల నాయకులు ఎవరూ ఉండకూడదన్న నిబంధనను టీడీపీ నేతలు తుంగలో తొక్కారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన నాయకులు కాకినాడలోని వివిధ లాడ్జిలలో మకాం వేసి ఎన్నికలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆదేశాల మేరకు పలు ప్రాంతాల ఇంటెలిజెన్స్ అధికారులు టీడీపీ ఏజెంట్లుగా వ్యవహరించారు. పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ, అనపర్తి టీడీపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు వివిధ డివిజన్లలో కలియతిరిగారు.
ఓటింగ్‌కు ఉద్యోగులు దూరం
పోలింగ్ జరుగుతున్న కాకినాడలో మంగళవారం సెలవు ప్రకటించినప్పటికీ వేలాది మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు. ఐదారు వేల మంది ఉద్యోగులు నిత్యం కాకినాడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లి విధులు నిర్వహించుకుని సాయంత్రానికి తిరిగివస్తుంటారు. కాకినాడలో తప్ప శివారు ప్రాంతాలకు సెలవు లేకపోవడంతో వీరు ఓటింగ్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది.
ఇదెక్కడి న్యాయం ఎస్పీ?
అధికార పార్టీకి మద్దతు ఇవ్వలేదన్న సాకుతో 38వ డివిజన్‌లో విధులు నిర్వహిస్తున్న రాజమహేంద్రవరం ఎస్‌ఐ రాంబాబును జిల్లా ఎస్పీ విశాల్ గున్ని అక్కడి నుంచి తొలగించడం ఓటర్లను విస్మయపరిచింది. ఆ ఎస్‌ఐ వైఎస్సార్‌సీపీకి సహకరిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో ఆయనను తొలగించారు. అయితే, అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్ టీడీపీకి ఓట్లేయాలని చెబుతున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం గమనార్హం. కొన్ని డివిజన్లలో పోలింగ్ బూత్‌ల వద్దే టీడీపీ నాయకులు పోలీసుల సాయంతో యథేచ్ఛగా ఓటర్లకు స్లిప్పులతో పాటు డబ్బు పంపిణీ చేశారు. పోలింగ్ కేంద్రాల్లో అధికార పార్టీ నేతలు హల్‌చల్ సృష్టించినా, ఓటర్లను గుంపులు గుంపులుగా తీసుకువచ్చి పోలింగ్ బూత్‌ల్లోకి చొరబడుతున్నా పోలీసులు అదేమని ప్రశ్నించకపోగా యథాశక్తి సహకరించారు.