ఓటు.. రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. మన భవిష్యత్‌ను.. దేశ భవిష్యత్‌ను నిర్ణయించడంలో శక్తిమంతమైన ఆయుధం. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆత్మలాంటిది. అటువంటి అస్త్రాన్ని ఉపయోగించుకునేందుకు దేశ, విదేశాల నుంచి స్వస్థలాలకు వస్తూ ఉంటే.. ఇక్కడ ఉన్న వాళ్లు మాత్రం తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరు ఉపయోగించుకునేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కార్మికశాఖ దుకాణాలను, చిరు వ్యాపార సంస్థలను కూడా మూయించింది. అయినా నగరంలో అనేక మంది ఓటును వినియోగించుకో లేదు. ఓ పక్క గ్రామీణ ఓటర్లు ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు వేసి తమ వంతు బాధ్యతను శ్రద్ధగా నిర్వర్తిస్తుంటే.. హక్కులు, విలువలు, నైతికత, బాధ్యతలు అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే.. నగర ఓటర్లు మాత్రం ప్చ్!
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలోని 16 నియోజకవర్గాల పోలింగ్ సగటు 81.10 శాతం కాగా విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల సగటు కేవలం 66.48 శాతం మాత్రమే. జిల్లా ఓటింగ్ సరాసరి కంటే 14.62 శాతం తక్కువ. నగరంలోనూ 80 శాతం పోలింగ్ అయి ఉంటే జిల్లా పోలింగ్ శాతం మరింతగా పెరిగేది. పట్టణ ప్రాంతాల కంటే ప్రజల కంటే గ్రామీణ ప్రాంత ప్రజలే ప్రజాస్వామ్యంపై నమ్మకంతో ఓటు తమ ఆయుధంగా భావిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ సెలవు ఇచ్చి, విస్తృతంగా ప్రచారం చేసినా నగరవాసులు సద్వినియోగం చేసుకోలేకపోయారు.
ఇక్కడే తక్కువ ఓటింగ్..
జిల్లాలో అతి తక్కువ ఓటింగ్ 65.78 విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నమోదైంది. మిగిలిన రెండు నియోజకవర్గాల్లో అంతకంటే గొప్పగా ఏమీ లేదు. విజయవాడ తూర్పులో 67.55, పశ్చిమంలో66.12 శాతం మాత్రమే ఓటింగ్ జరిగింది. సుమారు 35శాతం మంది ఓటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
తొలగించిన ఓట్లే ఎక్కువ..
నగరంలో 35శాతం మంది ఓటు హక్కు వినియోగించుకోకపోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఓటింగ్‌పై అనేక మందికి ఆసక్తి లేకపోవడం, నేను ఓక్కడినే ఓటు వేయకపోతే ఏమీ కాదులే.. అనే నిర్లప్తత ఎక్కువగా కనపడుతోంది. కాగా కొంతమంది ఆసక్తిగా ఎన్నికల బూతు వరకు వెళ్లి అక్కడ వారి ఓటు కనపడలేదు. గత ఎన్నికల్లో ఓటు వేసిన వారి ఓట్లు ఈసారి గల్లంతయ్యాయి. ముఖ్యంగా వైఎ స్సార్ సీపీ అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో ఓట్లు టీడీపీ వాళ్లు తొలగించారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా ఎన్నికలకు ముందు అనేక వేల మంది తమ ఓటును జాబితాలో ఉందో లేదో చూసుకోలేదు. అలాగే కొత్తగా చేర్చిన ఓట్లను కూడా ఒకేచోట లేవు. ఒకే కుటుంబంలో ఓట్లు వేర్వేరు చోట్ల వచ్చాయి. దీంతో ఓటర్లు నానా ఇబ్బందులు పడగా.. మహిళలు ఓటు వేయకుండానే వెళ్లిపోయారు.
పేదల బస్తీలోనే ఓటింగ్ ఎక్కువ..
విద్యావంతులు, ధనవంతులు ఉన్న ప్రాంతాల కంటే పేదల బస్తిలోనే ఓటింగ్ ఎక్కువగా జరిగింది. మండుటెండలో క్యూలో నిలబడానికి ఇష్టపడక చాలా మంది ఓటుకు దూరంగా ఉన్నారని పరిశీలకులు చెబుతున్నారు.
అభ్యర్థులు ఆలోచనలు తారుమారు..
ఓటింగ్ ఎక్కువగా జరిగితే గెలిచిన అభ్యర్థులకు మెజార్టీ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అలాగే అభ్యర్థుల విజయావకాశాలు స్పష్టంగా తెలుస్తాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే తక్కువ పోలింగ్ జరిగితే అభ్యర్థుల ఆలోచనలు తారుమారు అయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment